అజిత్ పవార్ మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
‘ఈరోజు ఉదయం విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ హఠాత్తుగా మరణించడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. తీవ్ర బాధకు గురిచేసింది. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు అందులో పేర్కొన్నారు.
అజిత్ పవార్ మృతిపై కేబినెట్ సంతాపం..
విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతిపై ఏపీ కేబినెట్ సంతాపం వ్యక్తం చేసింది. మంత్రి మండలి సమావేశం ప్రారంభ సమయంలో అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. ప్రమాదంలో అజిత్ పవార్‌తో సహా ఐదుగురు చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. అజిత్ పవార్‌తో తనకు ఉన్న పరిచయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ముంబై నుంచి బారామతి వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణంతో దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మృతి తీరని లోటని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అజిత్ పవార్ మృతిపై పవన్ కల్యాణ్ సంతాపం..
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్‌సీపీ అధ్యక్షుడు, ఎన్‌డీఏ కూటమి నాయకులైన అజిత్ దాదా పవార్ ఈరోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారనే విషాద వార్త విని తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం సోషల్ మీడియా వేదికగా అజిత్ పవార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన చేసిన అంకితభావంతో కూడిన ప్రజాసేవ, మహారాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అందించిన అపారమైన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ప్రజల పట్ల అజిత్ పవార్‌కున్న నిరంతర నిబద్ధతను గౌరవంతో స్మరించుకుంటారని తెలిపారు. ఆయన మరణం పట్ల నేను ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఈ తీవ్ర దు:ఖ సమయంలో అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అజిత్ పవార్ మృతిపై పీవీఎన్ మాధవ్ విచారం..
అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హృదయ విదారక ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. మృతుల కుటుంబాలకు భగవంతుడు ధైర్యం చేకూర్చాలని ఆకాంక్షించారు.
అజిత్ పవార్ మృతికి రామ్మోహన్ సంతాపం..
అజిత్ పవార్ మృతికి కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందడం అత్యంత విషాదకరమని తెలిపారు. ఈ ఘటనతో ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, అలాగే ఈ నష్టంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక సానుభూతి వ్యక్తం చేశారు. ప్రజాజీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలవాలని, ఈ కఠిన సమయంలో శోకతప్తులైన కుటుంబానికి, అభిమానులకు ధైర్యం, బలం కలగాలని రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు.
