10 వేల కోసం రైతును వేధించిన బీట్ అధికారి రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్
గుండాల,నేటిధాత్రి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో అవినీతి అధికారి అసలు రూపం మరోసారి బయటపడింది. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ఫారెస్ట్ శాఖ అధికారి సిగ్గు లేకుండా లంచాలు వసూలు చేస్తూ ఏసీబీకి చిక్కడం తీవ్ర కలకలం రేపింది. గుండాల మండలం సాయనపల్లి పరిధిలో పనిచేస్తున్న ఫారెస్ట్ బీట్ అధికారి బానోతు నరేష్, సాయనపల్లి గ్రామానికి చెందిన పోడు రైతును బెదిరిస్తూ రూ.10,000 లంచం డిమాండ్ చేశాడు.
ఇబ్బందులు పెట్టకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చిన నరేష్‌పై బాధిత రైతు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో డిఎస్పి,వై రమేష్ ఆధ్వర్యంలో అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన ఆపరేషన్‌లో రైతు నుండి లంచం స్వీకరిస్తున్న సమయంలోనే నరేష్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారి, బదులుగా వారినే దోపిడీ చేయడం పై మండిపడుతున్నారు. మారుమూల గ్రామాల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తుండగా ఏసీబీ చర్యలతో ప్రజల్లో ధైర్యం పెరుగుతోంది.
లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి అంటూ ఏసీబీ అధికారులు పిలుపునిచ్చారు. పోడు రైతులను వేధించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
