చిరంజీవి పాట రీమిక్స్ లోనూ ఆయనే…
పాత పాటలు రీమిక్స్ చేసి యంగ్ హీరోస్ నటించడం చూశాం. కానీ, ఇప్పుడు తన ఓల్డ్ సాంగ్ ను రీమిక్స్ చేసి, అందులో తానే నర్తించడానికి సిద్ధమయ్యారు మెగాస్టార్. ఆ ముచ్చటేంటో చూద్దాం.
కొన్ని నెలలుగా మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) అభిమానులను ఊరిస్తూనే ఉంది ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రం. జనవరిలో సంక్రాంతి కానుకగా వస్తుందని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు నిరాశ కలిగింది. తరువాత అదుగో ఇదుగో అంటూ కాలం కరిగిపోతోంది. ఈ చిత్రంలోని కొన్ని లిరికల్స్ అభిమానులను అలరించాయి. ఇటీవల ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ పై ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించారని విశేషంగా వినిపిస్తోంది. అది ఓ రీమిక్స్ సాంగ్ అనీ చెబుతున్నారు. అంతేకాదు – అది చిరంజీవి నటించిన సాంగ్ కు రీమిక్స్ అనీ తెలుస్తోంది. అదే ఇప్పటి విశేషం! ఇంతకూ అది ఏ సినిమాలోని సాంగ్ అంటే చిరంజీవి హిట్ మూవీ ‘అన్నయ్య’ (Annayya) లోని ‘ఆట కావాలా. పాట కావాలా…’ అంటూ సాగే ఐటమ్ సాంగ్. అప్పట్లో నంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న సిమ్రన్ ఆ పాటలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఆ పాట ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొంది. ఈ సాంగ్ రీమిక్స్ రూపంలో ‘విశ్వంభర’లో ఉందని తెలిసి ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.
గతంలో పేరడీ సాంగ్స్ లో తమ పాత పాటలకు తామే నర్తించి అలరించిన స్టార్స్ ఉన్నారు. కానీ, ఒకే పాటను వేరేగా రీమిక్స్ చేసి నటించిన వారు అంతగా కానరారు. ఆ రూటులో చిరంజీవి సాగుతూ, నవతరం ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ‘అన్నయ్య’ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూర్చారు. అందులోని పాటను ఈ సారి రీమిక్స్ చేయడానికి భీమ్స్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ‘విశ్వంభర’కు కీరవాణి సంగీతం అందించారు. కానీ, ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ‘అన్నయ్య’ రీమిక్స్ కు వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో కంపోజ్ చేయించారని సమాచారం. మరి ‘అన్నయ్య’లోని రీమిక్స్ తో చిరంజీవి ఫ్యాన్స్ ను ఎలా చిందేయిస్తారో చూద్దాం.