ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎర్రజెండాల సంఘీభావం

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎర్రజెండాల సంఘీభావం

కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని డిమాండ్

నర్సంపేట,నేటిధాత్రి:

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకై నర్సంపేట డిపోలో కొనసాగుతున్న సమ్మెకు రాష్ట్ర ఏఐటీయూసీ సభ్యుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి మునిశ్వర్, సీపీఐ జిల్లా నాయకులు సంఘీభావం తెలిపారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేటీకరణ నుండి కాపాడేందుకు ముందువరుసలో ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద రెండు కోట్ల మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్నప్పటికీ కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.ఎండ, వాన, చలి తేడా లేకుండా అధిక పని గంటలు పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రక్రియ 90 శాతం పూర్తయిందని, నియామక తేదీ ప్రకటించడంలో ఆలస్యం చేస్తూ కార్మికుల జీవితాలతో ఆటలాడుతోందని ఆరోపించారు.
ఈ పోరాటం ప్రజా ఉద్యమంగా మారుతుందని, ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకుంటామని హెచ్చరించారు.డిపో ఉద్యోగుల సంఘం కార్యదర్శి లాడే శ్రీకాంత్, తెలంగాణ ఉద్యమకారుడు వేముల రవి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన ఏఐటీయూసీ, సీపీఐ నాయకులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version