రంగశాయిపేటలో గ్రామదేవత బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు
వరంగల్ తూర్పు నేటిధాత్రి.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 42వ డివిజన్ రంగశాయిపేటలో గ్రామదేవత బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. నెహ్రూ కూడలిలో రంగశాయిపేట యూత్ ఫోర్స్ (ఆర్. వై. ఎఫ్), ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, అలాగే రామాలయం వద్ద కొల్లూరి రిషినంద్ ట్రస్ట్, శ్రీరామ భజన మండలి సహకారంతో ఈ వేడుకలను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు.
ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సంప్రదాయ ఆనవాయితీ ప్రకారం రెండు చోట్ల తొలి బోనాన్ని కుమ్మర (శాలివాహన) కులానికి చెందిన భక్తులు సమర్పించారు. ప్రతి సంవత్సరం గ్రామదేవత బొడ్రాయికి తొలి బోనం కుమ్మరి కులస్తుల చేతుల మీదుగానే జరగడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, డప్పు చప్పుళ్ల నడుమ బోనాన్ని ఊరేగింపుగా బొడ్రాయి దేవత వద్దకు తీసుకువచ్చారు. గ్రామంలో సుభిక్షం, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు బొడ్రాయి దేవతను ప్రార్థించారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి, బోనాలను నెత్తిన మోసుకుంటూ వచ్చిన మహిళలు, భక్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా కుమ్మర కుల పెద్దలు మాట్లాడుతూ, గ్రామదేవతలకు తొలి బోనం కుమ్మరి కులస్తులే సమర్పించడం అనాదిగా తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని తెలిపారు. ఈ సంప్రదాయాన్ని నేటితరం కూడా కొనసాగిస్తూ, గ్రామ సంక్షేమం కోసం ప్రార్థనలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాలివాహనులు ఆవునూరి రవి, కుమారస్వామి, లక్ష్మీ, కందికొండ మోహన్ సుధాకర్, రమేష్, కుమార్, బిక్షపతి, శ్రీనివాస్, కృష్ణ, రాజు, మల్లేశం, రాజన్న, వెంకటేశం, దేవేందర్, సురేష్, హరీష్, వంశీ, వీరేశం, ఆర్.వై.ఎఫ్ బాధ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
