మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు పూర్తి…

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లు పూర్తి

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్

ఎన్నికల నిర్వహణకు 450 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు

ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో సెక్షన్ 163 BNSS 144 సెక్షన్ అమలు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ తెలిపారు.
ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ శ్రీ నరేష్ కుమార్ ఎన్నికల విధుల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో పోలీసు అధికారులు, సిబ్బందితో బ్రీఫింగ్ నిర్వహించారు. ఎన్నికల ప్రాముఖ్యత, విధుల నిర్వహణలో పాటించాల్సిన నియమాలు, సిబ్బంది చేయవలసిన చేయకూడని అంశాలపై అడిషనల్ ఎస్పీ సమగ్రంగా వివరించారు.

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 30 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 86 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగింది.ఇందులో 26 లొకేషన్స్ ఉన్నాయి. ఎన్నికల భద్రత కోసం 450 మంది పోలీసు సిబ్బందిని నియమించడం జరిగింది. పోలింగ్ సామగ్రిని పటిష్ట ఎస్కార్ట్‌తో తరలించేందుకు 8 రూట్లలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి రెండు రూట్లకు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి తో పాటు స్ట్రైకింగ్ ఫోర్స్, ప్రతి నాలుగు రూట్లకు డీఎస్పీ స్థాయి అధికారి తో పాటు స్ట్రైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. అదనంగా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, సీఐల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్, ఎస్‌ఐల ఆధ్వర్యంలో పెట్రోలింగ్ టీమ్స్, రూట్ మొబైల్స్ మరియు బ్లూ కోర్ట్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో ఒక అడిషనల్ ఎస్పీ, ముగ్గురు డిఎస్పీలు, పది మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, మిగతా పోలీస్ సిబ్బంది ఉన్నారు
ఎన్నికల సందర్భంగా పోలీసుల విధి విధానాలపై స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు తెలిపారు. పౌరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా, ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్లు,ఇంక్ బాటిళ్లు, వాటర్ బాటిళ్లు తీసుకువెళ్లడం నిషేధమని, పోలింగ్ బూత్‌లో సెల్ఫీలు దిగడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, కాటారం డిఎస్పి సూర్యనారాయణ,సిఐలు ఆర్‌ఐ, ఎస్‌ఐలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version