దసరా పండుగను శాంతియుతంగా జరుపుకుందాం – ఎస్ఐ దీకొండ రమేష్
– డ్రగ్స్‌కి బానిసైతే భవిష్యత్తు అంధకారం
– పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే జీవితం పాడవుతుంది.
– తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించాలి
– మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తప్పవు
ఓదెల మండలం పోత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ బుధవారం ప్రజలకు సూచనలు చేశారు. దసరా పండుగను కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సమైక్యంగా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా గ్రామాల్లో జరిగే జమ్మి వేడుకలు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగాలని, అందరూ పరస్పర సహకారంతో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ… చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మద్యం, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తు పాడు చేసుకోకూడదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటోందని గుర్తుచేశారు. డ్రగ్స్ వినియోగం, విక్రయం, సరఫరా, గంజాయి పండించడం వంటి చర్యలు చట్టపరంగా తీవ్ర నేరాలని, వాటిలో ఇరుక్కుంటే తప్పించుకోవడం అసాధ్యమని స్పష్టం చేశారు. అలాగే రాత్రి వేళల్లో రహదారుల వెంట బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని, అలాంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఒక్కసారి పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటే యువకుల భవిష్యత్తు అంధకారమవుతుందని, ఇలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపి చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా క్రమంగా పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు.గ్రామాల్లోని యువజన సంఘాలు పోలీసులకు సహకరించి మత్తు నియంత్రణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతలు కాపాడేందుకు అందరూ సహకరించాలని, పండుగ ఆనందాన్ని సమైక్యంగా పంచుకోవాలని ఎస్ఐ దీకొండ రమేష్ ప్రజలను కోరారు.