ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తాహసిల్దార్ కార్యాలయం ముట్టడి
నడికూడ,నేటిధాత్రి:
వికలాంగులకు,వృద్ధులకు,వితంతువులకు,ఒంటరి మహిళలకు,నేత,గీత,బీడీ కార్మికులతో పాటు ఇతర పెన్షన్ దారులందరికీ పెన్షన్ పెరగాలని,నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ వెంటనే మంజూరు కావాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తాహసిల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
పై విషయమై తమతో మనవి చేయునది ఏమనగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ రూ.4000 నుండి రూ 6000/- పెంచుతామని, అలాగే వృద్ధులు వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారుల పెన్షన్లు రూ. 2000/-నుండి రూ 4000/- పెంచుతామని హామీ ఇచ్చారు.ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాగ్దానం చేశారు.కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవీ చేపట్టి 22 నెలలు గడిచినా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచలేదు.ఇది ఘోరమైన మోసం.ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ వికలాంగులు,వృద్ధులు వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారులకు ఏ మాత్రం సరిపోవడం లేదు.దీని వల్ల వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి.ప్రస్తుత పెన్షన్ వల్ల నెల రోజుల పాటు పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యంగా జీవించే పరిస్థితి కూడా లేదు.అంగవైకల్యం, నిస్సహాయ స్థితి,నిరాదరణ వల్ల ఇప్పటికే ఎన్నో అవమానాలు,అవహేళనలు ఎదుర్కొంటున్న వికలాంగులు, వృద్ధులు,వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారుల యొక్క దీన పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. కనీసం సరియైన తిండి తినడానికి కూడా సరిపోని పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని గుర్తు చేస్తున్నాం.
కనుక ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వికలాంగుల పెన్షన్ రూ 6000/-అలాగే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేత గీత బీడీ కార్మికులతో పాటు ఇతర చేయూత పెన్షన్ దారుల పెన్షన్ రూ 4000/- పెంచాలని మరియు పూర్తి కండరాల క్షీణత కలిగిన వారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వలె నెలకు రూ 15000/- పింఛను ఇవ్వాలని అలాగే నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ మంజూరు చేయాలని తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని నడికూడ మండల తహసీల్దార్ పోలేపాక రాణి ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ చిలువేరు సంపత్ మాదిగ,నడికూడ మండల అధ్యక్షులు సుమన్ మాదిగ, కార్యదర్శి మేకల రవి మాదిగ,రంజిత్ మాదిగ, శ్యామ్ మాదిగ,మొగిలి మాదిగ,రాజు,రమేష్,ప్రణయ్,తదితరులు పాల్గొన్నారు.