పీసీబీ నివేదికలో వాస్తవాలు లేకుంటే అన్నంత పని చేస్తా…

పీసీబీ నివేదికలో వాస్తవాలు లేకుంటే అన్నంత పని చేస్తా

అధికారుల నివేదిక కోసం ఎదురు చూస్తా.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

అరబిందో ఫార్మా కంపెనీలో కలుషిత జలాల విషయంగా తనిఖీలు చేసిన కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు ఇచ్చే నివేదిక కోసం ఎదురు చూస్తానని, వారి నివేదిక చూసిన తర్వాత అరబిందో వ్యవహారంపై ఏం చేయాలో నిర్ణయిస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారుల తనిఖీల నేపథ్యంలో శనివారం అరబిందో ను తగులబెట్టాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నానని చెప్పారు. గతంలో కూడా ఇలాంటి తనిఖీలు జరిగాయని వాటివల్ల ఒరిగిందేమీ లేదని, ఇప్పుడు కూడా అధికారులు ఇచ్చే నివేదికలో వాస్తవాలు లేకపోతే తాను అన్నంత పని చేస్తానని హెచ్చరించారు.పోలేపల్లి ఫార్మా సెజ్ లోని అరబిందో ఫార్మా కంపెనీలోని కలుషిత జలాలను సమీపంలోని ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి మళ్లిస్తుండటంతో ఆ చెరువులోని చేపలు చనిపోతున్నాయని, ఈ నీటి కారణంగా రైతుల పొలాల్లో పంటలు కూడా దెబ్బతింటున్నాయని గతంలో అధికారులతో పాటు అసెంబ్లీలోనూ ఫిర్యాదు చేసిన అనిరుధ్ రెడ్డి శుక్రవారం అరబిందో నుంచి కలుషిత జలాలను మళ్లీ చెరువులోకి మళ్లించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పీసీబీ అధికారులకు శనివారం ఒక్క రోజు టైమ్ ఇస్తున్నానని, ఈ ఒక్క రోజులో వారు చర్యలు తీసుకోని పక్షంలో ఆదివారం ఉదయం 11 గంటలకు తాను నేరుగా అరబిందో వద్దకు వెళ్లి గతంలో ప్రకటించిన విధంగానే అరబిందోను తగులబెడతానని అల్టిమేటం జారీ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నేపథ్యంలో అనిరుధ్ రెడ్డి హెచ్చరించిన మేరకు పీసీబీ అధికారులు శనివారం హుటాహుటిన సెజ్ కు వచ్చి అరబిందో ఫార్మాలో తనిఖీలు నిర్వహించడంతో పాటుగా కలుషిత జలాలను మళ్లించిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. తాము తనిఖీలలో గుర్తించిన అంశాలపై నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని చెప్పారు. శనివారం మీడియాకు పంపిన ప్రకటనలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. తాను కోరిన విధంగా పీసీబీ అధికారులు చర్యలు తీసుకోవడంలో భాగంగా తనిఖీలు చేసిన కారణంగా ఆదివారం తాను అరబిందోను తగులబెడతానన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నానని, తనిఖీల అనంతరం పీసీబీ అధికారులు ఇస్తామన్న నివేదిక కోసం ఎదురుచూస్తామని చెప్పారు. ఈ నివేదికను చూసిన తర్వాత అరబిందో విషయంగా ఏం చేయాలో నిర్ణయిస్తామని తెలిపారు. గతంలోనూ తాను పీసీబీ అధికారులకు ఫిర్యాదులు చేయడం, వారు ఇలాంటి అరబిందోలో నిర్వహించడం జరిగిందని గుర్తు చేసారు. శుక్రవారం అరబిందో నుంచి కలుషిత జలాలు చెరువులోకి మళ్లించిన వీడియోలను కూడా తాను మీడియాకు విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అరబిందో నుంచి కలుషిత జలాలను ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి మల్లిస్తున్న మాట వాస్తవమని, దీని వల్ల రైతులు నష్టపోతున్నది కూడా నిజమేనని, అయితే ఈ వాస్తవాలు పీసీబీ అధికారుల నివేదికలో కనబడకపోతే తాను అన్నంత పని చేస్తానని మరోసారి హెచ్చరించారు. పీసీబీ అధికారులు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిజాయితీగా తమ నివేదికను ఇవ్వాలని అనిరుధ్ రెడ్డి కోరారు. కాగా శనివారం అరబిందోలో తనికీలు నిర్వహించిన పీసీబీ అధికారుల్లో జాయింట్ చీఫ్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్, పీసీబీ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్, పీసీబీ ఏఇ, జీఎం ఇండస్ట్రీస్ తదితర అధికారులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version