ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగంలో యువత….
పాలకుల నిర్లక్ష్యంతో రామకృష్ణాపూర్ వెలవెల…
రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పగల నాయకులు ఉన్నా సరే ఉపాధి కరువు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పగల నాయకులు ఈ ప్రాంతంలో అనేకమంది ఉన్నా సరే ఉపాధి కరువైంది.ఈ ప్రాంతంలో ఒక్క ఇండస్ట్రీ కూడా ఏర్పాటు చేయకపోవడం తో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.బొగ్గు బాయిలు మూతపడటంతో సరైన ఉపాధి సౌకర్యాలు లేక రామకృష్ణాపూర్ పట్టణంలోని యువత నిరుద్యోగులుగా మారిపోయారు.
మహిళలు, యువతులు , యువకులు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వివిధ దుకాణాలలో ఉపాధి నిమిత్తం వెళుతున్నారు.కనీసం కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు సైతం లేని క్యాతన్ పల్లి మున్సిపాలిటీకి రాబోయే ఎన్నికలు పెద్ద సవాలు గానే నిలిచాయి. శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో యువతలో కొంత నిరుత్సాహమే ఉందని విశ్లేషకులు అంటున్నారు.
గతంలో పరిపాలించిన రాష్ట్ర స్థాయి నాయకుడైన బాల్క సుమన్ కూడా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పై చిన్న చూపు చూశారనే నెపంతో ఇక్కడి ప్రజలు మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకున్నా సరే ప్రస్తుతం చెన్నూర్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కి కూడా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ అంటేనే చిన్న చూపా..? అనే సందేహాలు సైతం ప్రజల్లో లేకపోలేదు. జిల్లా చుట్టూ అభివృద్ధి జరుగుతున్న సరే ఈ మున్సిపాలిటీలో
మాత్రం అభివృద్ధి ఆమడ దూరంలో ఉందనే భావన ప్రజల్లో వినబడుతోంది. గతం నుండి ప్రస్తుతం వరకు నియోజకవర్గాన్ని పరిపాలించే నేతలు స్థానికేతరులే కావడం, ఇక్కడి ప్రజల బాగోగులు తెలవకపోవడం అందుకు కారణమనే సందేహం లేకపోలేదు. మున్సిపాలిటీలోని 22 వార్డులలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు సరిగా లేకపోవడంతో అనేక సమస్యలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలో జీవించేందుకు ఉపాధి లేక ప్రజలంతా వలస వెళుతున్నారు. ఇప్పటికైనా స్థానిక కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవ తీసుకోవాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.ఈ ఏరియా అభివృద్ధి జరగాలన్నా సరే, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా సరే ఏదైనా ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయించేలా మంత్రి చొరవ తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రానున్న రోజుల్లో ఆర్కేపీ ఉపరితల గని రెండో దఫా పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు ఎంత మందికి ఉపాధి దొరుకుతుందనే సందేహము లేకపోలేదు.ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో యువతకు ఉపాధి అవకాశం కలగాలంటే ఇండస్ట్రీలు ఏర్పాటు చేయించేలా స్థానిక మంత్రి చొరవ తీసుకోవాలని ప్రాంత ప్రజల నుండి డిమాండ్ వినిపిస్తుంది.
