*నేడు తుంకుంట గ్రామంలో నగర సంకీర్తన*
*జహీరాబాద్ నేటి ధాత్రి:*
అయోధ్య లోని శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ట జరిగి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం సాయంత్రం 7 గంటలకు జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో సంకీర్తన నగర నిర్వహించనున్నట్లు గ్రామ యువత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామంలోని శ్రీఆంజనేయ స్వామి మందిరం నుండి ఊరడమ్మ దేవాలయం వరకు సంకీర్తన చేస్తూ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా కుటుంబాలకు గ్రామంలోని హైందవ భగవద్గీత పుస్తకాలను అందజేస్తామని వివరించారు. ప్రతినిత్యం భగవద్గీత లోని తాత్పర్య సహితంగా ఒక శ్లోకం చిన్నారులకు అభ్యాసం చేయించాలని సంకల్పించినట్లు తెలిపారు. సంకీర్తన అనంతరం మహాప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. గ్రామంలో ప్రతి పౌర్ణమి రోజున ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించునున్నట్లు గ్రామ హిందూ సంఘటన్ సభ్యులు జనార్ధన్ రెడ్డి, ఓనం రెడ్డి, శివరాజ్, నర్సిములు, కిష్టన్న, అంజన్న, రాములు, నారాయణ లు వెల్లడించారు.
