లింగయ్యత్ ధర్మ స్థాపన దినోత్సవం సందర్భంగా ఖేడ్ బసవ కూడలిలో జెండా ఆవిష్కరణ
జహీరాబాద్ నేటి ధాత్రి:
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో గల బసవ కూడలిలో లింగయ్యత్ ధర్మ స్థాపన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ లింగయ్యత్ సంఘ అధ్యక్షులు,జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, మహాత్మా బసవేశ్వర్ 12వ శతాబ్దానికి చెందిన గొప్ప సామాజిక సంస్కర్త, తత్వవేత్త, కవి మరియు లింగాయత్ మత స్థాపకులలో ఒకరని అన్నారు. ఆయన కుల వివక్షను, మూఢనమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించి, సమాజంలో సమానత్వం మరియు మానవ గౌరవాన్ని నెలకొల్పేందుకు కృషి చేశారని పేర్కొన్నారు.
‘కాయకవే కైలాస’ (పని దైవంతో సమానం) అనే సూత్రంతో శ్రమకు గౌరవం కల్పించిన మహనీయుడని తెలిపారు. క్రీ.శ. 1131లో కర్ణాటక రాష్ట్రంలోని బసవన బాగేవాడిలో జన్మించిన బసవేశ్వర్, మంత్రిగా, తత్వవేత్తగా ప్రజల మధ్య సంస్కరణ ఉద్యమాన్ని నడిపారని అన్నారు.
లింగాయత్ మతం ద్వారా ప్రతి వ్యక్తి శివభక్తిని ప్రతిబింబించేలా ఇష్టలింగం ధరించాలని బోధించారని, అలాగే అనుభవ మంటపం ద్వారా పురుషులు, మహిళలు అన్న తేడా లేకుండా అందరినీ ఆహ్వానించి సామాజిక, ఆధ్యాత్మిక చర్చలకు వేదిక కల్పించారని వివరించారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించి, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సమాజ సంస్కరణల మార్గదర్శకుడు మహాత్మా బసవేశ్వర్ అని ఎంపీ కొనియాడారు.ఈ కార్యక్రమంలో లింగయ్యత్ సంఘ నాయకులు, భక్తులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
