కాళేశ్వరం–నిజాంసాగర్ పై కవిత విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్టు పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఒరిగిందేమీ లేదని విమర్శలు చేశారు. ఇవాళ (శుక్రవారం) కామారెడ్డిలో కవిత పర్యటించారు. పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో కవిత మాట్లాడారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూడికతీతను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు.
నిజాంసాగర్ టూరిజం, కౌలాస్ కోట ఓ స్పాట్‌గా ఏర్పాటు చేయాలని సూచించారు. మొంథా తుఫానుతో జిల్లాలో పత్తి రైతులు నష్టపోయారని చెప్పుకొచ్చారు. జుక్కల్ ప్రాంతంలో జిన్నింగ్ మిల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. జిన్నింగ్ మిల్ కోసం జాగృతి పోరాటం చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల అనుమతి పేరుతో డబ్బులు తీసుకోవద్దని సూచించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నియోజకవర్గంలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు కవిత.
సర్పంచ్ ఎన్నికల్లో యువత ముందుకు వచ్చి ఆయా సమస్యలపై పార్టీలను ప్రశ్నించాలని సూచించారు. రోడ్ల కోసం ఆందోళన చేస్తుంటే జుక్కల్ ఎమ్మెల్యే యువకుల మీద కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. యువతపై నమోదైన కేసులను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 317 జీవోతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సర్కార్ వెంటనే ఉద్యోగులను తిరిగి స్వస్థలాలకు పంపించాలని సూచించారు. గొర్రెల కోసం డీడీలు కట్టి చాలా మంది అప్పుల పాలయ్యారని పేర్కొన్నారు. అర్హులకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని కోరారు. ఆటోవాళ్లకు వేల్ఫెర్ బోర్డు ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
