సనాతన ధర్మం నిర్మూలన పేరుతో భయాందోళనలు..
గవర్నర్ ఆర్.ఎన్.రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ కొందరు సమాజంలోని ప్రజల మధ్య భయాందోళనలు రేకెత్తిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలాలు మారేకొద్దీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ తమిళనాడు రాష్ట్రంలో కొందరు మాట్లాడుతున్నారంటూ ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర సంచలనానికి దారితీశాయి..
సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ కొందరు సమాజంలోని ప్రజల మధ్య భయాందోళనలు రేకెత్తిస్తున్నారని గవర్నర్ ఆర్.ఎన్.రవి(Governor RN Ravi) ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసిలో ‘తమిళ కాశీ సంగమం’ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఓ ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. కాశీ, తమిళనాడు రాష్ట్రాల మధ్య అనుబంధం ఈనాటిది కాదన్నారు. సుమారు వెయ్యేళ్ళ క్రితం రాజేంద్ర చోళుడు ఇక్కడకు వచ్చి పవిత్ర గంగా జలాలను తీసుకెళ్ళారన్నారు. తమిళ ప్రజల హృదయాల్లో కాశీ చిరస్థాయిగా నిలిచిపోయిందని, దీనికి శివపెరుమాళ్ నిదర్శనమన్నారు.
కాలాలు మారేకొద్దీ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ తమిళనాడు రాష్ట్రంలో కొందరు మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి, ప్రజల మధ్య అనవసరమైన భయాందోళనలు రేకెత్తించడమే వారి ఉద్దేశమన్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో భారతీయార్ కోసం ప్రత్యేక కుర్చీని కేంద్రం ఏర్పాటు చేసిందని, ఇలాంటి అనేక మంచి పనులు కేంద్రం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ తదితరులు పాల్గొన్నారు.
