గోల్డెన్ అవర్‌ లో వెంటనే స్పందిస్తే ప్రాణాలను కాపాడొచ్చు

గోల్డెన్ అవర్‌ లో వెంటనే స్పందిస్తే ప్రాణాలను కాపాడొచ్చు

జైపూర్ ఎస్సై రాజశేఖర్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత,సీపీఆర్ విధానం రాహ్-వీర్ పథకం గురించి జైపూర్ ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ప్రమాదం జరిగిన వెంటనే సరైన సమయంలో స్పందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని ఈ కార్యక్రమంలో వివరించారు.ఈ సందర్భంగా ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన తరువాత తొలి 60 నిమిషాలు అత్యంత కీలకమని తెలిపారు.ఈ సమయంలో గాయపడిన వ్యక్తికి తక్షణ వైద్య సహాయం అందితే ప్రాణాపాయం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు.రక్తస్రావాన్ని ఆపడం, శ్వాస సక్రమంగా ఉండేలా చూడడం వంటి ప్రాథమిక చర్యల ద్వారా ప్రాణాలను రక్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ప్రమాద బాధితులకు తక్షణ సహాయం చేసి ప్రాణాలను కాపాడిన వ్యక్తులను ప్రభుత్వం “రాహ్-వీర్”లుగా గుర్తించి ₹25,000 నగదు బహుమతితో సత్కరిస్తుందని తెలిపారు.ఈ పథకం ద్వారా ప్రజల్లో సేవాభావాన్ని పెంపొందించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ముందుకు రావడానికి ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.అలాగే సీపీఆర్ చేసే విధానం గురించి వివరిస్తూ,గుండె లేదా శ్వాస ఆగిన సందర్భాల్లో సీపీఆర్ ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు.ముందుగా బాధితుని స్పందన,శ్వాసను పరిశీలించి, ఛాతిపై సరైన స్థానంలో నిమిషానికి 100–120 కంప్రెషన్‌ల వేగంతో ఒత్తిడి ఇవ్వాలని సూచించారు.శిక్షణ పొందిన వారు మాత్రమే మౌత్-టు-మౌత్ పద్ధతిని అనుసరించాలన్నారు.ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్ సేవలకు సమాచారం ఇవ్వాలని, గాయపడిన వ్యక్తిని అవసరం లేకుండా కదలించకూడదని సూచించారు.రక్తస్రావం ఉంటే గట్టిగా కట్టు కట్టి నియంత్రించాలని చెప్పారు.ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version