ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ల వితరణ

ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ల వితరణ

– ఇన్ఫోసిస్ ఆధ్వర్యంలో కంప్యూటర్లపంపిణీ

– ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తాం

– అయినవోలు గ్రామ సర్పంచ్ రఘు వంశీ గౌడ్

నేటి ధాత్రి ఐనవోలు:-

 

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐనవోలు మండలంలోని 15 ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమం గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం చేరువ చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగు.
ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి పులి ఆనందం, ఐనవోలు సర్పంచ్ గడ్డం రఘువంశీ గౌడ్, కొండపర్తి సర్పంచ్ అశోక్ రావు ముఖ్య అతిథులుగా హాజరై కంప్యూటర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే సాంకేతిక పరిజ్ఞానం అందించడం అవసరమని, ఈ దిశగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు.

ఈ వితరణకు ప్రత్యేకంగా కృషి చేసిన రాపాక స్వాతి, రాపాక నాగరాజు, అలాగే కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన గందె ప్రభాకర్, కరిమిళ్ల వెంకటేశ్వర్లు, ఐనవోలు ఉప సర్పంచ్ భాస్కర్‌లకు మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొండపర్తి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత, ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యాభివృద్ధికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారం ఎంతో ఆదర్శనీయమని వక్తలు కొనియాడారు.
ఇదే సమయంలో ఐనవోలు సర్పంచ్ గడ్డం రఘువంశీ గౌడ్ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించి విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని స్థానికులు మరియు విద్యాశాఖ అధికారులు ప్రశంసించారు. గ్రామీణ విద్యాభివృద్ధికి ఈ చర్యలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version