కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యం — గ్రామాల సమగ్ర అభివృద్ధి
ఐనవోలు మండలంలో రూ. 7.5 కోట్ల పనులకు ఎమ్మెల్యే నాగరాజు శంకుస్థాపన
అయినవోలు మండల కేంద్రంలో ఎమ్మెల్యేకు నిరసన సెగ
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపికలో పారదర్శకత లేదు
ఎమ్మెల్యేను నిలదీసిన సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు
నేటి ధాత్రి అయినవోలు :-
ఐనవోలు, ఒంటిమామిడిపల్లి, పున్నెల్ గ్రామాల్లో సిఆర్ఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ మరియు పంచాయతీరాజ్ నిధుల ద్వారా రూ. 7.5 కోట్ల వ్యయంతో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కే.ఆర్. నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీజీ క్యాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు పాల్గొన్నారు.గ్రామీణ అభివృద్ధే నిజమైన ప్రజా సేవ” — ఎమ్మెల్యే నాగరాజు
ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ,ప్రతీ గ్రామంలో ప్రాథమిక వసతుల మెరుగుదలే మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. రహదారులు, డ్రైనేజీలు బాగుంటే ప్రజల జీవన ప్రమాణాలు ఎత్తుకు చేరతాయి. ప్రజలు నమ్మి ఇచ్చిన ప్రతి రూపాయిని పారదర్శకంగా, నాణ్యతగా వినియోగిస్తాం. అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామాల నిజమైన అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నామని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ కాలనీలకు ప్రత్యేక నిధులు కేటాయించారని,
సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందిస్తున్నామని తెలిపారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మండిపాటు
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో భారీ దోపిడీ చేసిందని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని అన్నారు.ప్రస్తుతం ప్రజలకు అందుతున్న పథకాలు అన్ని బలహీన వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం” అని స్పష్టం చేశారు.
ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర — ఏర్పాట్లపై సమీక్ష
సమీపిస్తున్న ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర సందర్బంగా ఎమ్మెల్యే స్వయంగా శాఖల వారీగా అధికారులతో సోమవారం సమావేశమై జాతరకు అవసరమైన ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి
ఉప్పరపల్లి క్రాస్ రోడ్డులో 100 పడకల ఆస్పత్రి కోసం స్థల సేకరణ జరుగుతోందని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు.దీనివల్ల వర్ధన్నపేట, పర్వతగిరి ఐనవోలు మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు,అధికారులు పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుకు నిరసన నిరసన సెగ
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికపై సొంత కార్యకర్తలే నిలదీశారు
ఐనవోలులో ఇందిరమ్మ కమిటీ ఎంపిక పట్ల తీవ్ర అసంతృప్తి చెలరేగింది. కమిటీ ఎంపికలో పారదర్శకత లేకుండా సొంత అర్హులను పక్కనపెట్టి, అనర్హులకు అవకాశాలు కల్పించారని మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో నిజమైన అర్హులైన లబ్ధిదారుల పేర్లు గాలిలో కలిసిపోయి, రాజకీయంగానో, వ్యక్తిగత పరిచయంగానో ఉన్న వారికి మాత్రమే అందలమెత్తారని ఆరోపిస్తూ కార్యకర్తలు ఎమ్మెల్యేను ఎదిరించారు. “మేమే పార్టీ కోసం కష్టపడ్డాం… కానీ ఇళ్లు మాత్రం తగిన వారికి రాకుండా అనర్హులకు ఎందుకు?” అంటూ ఎమ్మెల్యే వద్దే ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంపికలు ఎలా జరిగాయి? ఎవరి ఆధారంగా జాబితా ఖరారు చేశారు? గ్రామస్థాయిలో పరిశీలన ఎందుకు జరగలేదని వారు వివరణ డిమాండ్ చేశారు.ఈ నిరసనతో నియోజకవర్గ రాజకీయాల్లో వేడి చెలరేగగా… కమిటీ ఎంపికను పునర్విమర్శించాలని, న్యాయపూర్వకంగా అర్హుల జాబితా ప్రకటించాలని కార్యకర్తలు స్పష్టంగా హెచ్చరించారు.
