చేవెళ్లలో అడిషనల్ జూనియర్ సివిల్ కోర్ట్ ప్రారంభం
చేవెళ్ల, నేటిధాత్రి :
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును శనివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ ఆఫ్ రంగారెడ్డి జిల్లా జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, చేవెళ్ల సివిల్ కోర్టు న్యాయమూర్తి దశరథ రామయ్య తో కలిసి నూతన జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జ్ కోర్టును ప్రారంభించారు. అంతకుముందు చేవెళ్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ మాట్లాడుతూ సామాన్యులకు సత్వర న్యాయమందించే లక్ష్యంతో ప్రభుత్వం చేవెళ్లలో జూనియర్ సివిల్ కోర్టును ఏర్పాటు చేసిందన్నారు. కొత్తగా కోర్టును ప్రారంభించడం ద్వారా పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి . శ్రీనివాస్ రెడ్డి, సి. మహేష్ గౌడ్, జనరల్ సెక్రటరీ, న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.