వైద్యుడిపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
నర్సంపేట, నేటిధాత్రి:
నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డులో ఉన్న వేద స్కానింగ్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌పై దాడి చేసిన వ్యక్తిని నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నర్సంపేట టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, గత నెల ఫిబ్రవరి 19 న ములుగు సతీష్ డాక్టర్ రిఫర్ చేసిన ఒక యువతికి వేద స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ నిర్వహించి రిపోర్టు ఇచ్చారు. అయితే ఆ రిపోర్టు తప్పుగా ఇచ్చారని ఆరోపిస్తూ మార్చి 22 న ఆ యువతి కుటుంబ సభ్యులు నలుగురు కలిసి స్కానింగ్ సెంటర్‌కు వచ్చి డాక్టర్‌పై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి దాడి చేసిన మోడెం విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.
ఈ సందర్భంగా నర్సంపేట టౌన్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ, వైద్యులపై దాడులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రవి కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
