ప్రభుత్వం రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలి
యూరియా యాప్ వల్ల రైతులకు ఇబ్బందులు
యాప్ కు బదులు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలి..
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
రైతుబంధు డబ్బులు పడక జిల్లాలో రైతాంగమంతా ఇబ్బంది పడుతున్నారని వెంటనే ప్రభుత్వం రైతుబంధు డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గురుజపల్లి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు ఇవ్వవలసిన రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. యాసంగి సాగు కు రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టవలసిన పరిస్థితి దాపురించిందని, రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారులను సంప్రదించవలసిన దుస్థితి నెలకొన్నది అన్నారు. రైతులకు యూరియా సరఫరా లో యూరియా యాప్ తో అనేక ఇబ్బందులు పడుతున్నారని, రైతులందరికీ ఈ యాప్ మీద అవగాహన ఉండ దని, ఈ యూరియా సప్లై ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులకు సకాలంలో యూరియా అందించాలని కోరారు. అట్లాగే ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ 500 ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందని వెంటనే సన్న వడ్ల బోనస్ కూడా రైతు ఖాతాలో జమ చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు మాతాంగి రామచందర్, కరిముల్లా, దోర్నాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
