నరకయాతన… కంకర రోడ్లపై ప్రయాణం..!
#అన్నదాతలకు, ప్రజలకు తప్పని తిప్పలు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండల ప్రజలకు, అన్నదాతలకు కంకర రోడ్లతో కష్టాలు తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మండల వ్యాప్తంగా పలు లింకు రోడ్లకు గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేయగా కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకొని కొంత మేరకు పనులు చేపట్టారు. అనంతరం సాధారణ ఎన్నికలు రావడంతో ప్రభుత్వం మారి పనులు నిలిచిపోయాయి. దీంతో కంకర తేలిన రోడ్లపై అన్నదాతలు, ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. నడక సైతం నరకప్రాయంగా మారిన దుస్థితి నెలకొంది. మండలంలోని గుండ్ల పహాడ్ నుండి మేడేపల్లి వరకు, నారక్క పేట నుండి నర్సంపేట మండలం రామ్ నగర్ వరకు, ముచింపుల నుండి నందిగామ వరకు, నల్లబెల్లి ఆర్ అండ్ బి రోడ్డు నుండి అనుములోని పల్లె వరకు, కొండాలపల్లి నుండి గుంటూరు పల్లె వరకు అక్కడి నుండి పెద్ద చెరువు కట్ట చివరి వరకు. తారు రోడ్ల నిర్మాణం కోసం 2023 జనవరిలో ఎం ఆర్ ఆర్ గ్రాంటు కింద నిధులు మంజూరు అయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఫార్మేషన్ పూర్తి చేసి కంకర వేసి తొక్కించారు. ఆ సమయంలోనే సాధారణ ఎన్నికలు రాగా పనులు ఆపివేశారు. అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అప్పటి నుండి రెండేళ్లగా కంకర తేలిన రోడ్లపైనే రైతులు, ప్రజలు ప్రయాణం సాగించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కంకరపై నడవవలసి వస్తుండడంతో దుక్కి టేద్దులు కాళ్లు పగిలిపోయి అనారోగ్యం పాలవుతున్నాయి. పలుమార్లు కాళ్లకు రక్త గాయాలైన కొన్ని దుక్కి టేద్దులు కంకర రోడ్లపైకి తీసుకువస్తే బెంబేలెత్తి పారిపోతున్న దుస్థితి చోటుచేసుకుంది. రోడ్ల పనులు పూర్తి చేయడంలో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న అపవాదు ఉంది. ఏది ఏమైనాప్పటికీ కంకర రోడ్లపై తక్షణమే తారు రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ లు ప్రత్యేక చొరవ తీసుకొని పనులు కొనసాగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
#సకాలంలో బిల్లులు చెల్లిస్తే పనులు పూర్తి చేస్తాం.
కాంట్రాక్టర్లు ఫార్మేషన్, కంకర పనులు పూర్తి చేయగా బీటీ పనులు మాత్రమే మిగిలాయి. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతోనే పనులు నిలిపివేశామని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. సమస్యను పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తదుపరి ఆదేశాల మేరకు పనులను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.
రజనీకాంత్, స్పెషల్ ఏఈ, పిఆర్ శాఖ.