సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులు వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో డిసిపి ఎ. భాస్కర్,జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ లతో కలిసి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ విస్తరణపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎల్.పి.జి. సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు,పైప్లైన్ సహజ వాయువు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని, అనుమతుల ప్రక్రియను సరళీకరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులకు సంబంధించిన అనుమతులను 24 గంటలలో మంజూరు చేసే విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని,ఆలస్యం అయితే డీమ్డ్ పర్మిషన్ గా పరిగణించడం జరుగుతుందని తెలిపారు.సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏర్పాటుకు సంబంధించిన రెంటల్/లీజ్ ఛార్జీలను తాత్కాలికంగా మాఫీ చేయడం జరిగిందని,పనుల వేగవంతానికి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు 24 గంటల పని సమయం,శబ్ద కాలుష్యం నిబంధనలను పాటించేలా అనుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.పి.ఎన్.జి.,ఎల్.పి.జి. మధ్య సమన్వయాన్ని పౌరసరఫరాల శాఖ సమర్థవంతంగా నిర్వహించాలని, అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేసి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు నిరంతర ఇంధన సరఫరా అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు,జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
