ధర స్థిరత్వం కేంద్ర బ్యాంకు బాధ్యత
గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆతిథ్య ఉపన్యాసంలో
ఆర్బీఐ పూర్వ గవర్నర్ డాక్టర్ దువ్వూరి
నేటి ధాత్రి, పఠాన్ చేరు:
ధర స్థిరత్వం ప్రధానంగా కేంద్ర బ్యాంకుల బాధ్యత (మనదేశంలో ఆర్బీఐ) అని ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు స్పష్టీకరించారు. గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాదులో ఆయన ‘కేంద్ర బ్యాంకుల ఆర్థిక విధి’, ‘సమస్యలను పరిష్కరించడం: కేంద్ర బ్యాంకింగ్ భవిష్యత్తు’ అనే రెండు అంశాలపై మంగళవారం ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ధర స్థిరత్వం కేంద్ర బ్యాంకు బాధ్యత అయినప్పటికీ, సరఫరాలో లోపాలు తలెత్తినప్పుడు పన్ను సర్దుబాట్లు లేదా సబ్సిడీలు వంటి ప్రభుత్వ ఆర్థిక జోక్యం అవసరమన్నారు. ఎన్నికైన ప్రభుత్వాలు స్వల్పకాలిక లక్ష్యాలతో, తిరిగి ప్రజామోదం పొందే లక్ష్యంతో పనిచేస్తాయి కాబట్టి, స్వతంత్ర కేంద్ర బ్యాంకు అవసరమని ఆయన స్పష్టీకరించారు.ధర స్థిరత్వం, వృద్ధి, ఉపాధికి మద్దతు ఇవ్వడం, ఆర్థిక
స్థిరత్వాన్ని నిర్ధారించడం అనేవి ఆర్బీఐ ప్రధాన లక్ష్యాలని డాక్టర్ దువ్వూరి చెప్పారు. ధర స్థిరత్వాన్ని తక్కువ, స్థిరమైన ద్రవ్యోల్బణంగా నిర్వచించడం ద్వారా, ద్రవ్య విధానం, రెపో రేటు ద్రవ్యోల్బణం, వినియోగం, పెట్టుబడి, మొత్తం ఆర్థిక కార్యకలాపాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఆయన వివరించారు. ద్రవ్యోల్బణం పేదలపై అతి పెద్ద పన్ను’గా డాక్టర్ సుబ్బారావు అభివర్థిస్తూ, డబ్బుల (కరెన్సీ)పై విశ్వాసాన్ని కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతను డాక్టర్ దువ్వూరి వివరించారు. అధిక ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణం.. రెండూ ఆర్థిక పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తాయని పేర్కొంటూ, వడ్డీ రేట్లు, ఓపెన్ మార్కెట్ కార్యకలాపాల ద్వారా ఆర్బీఐ ద్రవ్యతను ఎలా నిర్వహిస్తుందో విశదీకరించారు. ద్రవ్యోల్బణ అంచనాలు స్వీయ-సంతృప్తిగా మారగలవు కాబట్టి, కేంద్ర బ్యాంకులు వాటిని చాలా జాగ్రత్తగానిర్వహించాలన్నారు.ఆర్బీఐ కీలక విధులను డాక్టర్ సుబ్బారావు ఏకరువు పెట్టారు. కరెన్సీని ముద్రించి-పంపిణీ చేయడం, ద్రవ విధానాన్ని రూపొందించడం, (విదేశీ) మారకపు రేట్లను నిర్వహించడం, ఆర్థిక సంస్థలు, మార్కెట్లను నియంత్రించడం, చెల్లింపు-పరిష్కార వ్యవస్థలను పర్యవేక్షించడం, ప్రభుత్వాలు, బ్యాంకులకు బ్యాంకర్ గా పనిచేయడం, ఆర్థిక అభివృద్ధి ప్రోత్సహించడం, ఆర్థికాభివృద్ధి అందరి దరికి చేర్చడమని ఆయన తెలియజేశారు.2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని గుర్తుచేసుకుంటూ, డాక్టర్ రావు ఆర్బీఐ గవర్నర్ గా తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. అల్లకల్లోల సమయాలలో విశ్వసనీయత, ప్రశాంతమైన నాయకత్వం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఆర్థిక వ్యవస్థ యొక్క పరస్పర అనుసంధాన స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని, బ్యాంకింగ్, బ్యాంకింగేతర సంస్థలను నియంత్రించడం ద్వారా ఆర్బీఐ రూపాయి క్రమబద్ధమైన కదలికను ఎలా నిర్ధారిస్తుందో, ఆర్థిక స్థిరత్వాన్ని ఎలా నిర్వహిస్తుందో డాక్టర్ దువ్వూరి విశదీకరించారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ, విస్తృతంగా పుస్తకాధ్యయనం చేయమని వారిని ప్రోత్సహించారు.
తొలుత, జీఎస్ బీ డైరెక్టర్ డాక్టర్ దివ్య కీర్తి గుప్తా, పీజీ విభాగాధిపతి ప్రొఫెసర్ రనజీ అతిథిని స్వాగతించి, సత్కరించారు. ప్రొఫెసర్ అజయ్ కుమార్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. విద్యార్థులు ఎస్.శాండిల్య అతిథిని పరిచయం చేయగా, ఆర్.ఎస్.మీనాక్షి, జి.అన్సికలు వందన సమర్పణ చేశారు.
