ఆ విషయంపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది..

 ఆ విషయంపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది.. సౌతాఫ్రికా హెడ్ కోచ్

 

ధర్మశాల వేదికగా నేడు సౌతాఫ్రికాతో టీమిండియా మూడో టీ20 ఆడనుంది. ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. గంభీర్ నిర్ణయాల వల్లే టీమిండియా ఓటమి పాలవుతుందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్ కోచ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

ఇంటర్నెట్ డెస్క్: ధర్మశాల వేదికగా నేడు టీమిండియా-సౌతాఫ్రికా(Ind Vs SA) మధ్య మూడో టీ20 జరగనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా.. పేలవ ప్రదర్శనతో రెండో మ్యాచ్‌లో ఓడింది. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తుది జట్టుతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడని విమర్శలు వస్తూనే ఉన్నాయి. రెండో టీ20లో వన్‌డౌన్‌లో అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కి పంపించి.. ఎనిమిదో స్థానంలో దూబెను ఆడించడం వల్లే ఓటమి ఎదురైందని అభిమానులు, క్రికెట్ మాజీలు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కన్రాడ్(Shukri Conrad) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.‘టీ20 ప్రపంచ కప్ 2026 ప్రణాళికలకు అనుగుణంగానే మేము ముందుకు సాగుతున్నాం. ప్రతి మ్యాచులోనూ మేం బ్యాటింగ్ ఆర్డర్ మార్చాలనుకోవట్లేదు. తప్పకుండా తుది జట్టులో మార్పులు చేయాలన్న నియమం కూడా ఏమీ లేదు. ప్రపంచ కప్ తుది జట్టు ఎలా ఉండాలో మాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందుకు అనుగుణంగానే ప్లేయర్లను మారుస్తూ ఉన్నాము. టెస్ట్ సిరీస్ నుంచి కొంతమంది ఆటగాళ్లు ఇక్కడే ఉన్నా.. వారు బెంచ్‌కే పరిమితం అయ్యారు. ఈ సిరీస్ తర్వాత SA20 లీగ్ కూడా ఉంది. అక్కడ కూడా మా వాళ్ల ప్రదర్శన చూసి అర్హత ఉన్నవారికి అవకాశం ఇస్తాం. ఏదేమైనా మా ప్రణాళికలు, వ్యూహాలకు అనుగుణంగా మాకేం కావాలో పూర్తి అవగాహనతోనే ఉన్నాం’ అని సఫారీల హెడ్ కోచ్ అన్నాడు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version