గంజాయి గ్యాంగ్ అరాచకం.. తరచూ గొడవలు, దాడులు
సోమందేపల్లి మండలంలో గంజాయి గ్యాంగ్ అరాచకాలు పేట్రేగిపోతున్నాయనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నారని, దీంతో గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డే లేకుండా పోతోందని పలువురు పేర్కొంటున్నారు.మండల కేంద్రంలో గంజాయి గ్యాంగ్‌లు పేట్రేగిపోతున్నాయి. మత్తుకు అలవాటుపడిన యువత.. ఆ వ్యసానాన్ని తీర్చుకునేందుకు విక్రయాలకు దిగుతున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి ఇతర ప్రాంతాలకెళ్లి కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. దానిని ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. ఆ మత్తులో అరాచకాలు చేస్తున్నారు. గొడవలకు దిగుతున్నారు. విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు. దీంతో మండల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గంజాయి మత్తులో ఉన్న యువకులు.. ఎప్పుడు, ఎవరిపై దాడులు చేస్తారోనని భయాందోళనలు చెందుతున్నారు. గంజాయిని అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
