రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత..

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత

నేటి ధాత్రి:-( శ్రీరాంపూర్)

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటుచేసిన అరైవ్-ఆలైవ్ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరైనా సరే తప్పని సరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరిస్తూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ట్రాఫిక్ నియమాల,ప్రాముఖ్యత వివరించారు.

ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని, అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించినప్పుడే రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చన్నారు. రోడ్డు ప్రమాదాలను ఎక్కువ శాతం నిర్లక్ష్యం వాళ్లే జరుగుతున్నాయని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, ఇలాంటి కారణాలే దీనికి ప్రధాన కారణాలు అన్నారు. వీటిని అధిగమించే ప్రతి ఒక్కరూ సురక్షితమైన ప్రయాణం దిశగా ప్రయాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జైపూర్ సిఐ నవీన్ కుమార్, శ్రీరాంపూర్ సీఐ అశోక్, ఎస్సై లు మేకల సంతోష్, రాజశేఖర్, లక్ష్మీ ప్రసన్న, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి..

నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం నుండి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ లో భాగంగా ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, గుడిపేట పోలీస్ బెటాలియన్ అడ్మిన్ వెంకటరాములు,జిల్లా రవాణా అధికారి గోపికృష్ణ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నిబంధనలను పాటించాలని, ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్ – అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రతి వాహనదారుడు రహదారి భద్రత నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు.వాహనదారులు జాగ్రత్తగా వాహనాలను నడపాలని,రోడ్డు ప్రమాదం అంటే ఒక కుటుంబానికి జరిగే ప్రమాదమని తెలిపారు.జిల్లాలో రహదారులపై లైట్లు,బ్లైండ్ స్పాట్లను గుర్తించి తగు ఏర్పాట్ల చేయడం జరుగుతుందని,సిగ్నల్ వ్యవస్థలను ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రించడం జరుగుతుందని తెలిపారు.అనుభవానికి, ప్రమాదానికి సంబంధం లేదని, వాహనం నడిపే సమయంలో ఏకాగ్రతతో నడపాలని తెలిపారు.ద్విచక్ర వాహనదారులు,వెనుక కూర్చునే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,కార్ లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు.ప్రతి వాహనానికి సంబంధించి ధ్రువపత్రాలు కలిగి ఉండాలని, వాహనదారులు మద్యం సేవించి, మొబైల్ వినియోగిస్తూ వాహనాలు నడపకూడదని,రాంగ్ రూట్ లో వాహనం నడపకూడదని తెలిపారు.తనిఖీలలో మద్యం సేవించి వాహనం నడుపుతూ దొరికినట్లైతే సంబంధిత వాహనదారుడి లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుందని,18 సంవత్సరాల వయసు నిండని వారు వాహనాలు నడపకూడదని, ఒకవేళ నడిపినట్లయితే వారి తల్లితండ్రులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.రహదారులపై పరిమిత వేగాన్ని పాటించాలని,రవాణా వాహనాలు పరిమిత లోడ్ రవాణా చేయాలని తెలిపారు.పోలీస్,రవాణా శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యలై వాహనాలను నిబంధనలకు లోబడి జాగ్రత్తగా నడపాలని తెలిపారు.అతివేగం చాలా ప్రమాదమని,వేగం పరిమితిలో ఉండి నిబంధనలు పాటించినట్లయితే గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవచ్చని తెలిపారు.రోడ్డు భద్రత నిబంధనలను కఠినంగా అమలు చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా బ్రీత్ ఎనలైజర్స్,స్పీడ్ గన్స్ అవసరం మేరకు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.వాహనం నడిపే సమయంలో మనం పాటించే చిన్న చిన్న విషయాలే మన ప్రాణాలను కాపాడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గొల్లబుద్ధారంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు

గొల్లబుద్ధారంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు

జిల్లా ఎస్పీ సంకీర్త్ ఆర్టీవో సంధాని

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అలైవ్​ అరైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా, జనవరి 13 నుండి 24 వరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాలలో భాగంగా భూపాలపల్లి
పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లబుద్ధారం గ్రామంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జిల్లా రవాణా శాఖ అధికారి సంధాని హాజరైనారు
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వంటి కారణాల వల్ల ప్రాణనష్టం జరుగుతోందని తెలిపారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, అనుమతించిన వేగ పరిమితిని మించకుండా వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తనతో పాటు ఇతరుల ప్రాణ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించి, ప్రమాదాల కారణంగా వారు ఎదుర్కొంటున్న మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులను వారి అనుభవాల ద్వారానే ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ సంఘటనలు ప్రజల్లో రోడ్డు భద్రతపై మరింత చైతన్యం తీసుకువచ్చేలా ఉపయోగపడ్డాయని ఎస్పీ తెలిపారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా కుటుంబాలను జీవితాంతం బాధలోకి నెట్టే ప్రమాదం ఉందని పేర్కొంటూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలన్నదే “అలైవ్​ అరైవ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా రవాణాశాఖ అధికారి సంధాని భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ సిబ్బంది స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version