గొల్లబుద్ధారంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు
జిల్లా ఎస్పీ సంకీర్త్ ఆర్టీవో సంధాని
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అలైవ్ అరైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా, జనవరి 13 నుండి 24 వరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాలలో భాగంగా భూపాలపల్లి
పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లబుద్ధారం గ్రామంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జిల్లా రవాణా శాఖ అధికారి సంధాని హాజరైనారు
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వంటి కారణాల వల్ల ప్రాణనష్టం జరుగుతోందని తెలిపారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, అనుమతించిన వేగ పరిమితిని మించకుండా వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తనతో పాటు ఇతరుల ప్రాణ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించి, ప్రమాదాల కారణంగా వారు ఎదుర్కొంటున్న మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులను వారి అనుభవాల ద్వారానే ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ సంఘటనలు ప్రజల్లో రోడ్డు భద్రతపై మరింత చైతన్యం తీసుకువచ్చేలా ఉపయోగపడ్డాయని ఎస్పీ తెలిపారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా కుటుంబాలను జీవితాంతం బాధలోకి నెట్టే ప్రమాదం ఉందని పేర్కొంటూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలన్నదే “అలైవ్ అరైవ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా రవాణాశాఖ అధికారి సంధాని భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ సిబ్బంది స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
