బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రానా దగ్గుబాటి
తెలంగాణలో బెట్టింగ్ యాప్ కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో వివిధ ప్రముఖులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో, తాజాగా టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఈడీ విచారణకు హాజరయ్యారు.
తెలంగాణలో బెట్టింగ్ యాప్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో తాజాగా టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. పలు రకాల ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు రానా ప్రమోట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్‌లను ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఫోకస్ చేసింది. మొత్తం 29 మందిపై ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేసింది. ఈ జాబితాలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి వంటి స్టార్లు ఉన్నారు
ఈడీ ముందుకు రానా
రానా ఈ రోజు ఈడీ అధికారుల ముందు హాజరై, తన గత ఐదేళ్ల బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను సమర్పించారు. జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన ఆరోపణలపై ఈడీ అధికారులు ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నారు. గతంలో రానాకు జూలై 23న విచారణకు రావాలని నోటీసులు వచ్చాయి.
కానీ షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆయన రాలేకపోయారు. దీంతో ఈడీ మళ్లీ ఆగస్టు 11కి తాజా నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రానాతో పాటు, ప్రకాశ్ రాజ్ (జూలై 30), విజయ్ దేవరకొండ (ఆగస్టు 6) ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. మంచు లక్ష్మి ఆగస్టు 13న హాజరుకానుంది.
మనీ లాండరింగ్ కోణం
ఈడీ ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తోంది. బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు హవాలా ద్వారా డబ్బు తరలించారా? సెలబ్రిటీలకు రెమ్యునరేషన్ ఎలా చెల్లించారనే విషయాలపై ఈడీ లోతుగా విచారణ చేస్తోంది. పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ విచారణ కొనసాగుతోంది. ఈ యాప్‌ల వల్ల అనేక మంది డబ్బు పోగొట్టుకోవడమే కాక, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడేం జరుగుతుంది?
తెలంగాణలోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్‌లపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాప్‌లు యువతకు ఆకట్టుకునేలా ఆఫర్స్ ఇచ్చి, వాటి మాయలో పడేలా చేస్తున్నాయి. దీంతో అనేక మంది వీటి బారిన పడి ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకుంటున్నారు. ఈ యాప్స్ మీద సరైన నియంత్రణ లేకపోవడం వల్ల మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ విచారణల నేపథ్యంలో త్వరలో ఈ కేసు గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.