కెమెరా కంటిలో నేరం.. నేరస్తుడికి తప్పించుకునే దారి లేదు!
సీసీ కెమెరాల కంటికి నేరస్తులు చిక్కు.. 65 కేసులు చేదించిన పోలీసులు..
గ్రామాలపై కెమెరా కవచం.. నేరాలకు చెక్కు పెట్టే పోలీస్ వ్యూహం..
కెమెరా ఉన్నచోట నేరానికి భయం.. రామయంపేట సర్కిల్లో 900 సీసీ కెమెరాలు..
చూస్తున్న కెమెరా.. తగ్గుతున్న నేరాలు! పోలీసుల చేతిలో బలమైన ఆయుధం..
ఒకప్పుడు నేరం చేసి ఎవరు చూడలేదని నేరస్తులు ధైర్యంగా తప్పించుకునే రోజులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ప్రతి వీధిలో ప్రతి కూడలిలో నిశ్శబ్దంగా గమనిస్తున్న సీసీ కెమెరా కంటికి నేరం దాచుకోవడం అసాధ్యంగా మారుతుంది. రామాయంపేట పోలీస్ సర్కిల్ పరిధిలో ఏర్పాటైన వందలాది కెమెరాలు నేరాలపై గట్టిగా వేస్తూ నేరస్తుల గుండెల్లో భయం నింపుతున్నాయి. ఈ కెమెరాల ఆధారంగా ఇప్పటికే పలు కేసులు వేగంగా ఛేదించడంతో ప్రజల్లో భద్రత భావం పెరుగుతుండగా గ్రామాల్లో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసులు సూచిస్తున్నారు.
రామాయంపేట మార్చి 13 నేటి ధాత్రి (మెదక్)
ఒకప్పుడు గ్రామంలో నేరం జరిగితే… “ఎవరు చేశారు?” అనే ప్రశ్నకు సమాధానం దొరకడానికి రోజులు, నెలలు పట్టేది.
బాధిత కుటుంబాలు న్యాయం కోసం తలుపులు తట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. నిశ్శబ్దంగా చూస్తున్న ఒక చిన్న కెమెరా… నేరాన్ని కూడా, నేరస్తుడినీ పట్టుకునే సాక్ష్యంగా నిలుస్తోంది.
రామాయంపేట పోలీస్ సర్కిల్ పరిధిలో సీసీ కెమెరాలు ప్రజల భద్రతకు అండగా నిలుస్తున్నాయి. సర్కిల్ పరిధిలో ప్రస్తుతం దాదాపు 900 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని సీఐ వెంకటరాజా గౌడ్ తెలిపారు. ఈ కెమెరాల ఆధారంగా ఇప్పటికే సుమారు 65 కేసులను వేగంగా ఛేదించడం సాధ్యమైందని ఆయన వెల్లడించారు.
గతంలో జరిగిన కొన్ని హత్యలు, దొంగతనాలు, యాక్సిడెంట్లకు సంబంధించిన కీలక ఆధారాలు కూడా సీసీ కెమెరాల ద్వారానే బయటపడ్డాయని పోలీసులు చెబుతున్నారు. ఎవరూ చూడలేదనుకున్న చోట కూడా ఒక కెమెరా మాత్రం నిశ్శబ్దంగా అన్నీ రికార్డ్ చేస్తోంది.
సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లో నేరాలు తగ్గుతాయని పోలీసులు స్పష్టంగా చెబుతున్నారు. ఎందుకంటే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారు కూడా కెమెరా కంటిని చూసి వెనక్కి తగ్గే పరిస్థితి వస్తోంది. యాక్సిడెంట్ చేసి పారిపోవాలని భావించే వారు కూడా ఇప్పుడు కెమెరాల కారణంగా తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది.
గ్రామాల్లో ముఖ్యమైన కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలు, దేవాలయాల పరిసరాలు వంటి చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు మరింత భద్రత కలుగుతుందని పోలీసులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీఐ వెంకటరాజా గౌడ్ తెలిపారు.
సమాజం సురక్షితంగా ఉండాలంటే పోలీసులు మాత్రమే కాదు… ప్రజల సహకారం కూడా అవసరం. ప్రతి గ్రామంలో కెమెరాలు ఏర్పాటు అయితే… ప్రతి వీధి ఒక నిశ్శబ్ద సాక్షిగా మారుతుంది. అప్పుడు నేరం చేయాలనుకునే వారి గుండెల్లోనే భయం మొదలవుతుంది.
సమాజ భద్రత కోసం… కెమెరా కన్ను ఎప్పుడూ మేల్కొని ఉంటుంది.
