14 ఏళ్ల బాలుడు రాజ్యాంగం చేతపట్టుకొని ప్రశ్నిస్తున్న అశ్వమిత్ గౌతం
భూపాలపల్లి నేటిధాత్రి
సిపిఐ ఎంఎల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 14 ఏళ్ల కుర్రాడి ప్రశ్నలకు భయపడుతోందా?
ప్రశ్న అడగడం నేరమైపోయిన రోజుల్లో
నిజం మాట్లాడటం తిరుగుబాటుగా మారిన కాలంలో
ఒక 14 ఏళ్ల బాలుడు రాజ్యాంగం చేత పట్టుకుని
వ్యవస్థనే నిలదీస్తున్నాడు! మోడీ, యోగి సర్కార్ జవాబు చెప్పలేక పోతుందా?
ఆటబొమ్మలు చేతిలో ఉండాల్సిన వయసులో
అతని చేతిలో ఉంది అంబేడ్కర్ పుస్తకం.
కార్టూన్లు చూడాల్సిన కళ్లలో కనిపిస్తున్నాయి సమాజంలోని అసమానతలు. అతడి పేరు అశ్వమిత్ గౌతం. లక్నోకు చెందిన ఒక సాధారణ బాలుడు.కానీ అతని ఆలోచనలు మాత్రం
సాధారణ వ్యవస్థలకు అస్సలు నచ్చని అసాధారణమైనవి.
చేతిలో తుపాకీ లేదు. గొంతులో విద్వేషం లేదు.
నోట్లో బూతులు లేవు. కానీ అతని దగ్గర ఉంది
ఒక అత్యంత ప్రమాదకరమైన ఆయుధం –
ప్రశ్న.
తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా
రాజ్యాంగం ఏమంటుందో చెబుతున్నాడు.
హక్కులు అంటే ఏమిటో వివరిస్తున్నాడు.
చరిత్రను వర్తమానంతో పోలుస్తున్నాడు.
“ఎందుకు ఇలా జరుగుతోంది?” అని నిలదీస్తున్నాడు.
అంతే… దోపిడి చేసే, పెట్టుబడి దారుల కొమ్ము కాసే వ్యవస్థ ఉలిక్కిపడింది. ప్రభుత్వానికి నిద్రపట్టలేదు.
చిన్నోడిని చర్చించాల్సింది పోయి చట్టంతో బెదిరించాలనుకుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఇదేనా ప్రజాస్వామ్యం? ప్రశ్న అడిగితే కేసులు?
ఆలోచిస్తే నేరం? చదివితే ప్రమాదం?
ఈ దేశంలో లక్షల మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు
కులాల గొప్పలు చెబుతూ బూతులు తిడుతూ
వ్యవస్థకు భజన చేస్తూ మిలియన్ల వ్యూస్ సంపాదిస్తారు. వాళ్లకు అవార్డులు. వాళ్లకు గుర్తింపు. వాళ్లకు ప్రోత్సాహం. కానీఒక పేద బాలుడు నిజం మాట్లాడితే మాత్రం అతనిపై కేసులు. అతనికి విచారణ. అతనిని భయపెట్టే వ్యవస్థ.
ఇది న్యాయమా? లేదా ఇది భయపడే పాలనా?
అశ్వమిత్ ఎక్కడా ద్వేష ప్రసంగం చేయలేదు.
ఎవరినీ రెచ్చగొట్టలేదు. కేవలం పుస్తకాలలో ఉన్న మాటలే చెప్పాడు. రాజ్యాంగంలో ఉన్న హక్కులే గుర్తు చేశాడు. అంతే. అదే అతడు చేసిన “నేరం”.
భగత్ సింగ్ తుపాకీతో లేడు. అంబేడ్కర్ ఖడ్గంతో లేడు. కలాం బాంబులతో లేడు.
వాళ్లందరికీ ఉన్నది ఒక్కటే – ఆలోచన.
ఈ రోజు ఆ ఆలోచన రూపమే అశ్వమిత్.
భయపెడితే ఆలోచనలు ఆగవు. కేసులు పెట్టితే ప్రశ్నలు చనిపోవు. ఎంత నొక్కితే అంతే బలంగా
ధిక్కారపు మొక్క మొలుస్తుంది.
అశ్వమిత్ గౌతం ఒక వ్యక్తి కాదు.
ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ వాద సంకేతం
పేద వర్గాల చైతన్యానికి ప్రతిరూపం.
రాబోయే తరాల ప్రశ్నల స్వరం.
అతని గొంతుకు అండగా నిలబడటం అంటే
ఒక బాలుడిని కాపాడటం కాదు.
రాజ్యాంగాన్ని కాపాడటం. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం. మన భవిష్యత్తును కాపాడటం.
ప్రశ్నలను అణచలేరు. ఆలోచనలను అరెస్ట్ చేయలేరు. నిజాన్ని ఎఫ్ఐఆర్ లో బంధించలేరు.
అశ్వమిత్‌తో పాటు నిలబడదాం.
ఎందుకంటే ఈ రోజు అతడిని గొంతు నొక్కితే
రేపు మన గొంతుక కూడా అదే చేతుల్లో ఉంటుంది….
ప్రజలారా ప్రజాస్వామికవాదులారా, ఆలోచించండి..
అశ్వమిత్ గౌతమ్ పై అక్రమ కేసులను ఖందించండి…. ప్రజాస్వామ్యం కాపాడండి అని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు అంబాల అశ్వద్ధామ మారపల్లి రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు
