జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం

జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం

– ఎవరి మెప్పు కోసం ఇలా మాట్లాడుతున్నారు
– పీసీ గోస్ కమిషన్‌పై వస్తున్న ఆరోపణలు అసత్యము
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

సిరిసిల్ల ప్రతినిధి(నేటి ధాత్రి):

 

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, హైకోర్టు ఎక్కడా పీసీ గోస్ కమిషన్‌ను తప్పుపట్టలేదని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి తీర్పును పూర్తిగా చదవకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. “ఎవరి మెప్పు కోసం ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఆయన మాటలు చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు” అని అన్నారు.
జీవన్ రెడ్డి బిఆర్ఎస్‌లో చేరిన తర్వాత తన మాటలు మార్చుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని టీఎంసీల నీరు అందించారో ఇప్పటివరకు వివరాలు చెప్పలేదని ప్రశ్నించారు. పీసీ గోస్ కమిషన్‌పై వస్తున్న ఆరోపణలు అసత్యమని, హైకోర్టు సాంకేతిక కారణాలనే సూచించిందని తెలిపారు. కమిషన్ ఇచ్చిన నివేదికను ఎక్కడా తప్పుపట్టలేదని చెప్పారు.
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అనుమతులు లేకుండా పనులు ప్రారంభించడం సాధ్యం కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మతులు త్వరలో పూర్తి చేసి తిరిగి వినియోగంలోకి తీసుకువస్తామని, తమ్ముడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్ట్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు.
సీబీఐ విచారణ అంశంపై కూడా ఆయన స్పందిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే కేటీఆర్ హరీష్ రావు లు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తున్నారని ఆరోపించారు. సీబీఐ విచారణకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమల్లో ఉన్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని విమర్శిస్తూ, బిఆర్ఎస్‌పై పోరాటం చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు అదే పార్టీకి అనుకూలంగా మాట్లాడడం విచారకరమన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
చివరగా, జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్,ఏఎంసి చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతిరెడ్డి, టౌన్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అడెపు చంద్రకళ ప్రభాకర్, డిసిసి ప్రధాన కార్యదర్శి వేముల దామోదర్,మహిళ కాంగ్రెస్ అధ్యక్షులు కాముని వనిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు,
ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరు బాలరాజు, డిసిసి కార్యదర్శి అల్వాల చందు, కౌన్సిలర్ బొద్దుల శ్రీనివాస్,లింగంపల్లి దేవరాజు, యేల్లే లక్ష్మీనారాయణ, కల్లూరి చందన తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version