మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: బీజేపీ చీఫ్ నితిన్ నబిన్…

మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: బీజేపీ చీఫ్ నితిన్ నబిన్

 

మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ కాలేజీ గ్రౌండ్‌లో బుధవారం బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం పేరిట భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 04: తెలంగాణలో రాజకీయాలు చాలా దయనీయంగా ఉన్నాయని.. మనదేశ సంస్కృతి సంప్రదాయాలపై సీఎం రేవంత్ రెడ్డి దాడి చేస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హా విమర్శించారు. బుధవారం నాడు మహబూబ్ నగర్‌లోని ఎంవిఎస్ కాలేజీ గ్రౌండ్‌లో బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసంగించిన నితిన్ నబీన్.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన బడ్జెట్ నిధులను మైనార్టీలకు బదలాయించారని ఆరోపించారు. రాష్ట్రంలో 77 వేల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు ఉందని గుర్తు చేశారు. ముస్లింల ఓట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు నితిన్ నబీన్.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అనేక హిందూ దేవాలయాలను కూల్చారంటూ మండిపడ్డారు నితిన్ నబీన్. ఆలయాలపై రాజకీయం చేస్తే.. బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. అవసరమైతే తాము ప్రాణ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన విధానాలు మార్చుకోకపోతే.. ఎక్కువ రోజులు ఉండబోదంటూ హెచ్చరించారు. ప్రధాని మోదీ.. మహిళలను లక్షాధికారులను చేయాలని చూస్తే.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మహిళలను పూర్తిగా మోసం చేసిందన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని కార్యకర్తలకు నితిన్ నబీన్ సూచించారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version