*యూరియా పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి*
*రైతులకు, రైతు విశిష్ట గుర్తింపు ఐడి తప్పనిసరి చేసుకోవాలి*
*జిల్లా వ్యవసాయ అధికారి భూక్య సరిత…మండల వ్యవసాయ అధికారి వెంకన్న*
*కేసముద్రం/ నేటి ధాత్రి*
కేసముద్రం మండలం, ధనసరి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధనసరి యందు యూరియా పంపిణీ కేంద్రానికి మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి భూక్య సరిత కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న తో కలిసి పంపిణీ విధానాన్ని పరిశీలించడం జరిగింది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు విశిష్ట గుర్తింపు ఐడి కొరకు వ్యవసాయ విస్తరణ అధికారులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసే విధానాన్ని పరిశీలించడం జరిగింది, వారు యూరియా పంపిణీ మరియు ఫార్మర్ రిజిస్టరీ మీద రైతులతో చర్చించడం జరిగింది. అనంతరం
వారు మాట్లాడుతూ కేసముద్రం మండలంలోని రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవ కేంద్రం మరియు ప్రైవేటు డీలర్ల ద్వారా సుమారుగా 1886 బస్తాల యూరియాను పంపిణీ చేయడం జరిగింది. మండలానికి కావలసినటువంటి యూరియా ఎప్పటికప్పుడు సరఫరా చేయడం జరుగుతుందని, రైతులెవరు యూరియా కోసం ఆందోళన చెందవద్దని యాసంగి సీజన్లో సాగు చేసినటువంటి , మొక్కజొన్న వరి పంటలకు కావలసినటువంటి యూరియా నిలువలను ఎప్పటికప్పుడు మండలాలకు పంపడం జరుగుతుందని వారు సూచించారు.
యూరియాను వివిధ పంటలకు మోతాదుకు మించి వాడినట్లయితే , పంటలలో చీడపీడలు ఉధృప్తి ఎక్కువ అయ్యి పంట దిగుబడులు తగ్గి ఖర్చులు పెరిగే అవకాశం ఉందని వారు తెలియజేశారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు విశిష్ట గుర్తింపు ఐడి కొరకు సమీపంలోని మీసేవ సెంటర్ల ద్వారా గాని మరియు వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా గాని, వారి యొక్క పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబరు తీసుకువెళ్లి ఫార్మర్ రిజిస్టరీ చేయించుకొని, రైతు విశిష్ట గుర్తింపు ఐడిని పొందాలని వారు సూచించారు, ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి చేయించుకున్న రైతులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పిఎం కిసాన్, పెట్టుబడి సాయం మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలు, పంటల ఇన్సూరెన్స్ మరియు వ్యవసాయ యంత్రికరణ, ఇతర వ్యవసాయ పథకాలు పొందే అవకాశం ఉన్నందున మండలంలోని ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధనసరి సీఈవో గోపాల మల్లారెడ్డి మరియు ఆయా క్లస్టర్ల వ్యవసాయ విస్తరణ అధికారులు, రాజేందర్, సాయిచరణ్ శ్రీనివాస్, రవి వర్మ, లావణ్య,పోలీస్ సిబ్బంది, సొసైటీ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.
