ధాన్యపు సిరి.. పువ్వుల మడి..!
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: అన్నం పెట్టే రైతన్న కష్టానికి ఫలితం
దక్కుతుంది. గత సీజన్లో నష్టపోయిన రైతులకు రబీ సీజన్లో లో వేసిన పంటలు ఆశలు చిగురింపజేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బోరేగావ్, జీర్లపల్లి, బోపన్పల్లి, ప్యాలారం, ఈ ద్దులపల్లి, దేవరంపల్లి, ఏడాకులపల్లి, మేదపల్లి తదితర ప్రాంతాల్లో రైతులు వేసిన విత్తనాలు మొలకెత్తి ఏపుగా పెరిగిన పచ్చని పైర్లు కనువిందు చేస్తున్నాయి. ధనియాల పంట పువ్వులు, వాటి నుంచి వెదజల్లుతున్న సుగంధ పరిమళం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెల్ల కుసుమ పువ్వులు కన్నుల పండుగగా నిలుస్తున్నాయి. మొక్కజొన్న, జొన్న, శనగ, గోధుమ, వామ వంటి పంటలు ఈ ప్రాంతాల్లో విస్తారంగా సాగులో ఉన్నాయి. ఊతకొచ్చిన పంటలను చూసి రైతన్న ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా వివిధ గ్రామాల్లో మామిడి తోటల్లో పూసిన పూత వాహనదారులను, రైతులను మరింత ఆనందం పరుస్తోంది.
