అందని ద్రాక్షగా డబుల్ బెడ్రూం ఇండ్లు
ఏండ్ల తరబడి ఆశావహుల ఎదురుచూపులు..
ప్రభుత్వం మారడంతో ఆశతో ఎదురు చూస్తున్న పేదలు…
డిమాండ్ బారెడు.. నిర్మాణాలు మూరెడు
రామకృష్ణాపూర్, జనవరి 06, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారి నెల రోజులైంది, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తుంది, ఐనా సరే పేదోడి సొంతింటి కల ఇంకా నెరవేరడం లేదని క్యాతనపల్లి పుర ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.సొంతిల్లు అంటే అదో కల..కొందరు జీవితాంతం దాని కోసం కలలుకంటూ కష్టపడుతుంటరు….తమదని చెప్పుకునేందుకు ఓ గూడుండాలని తాపత్రయ పడుతుంటరు మరికొందరు….అన్ని అర్హతలు ఉండి ఇల్లులేని నిరుపేదల సొంతింటి కలలను గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం పథకం ద్వారా పేదల కలలను సాకారం చేసేందుకు తలపెట్టిన డబుల్ బెడ్రూం పథకం విఫలమైందనేది జగమెరిగిన సత్యం.డబుల్ బెడ్రూం నిర్మాణాల పథకంలో భాగంగానే పుర పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణం లో గత ప్రభుత్వ హయాంలో సుమారు 280 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయి నెలలు గడుస్తున్నా సరే గత ప్రభుత్వ ఎమ్మెల్యే బాల్క సుమన్ అర్హులైన అభ్యర్థుల కు ఇండ్ల మంజూరు చేయించలేక పోయారనే అపవాదు ఉంది. తెలంగాణా లో ప్రభుత్వం మారి నెల రోజులైంది, ఇకనైనా అర్హులైన పేద, సామాన్య కుటుంబాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెన్నూర్ ప్రస్తుత ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పేదలకు ఇండ్లను పంపిణీ చేస్తారేమోనని పుర ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు.అర్హులు మాత్రం వేలల్లో ఉండగా నిర్మాణాలు మాత్రం అరకొరగా జరిగాయి. నిర్మాణం పూర్తయినప్పటికీ లబ్దిదారులకు ఇండ్లు కేటాయించకపోవడంతో పలువురు ఆశావహులు జాబితాలో తమ పేరుందో లేదోననే మీమాంసలో ఉన్నారు.అర్హులు ఎప్పుడెప్పుడు ఇల్లు కేటాయిస్తారోనని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. నిర్మాణం పూర్తయినప్పటికీ పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించక పోవడంతో చాలా మంది పేదలకు ఎదురు చూపులు తప్పడంలేదు.నిర్మించి నెలలు గడుస్తుండడం తో నిర్వహణ లేక వర్షాలకు గోడలు, స్లాబులు చెడిపోతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం పూర్తయిన ఇళ్ళల్లో ఆకతాయిల చేతుల్లో కిటికీల అద్దాలు, మరి కొన్ని చోట్ల తలుపులు సైతం ధ్వంసమవుతున్నాయని పలువురు వాపోతున్నారు. సొంతిళ్లంటూ లేకుండా ఇంకెన్నాళ్ళు కిరాయి ఇండ్లల్లో ఉండాలని, నెలనెలా వేలకు వేలు కిరాయిలు ఎట్లా కట్టాలని పలువురు పేదలు ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వం మారిందని చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా మారారని అర్హులైన పేదలకు సొంత ఇండ్ల మంజూరు చేస్తారేమోనని గంపెడు ఆశలతో ఆశావహులు ఎదురు చూస్తున్నారు. గతంలో పలువురు లబ్దిదారులతో కూడిన జాబితా అంటూ వార్తలు వెలువడగానే పలువురి నుంచి వ్యతిరేకత వొచ్చిన సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని గృహాలు మంజూరీ చేసి అర్హులైన పేదలకు సొంతింటి కలలను నెరవేర్చాలని పుర ప్రజలు కోరుతున్నారు.