డల్లాస్‌లో సీనియర్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు పర్యటన
ఏపీ ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, HDPT-హిందు ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఛైర్మన్ (క్యాబినెట్ ర్యాంకు), భాజపా నేత డా. దాసరి శ్రీనివాసులు శనివారం డల్లాస్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రవాసాంధ్రులతో ఆయన సమావేశమయ్యారు.
HDPT ద్వారా విదేశాల్లోని హిందు దేవాలయాలను తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలతో అనుసంధానించడం, పరస్పర సహకారం, మౌలికాంశాల సమీక్ష, ప్రవాసుల సహకారాన్ని పూర్తి స్థాయిలో ఆధ్యాత్మికతకు వినియోగించడం వంటివాటిపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా శ్రీనివాసులు వెల్లడించారు. మూడు దశాబ్దాలకు పైగా ఐఏఎస్ సర్వీసులో గన్నులు పట్టిన అన్నల డెన్నుల్లో తనకు ఎదురైన అనుభవాలను ఆయన పంచుకున్నారు. తన సర్వీసు అనుభవాల సమాహారం ‘ఇప్పచెట్టు నీడలో’ పుస్తకాన్ని అతిథులకు బహుకరించారు. ‘ఇప్పచెట్టు నీడలో’ పుస్తకంలోని కథనాలు ఆంధ్రజ్యోతి “నవ్య”లో “సంవేదన” శీర్షికన ప్రచురించారు. అవి విశేష జనాదరణను సొంతం చేసుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముందు ఆయన అర్వింగ్‌లోని మహాత్మ గాంధీ స్మారకస్థలి వద్ద గాంధీ పీస్ వాక్‌లో పాల్గొని బాపూజీకి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సమీర్ రెహ్మాన్, అజయ్ గోవాడ, యశ్వంత్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.