డొనాల్డ్ ట్రంప్‌పై సల్మాన్ ఖాన్ సెటైర్లు.. అసలేం జరుగుతోందో తెలియట్లేదని కామెంట్
బిగ్ బాస్ తాజా సీజన్‌లో వ్యాఖ్యాతగా ఉన్న సల్మాన్ ఖాన్ డొనాల్డ్ ట్రంప్‌పై పరోక్షంగా సెటైర్లు పేల్చారు. సమస్యలు సృష్టించేవారికి శాంతి బహుమతులా అంటూ ఎద్దేవా చేశారు. ఓ కంటెస్టెంట్ తీరును ఎండగడుతూ సల్మాన్ ఖాన్ ఈ కామెంట్స్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తాను పలు యుద్ధాలను ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్నారు. ఆయనకు నోబెల్ బహుమతిపై మనసు పుట్టిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. భారత ప్రధానితో స్నేహబంధం అకస్మాత్తుగా చెడటానికి నోబెల్ అంశం కూడా ఒక కారణమన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ 19 సీజన్ వేదికగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ట్రంప్‌పై పరోక్ష సెటైర్లు పేల్చారు. సమస్యలు సృష్టించే వారే శాంతి బహుమతులు కోరుకుంటున్నారేంటో అర్థం కావట్లేదంటూ ట్రంప్ పేరెత్తకుండానే ఎద్దేవా చేశారు.
బిగ్‌బాస్ షోలో పాల్గొంటున్న ఫర్హానా భట్ అనే కంటెస్టెంట్‌ను సల్మాన్ తలంటేశారు. ఓ మహిళగా సాటి కంటెస్టెంట్‌ను పైసా విలువలేని వ్యక్తివని ఎలా నిందించారని ప్రశ్నించారు. ‘మీకుమీరు శాంతిదూతనని ఎలా భావిస్తున్నారు. మీకసలే అహంకారం ఎక్కువ. అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు. సాటి మహిళను పైసా కూడా విలువ చేయవని అనొచ్చా. మీరూ ఓ మహిళే అన్న విషయం మర్చిపోయారా? అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. అందరికంటే ఎక్కువ సమస్యలు సృష్టించేవారే శాంతి బహుమతులను కోరుకుంటున్నారు’ అని సల్మాన్ అన్నారు. ఈ కామెంట్స్ వైరల్ కావడంతో సల్మాన్ ట్రంప్‌ను టార్గెట్ చేశారని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు
ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిని కోరుకుంటున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. భారత్-పాక్ మధ్య రాజీ కుదుర్చినందుకు తన పేరును నోబెల్ ప్రైజ్ కోసం ప్రతిపాదించాలని భారత ప్రధానిని ట్రంప్ కోరారట. అయితే, భారత్-పాక్ వ్యవహారాల్లో మూడో దేశం జోక్యాన్ని ఆమోదించబోమని ప్రధాని మోదీ స్పష్టం చేయడంతో ఇద్దరి మధ్యా చెడిందని ఇటీవల మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, మోదీ తనకు ఎప్పటికీ మిత్రుడేనని ట్రంప్ తాజాగా కామెంట్ చేశారు. దీనికి ఎక్స్ వేదికగా స్పందించిన భారత ప్రధాని మోదీ.. తనదీ అదే మాట అని పోస్టు పెట్టారు.