‘ప్రోయాక్టివ్‌’ దిశగా తెలంగాణ రాజకీయాలు

https://epaper.netidhatri.com/view/398/netidhathri-e-paper-6th-october-2024%09/2

తెలంగాణ రాజకీయాల దిశను మార్చిన రేవంత్‌

`దూకుడు, వేగంతో ఊపిరి సలపని ప్రత్యర్థులు

`ధైర్యంతో ముందడుగేస్తే అంతా సానుకూలమే

`కలను సాకారం చేసేదే నాయకత్వ సామర్థ్యం

`ఆ దిశగా అడుగులేస్తున్న రేవంత్‌

`అధిష్టానం అనుకూలమే

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రాన్ని కంచుకోటలా భావించి ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తు న్న కె.సి.ఆర్‌ను, దూకుడు స్వభావం,

అలుపెరుగని, వెరవని మనస్తత్వంతో, ఒంటిచేత్తో ఢీకొని మట్టికరిపించి, కాంగ్రెస్‌కు అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్‌ రెడ్డి సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. విద్యార్థి రాజకీయాల్లో ఎ.బి.వి.పి తరపున పనిచేసిన రేవంత్‌కు సహజంగానే అలవడిన వాక్పటిమ, విశ్లేషణా సామర్థ్యం కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో ఎంతో ఉపయోగపడ్డాయి. ‘మార్పుయాత్ర’ పేరుతో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ప్రజల్లోకి వెళ్లడం ఆయన నాయకత్వ పటిమను మరింత పదును తేల్చింది. నిజం చెప్పాలంటే తెలుగు రా ష్ట్రాల్లో పాదయాత్రలకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. నాడు వై.ఎస్‌.రాజ శేఖర్‌రెడ్డి, ఆయన తనయుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, తర్వాత చంద్రబాబునాయుడు, ఇప్పుడు రేవంత్‌ రెడ్డిలను అధికార సోపానాలను అధిరోహింపజేసింది ఈ పాదయాత్రలే!

ఈ ప్రభుత్వం ఆర్నెల్లకు మించి వుండదని, అంతర్గత కుమ్ములాటలే ప్రభుత్వాన్ని కుప్పకూలు స్తాయన్న కె.సి.ఆర్‌. లేదా కె.టి.ఆర్‌ల ధీమాను రేవంత్‌ వమ్ము చేయగలిగారు. అంతేకాదు ప్రస్తుతం పార్టీలో తనమాటే చెల్లుబాటయ్యేవిధంగా, తనకు వ్యతిరేకంగా ఎవరూ కన్నెత్తి చూడలేని స్థాయికి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఈ కారణంగానే హైడ్రా ఏర్పాటు, మూసీ ప్రక్షాళన ప్రక్రియల ద్వారా అక్రమ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపు తున్నా ఏ నాయకుడూ పెదవి విప్పడంలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఉద్యమ రాజకీయాలనుంచి తెలంగాణను ప్రోయాక్టివ్‌ రాజకీయాలవైపుకు మరల్చిన ఘనత రేవంత్‌దే. ప్రత్యర్థులు తేరుకునే లోపే ఎప్పటికప్పుడు రాజకీయ శైలిని వేగంగా మారుస్తూ ఎవరికీ అర్థంకాని రీతిలో తన లక్ష్య సాధనకోసం ముందుకు దూసుకెళ్లడమే ప్రోయాక్టివ్‌ రాజకీయం. ఈ వినూత్న దూకుడు శైలిని అర్థం చేసుకోవడానికి సంప్రదా య రాజకీయవాదులకు చాలా కాలం పట్టవచ్చు లేదా ఎదుర్కొనేందుకు తగిన సామర్థ్యాన్ని సంతరించుకోలేకపోవచ్చు.

తెలంగాణ రాష్ట్రసాధన దన్నుతో కె.సి.ఆర్‌. ఎంతో ధీమాగా ప్రత్యర్థులను అదుపులో ఉంచగలి గారు. కానీ 1956 నుంచి 2014 వరకు మధ్యకాలంలో ఆంధ్ర, తెలంగాణ ప్రజల సంస్కృతీ సంప్రదాయాలు మమేకమైన స్థితిలో, ఉద్యమ ప్రభావం లేదా ప్రత్యేక రాష్ట్ర వాదాలు చిరకాలం మనగలగడం కష్టం. కె.సి.ఆర్‌.వంటి తలపండిన నాయకుడికి ఇవి తెలియకపోవు. కానీ తనరాజకీయ శైలిని మార్చుకోవడానికి అవసరమైన వేగాన్ని ఆయన అందు కోలేకపోవడమే పార్టీ ఓటమికి ప్రధాన కారణం. అవినీతి, ఆక్రమాల ఆరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత వంటికి ఎంతటి నాయకుడికైనా సహజం. కానీ సమయానుకూలంగా వేగంగా రాజకీయ గతిని మార్చే సామర్థ్యమున్న నాయకులే నేడు విజయం సాధిస్తారనడానికి రేవంత్‌ గొప్ప ఉదాహరణ. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని బహుశా చాలామంది ఊహించి వుండరు. తిరుగులేని నా యకుడిగా చలామణి అవుతున్న కె.సి.ఆర్‌.ను ఎదుర్కొని, అంపశయ్యపై ఉన్న పార్టీని అధికారంలోకి తేవడం అంత తేలికైన విషయం కాదు.

సాహసంలోనే సానుకూలత

నిజం చెప్పాంటే గత కాంగ్రెస్‌, తెలుగుదేశం, బి.ఆర్‌.ఎస్‌. ప్రభుత్వ హయాంలలో విచ్చలవిడి గా చోటుచేసుకున్న ఆక్రమణలను తొలగించాలని నిర్ణయం తీసుకోవడం, ఎటువంటి శషభిషల కు తావులేకుండా, పర్యవసానా లను పట్టించుకోకుండా తక్షణమే దాన్ని అమల్లోకి తీసుకురావడ మనేది తెలంగాణలో రేవంత్‌ అనుసరిస్తున్న సరికొత్త రాజకీయ శైలి. రేవంత్‌ స్థానంలో మరే ఇతర నాయకుడున్నా ఇంతటి సాహసం చేయడం సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ఆలోచనా దశలోనే లక్ష అడ్డంకులు ఎదురుగ్గా ప్రతక్ష్యమవుతాయి! అంతెందుకు తనకు తిరుగులేదనుకున్న కె.సి.ఆర్‌. దీన్ని అమలు చేయగలిగారా? శరవేగంగా రాజకీయ పావులు తిప్పడం ద్వారా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా దూకుడుగా దూసుకెళితే, అడ్డంకులను నిలువరించవచ్చుననేది ప్ర స్తుతం హైడ్రా, మూసీ ప్రక్షాళన విషయంలో కంటికి కనిపిస్తున్న వాస్తవాలు. దివంగత ముఖ్య మంత్రి వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, కె.వి.పి. రామచంద్రరావుకు కూడా మూసీ నదీ తీరంలో ఒక ఫామ్‌ హౌజ్‌ ఉంది. దీని తొలగింపుపై వెల్లువెత్తుతున్న సందేహలకు తెరవేస్తూ, రామచంద్రరావు తనకు ఎటువంటి మినహాయింపు వద్దని, కాంగ్రెస్‌ నేతను కనుక ప్రత్యేకంగా చూడవద్దని, సాధారణ ప్రజలపట్ల ఏవిధంగా వ్యవహరిస్తారో అదేవిధంగా ముందుకెళ్ల మంటూ రేవంత్‌కు లేఖ రాయడం ఇందుకు గొప్ప ఉదాహరణ. అంతేకాదు తనది అక్రమ నిర్మాణమని తేలితే, సొంతఖర్చుతోనే కూల్చివేస్తానని ఆయన పేర్కొనడం విశేషం! చేసే పనిలో నిజాయతీ ఉన్నప్పుడు, అడ్డంకులు వాటికవే తొలగిపోతాయనడానికి ఇంతకు మించిన ఉదాహరణ చెప్పాల్సిన అవసరంలేదు.

అడ్డుచెప్పని అధిష్టానం

ఇప్పుడు కాంగ్రెస్‌ అధిష్టానం కూడా తనకు అడ్డు చెప్పలేని స్థితిని రేవంత్‌ కల్పించుకోగలిగారు. ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్‌ చరిత్రలో లౌక్యం తప్ప దూకుడు రాజకీయాలు నడిపిన నాయకు డు లేడు. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో బుల్డోజర్ల ప్రయోగానికి వ్యతిరేకంగా పోరాడుతున్న కాం గ్రెస్‌, అవే బుల్డోజర్లను ప్రయోగిస్తున్న రేవంత్‌ను అడ్డుకోలేకపోతున్నది. ఆయన అనుసరించే రాజకీయంలోని వేగానికి ప్రభుత్వాలనే శాసించే స్థాయి వున్న ఆర్థిక దిగ్గజాలు సైతం ప్రస్తుతం డిఫెన్స్‌లో పడిపోవడం గమనార్హం. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అంతర్గత కుమ్ములాటలు, మైనారిటీల విపరీత బుజ్జగింపులు, అవినీతి ఆరోపణలతో కునారిల్లుతోంది. ఆ పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో లేదు. ఈ సహజ సంస్కృతి మళ్లీ ఎప్పుడు జడలు విప్పుతుందో చెప్పలేం. కానీ ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి స్టార్‌ కాంపెయిర్‌గా రేవంత్‌ సేవలు అత్యంత అవసరం. మ హారాష్ట్రలో బహుశా వచ్చే నవంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు రేవంత్‌కు ప్రస్తుత స్వేచ్ఛను ఇచ్చే అవ కాశముందునుకున్నా, ఆయన స్థానాన్ని భర్తీచేసే నాయకుడు కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఎవరూ లేరన్న సత్యం తెలియనంత దుస్థితిలో కాంగ్రెస్‌ అధిష్టానం వుండదు. మల్లు భట్టివిక్ర మార్క, శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి సోదరులు వంటి నాయకులు తాము ఉద్దండులమని చెప్పుకు న్నా వారి ప్రభావం పరిమితమే. ఛరిష్మా లేదా పార్టీని ఏకతాటిపై నడిపి విజయపథానికి చేర్చే స్థాయికి చేరుకోవాలంటే వారు రేవంత్‌కు మించిన వేగంతో రాజకీయ పావులు కదిపే స్థాయికి చేరుకోవాలి. అదెంతవరకు సాధ్యమో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరిలో శ్రీనివాసరెడ్డి మినహా మిగతావారు సంప్రదాయ రాజకీయాలకు బాగా అలవాటుపడినవారు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీ ఇచ్చిన భాజపా కూడా రేవంత్‌కు మద్దతుగా ఉన్నదనే భావించాలి. ఎందుకంటే రేవంత్‌ చర్యలపై భాజపా మౌనం పాటిస్తోందంటే, అర్థాంగీకారమనే అనుకోక తప్పదు.

సామర్థ్యమే ప్లస్‌ పాయింట్‌

ఒక నాయకుడి సామర్థ్యం కల అనుకున్నదాన్ని నిజం చేయడంలో, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో అందరికీ వెల్లడవుతుంది. కల అనుకున్న కాంగ్రెస్‌ అధికారం ఇప్పుడు వాస్తవం. దు స్సాధ్యమనుకున్న అక్రమణల తొ లగింపు ఆచరణలోకి రావడం…ఈ రెండూ రేవంత్‌కు ప్లస్‌ పాయింట్లే. చట్టబద్ధమైన రీతిలో కఠినంగా ముందుకెళుతున్నప్పుడు కోర్టులు కూడా ప్రశ్నించలేవు. ప్రజల ఆమోదం కూడా లభిస్తుంది. ప్రధాని నరేంద్రమోదీ నోట్ల రద్దు ప్రకటించినప్పుడు విమర్శలకు దిగినవారంతా నల్లధనం పోగేసు కున్నవారే. నిజానికి ప్రజలు ముక్తకంఠంతో ఆయనకు మద్దతు పలికారు. ఇందుకు తాము కష్టపడ్డా, దీన్నొక మంచిపనిగా గుర్తించి అండగా నిలిచారు. ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది, కోర్టుల గడపలు తొక్కుతున్నది అక్రమ నిర్మాణాలు చేపట్టిన బడా వ్యక్తులే.

విపక్షంలో ఉన్నప్పుడూ…

కేవలం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు విపక్షంలో ఉన్నప్పుడు కూడా రేవంత్‌ తన నాయకత్వ లక్షణాలను, చొరవగా ముందుకెళ్లే వ్యవహార శైలిని ప్రదర్శించిన సందర్భాలున్నాయి. 2009లో ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై దాడులు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున రేవంత్‌ రెడ్డి, నామా నాగేశ్వరరావులు మెల్‌బోర్న్‌లో పర్యటించి భారతీయ విద్యార్థులను క లుసుకున్నారు. అప్పట్లో రేవంత్‌ అక్కడి ప్రజా రవాణా వ్యవస్థలోనే ప్రయాణించి వివిధ ఆసుప త్రుల్లో చికిత్స పొందుతున్న భారతీయ విద్యార్థులను కలుసుకొని ధైర్యం చెప్పిన సంగతి బహు శా చాలా కొద్దిమందికి మాత్రమే గుర్తుండి వుంటుంది. అక్కడి భారతీయ విద్యార్థులో ముచ్చటించి వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తెచ్చిన ఘనత కూడా రేవంత్‌దే! ఆయన విక్టోరియా పార్ల మెంట్‌ (ఆస్ట్రేలియా పార్లమెంట్‌)ను సందర్శించి అక్కడి విపక్షనేత టెడ్‌ బైల్లియును, అక్కడి మినిస్టీరియల్‌ అడ్వయిజర్‌ నితిన్‌ గుప్తాను కలుసుకొని భారతీయ విద్యార్థులపై మెల్బోర్న్‌లో జరిగిన దాడులను వారి దృష్టికి తీసుకొచ్చి తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. కార్యసాధకుడు కష్టనష్టాలను గణించడు….మీనమేషాలు లెక్కించేవాడు ఏదీ సాధించలేడు. దూసుకెళ్లే లక్షణం ఉన్న ప్రతి నాయకుడు ఉన్నత శిఖరాలు అధిరోహించడం తథ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *