రేవంత్‌రెడ్డి మానస పుత్రిక ‘హైడ్రా

 

హైదరాబాద్‌ రూపురేఖలు మార్చే హైడ్రా:

విపత్తు నిర్వహణలో కీలక పాత్ర

పర్యావరణ పరిరక్షణే ప్రధాన లక్ష్యం

అక్రమ అక్రమణలు, నిర్మాణాలపై కొరడా

అవసరమైతే ప్రత్యేక పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు

అన్ని శాఖల సమన్వయంతో పనిచేయడం

చెరువుల్లో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు

ఆక్రమణలకు గురైన చెరువుల్లో 60% భూమి

లక్ష్యం నెరవేరితే హైదరాబాద్‌కు తిరుగుండదు

హైడ్రా కమిషనర్‌గా ఎ.వి. రంగనాథ్‌

హైదరాబాద్‌,నేటిధాత్రి:

విపత్తుల నిర్వహణతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయడం, ఆక్రమణలు తొలగించడం, అ క్రమ నిర్మాణాలు, నిబంధనలు పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, ప్రకటనల తొలగింపు, ట్రాఫిక్‌ నిర్వహణ, తాగునీరు, విద్యుత్‌ సరఫరా అంశాలలో హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా) కీలకంగా వ్యవహరించేలా కీలక బాధ్యతలనుతెలంగాణ ప్రభుత్వం అప్పగించనున్నది. హెచ్‌.ఎం.డి.ఎ, వాటర్‌ వర్క్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, మున్సిపల్‌ విభాగాలు ఎప్పటికప్పుడు హైడ్రా అమలులో సమన్వయంతో పనిచేయాల్సి వుంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అనధికార హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యతలను కూడా హైడ్రాకు ప్రభుత్వం బదిలీ చేయనున్నది. నాలాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణ విషయంలో నిబంధనలు మరింత కఠినంగా రూపొందించేందుకు కూడా అధ్యయనం మొదలుపెట్టింది. నిజానికి హైడ్రా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మానసపుత్రిక అనే చెప్పాలి.
హైడ్రా ప్రధాన విధులు
1. ఆస్తుల పరిరక్షణ విభాగం: పార్కులు, క్రీడా మైదానాలు, పెద్ద చెరువులు, రోడ్లు, ఫూట్‌పాత్‌లు మొదలైన ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన ఆస్తులను కాపాడటం.
-అక్రమ ఆక్రమణల తొలగింపు సందర్భంగా జి.హెచ్‌.ఎం.సి, హెచ్‌.ఎం.డి.ఎ. మరియు స్థానిక సంస్థల సహకారం తీసుకోవడం
-ఆస్తుల పరిరక్షణలో పోలీసుల సహకారం తీసుకొని, సమన్వయంతో పనిచేయడం.
-ప్రైవేటు భవనాలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా, ప్రజలకు ప్రమాదకరంగా వున్న నిర్మాణాలను తొలగించడం.
-అనధికార ప్రకటన బోర్డులు, ఫ్లెక్సీలను తొలగించేందుకు చర్యలు తీసుకోవడం.
2. విపత్తు నిర్వహణ: ప్రకృతి విపత్తు సమయాల్లో హైడ్రాకు చెందిన విపత్తు నిర్వహణ దళం (డీఆర్‌ఎఫ్‌) ద్వారా సహాయ కార్యక్రమాలు చేపట్టడం.
-ఎన్‌.డి.ఆర్‌.ఎఫ్‌, ఎస్‌.డి.ఎం.ఎ తదితర రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలతో కలిసి పనిచేయడం.
-వాతావరణశాఖ, ఎన్‌ఆర్‌ఎస్‌ఎ సంస్థలతో సమన్వయంతో కృషిచేయడం.
-అత్యవసర పరిస్థితుల్లో పోలీస్‌, జి.హెచ్‌.ఎం.డి, హచ్‌.ఎం.డి.ఎ, హెచ్‌.ఎం.ఆర్‌ వంటి సంస్థలతో కలిసి పనిచేయడం.
-విపత్తులను ముందుగా అంచనా వేయడం.
పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట
ప్రస్తుతం హైదరాబాద్‌ మహానగరం అన్ని వైపులా అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగు ణంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ హైడ్రా పటిష్టంగా పనిచేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. అంతేకాదు హైదరాబాద్‌ చుట్టుపక్కల 33 గ్రామపంచాయతీలను హైడ్రా పరిధిలోకి తీసుకువచ్చే అవకాశముంది. ఈ గ్రామాల మొత్తం జనాభా రెండు లక్షలు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపలి భాగంలో ఉన్న ఈ పంచాయతీల జాబితాను ఇప్పటికే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే తయారుచేసింది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ హైడ్రా పరిధిని ఓఆర్‌ఆర్‌ పరిధివరకు విస్తరించాలన్న ఉద్దేశంతో వున్న నేపథ్యంలో ఈ పరిధిలో వుండే పంచాయతీల జాబితాను సిద్ధంచేశారు. ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌ పరిధిలో 30 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లు వున్నాయి. ఇక ఇవన్నీ హైడ్రా పరిధిలోకి రానున్నాయి. వీటితోపాటు 33 గ్రామపంచాయతీలను కూడా హైడ్రా పరిధిలోకి తీసుకురానుండటంతో ఈ ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ మరింత జోరందుకుంటుందని అంచనా.
ప్రభుత్వం హైడ్రాకు అప్పగించే అతిముఖ్యమైన బాధ్యత చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగించడం. ప్రస్తుతం నగరంలోని వివిధ చెరువులు, నాలాలు, బఫర్‌ జోన్‌లు యదేచ్ఛగా ఆక్రమణలకు గురికావడంతో వరదనీరు స్వేచ్ఛగా ప్రవహించేందుకు మార్గాలు మూసుకుపో యి ఆక్రమిత ప్రాంతాల్లో గృహాలు ముంపునకు గురికావడం, ఆయా ప్రాంతాల ప్రజలు వరదల కారణంగా నిరాశ్రయలు కావడం జరుగుతోంది. ఈవిధంగా ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తే ఈ వరద సమస్యకు ఒక పరిష్కారం లభించడమే కాదు, పర్యావరణ పరిరక్షణకూడా సాధ్యంకాగలదు. కానీ ఇటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించడమే హైడ్రా ముందున్న ప్రధాన సవాలు. అక్రమ ఆక్రమణలకు గురైన పంచాయతీల్లో కచవాని సింగారం, ప్రతాప్‌ సింగారం, కొర్రెమూల, గౌరెల్లి, చీర్యాల్‌, గుధుమకుంట, రాంపల్లి, కీసర, మంకల్‌, గౌడవల్లి, బమ్రాస్‌పేట్‌, గొల్కండ కలన్‌ వంటి పంచాయతీలు కొన్ని మాత్రమే. వరద ప్రవాహానికి అడ్డుగా పుట్టగొడుగుల మాదిరిగా కాలనీల నిర్మాణం చేపట్టడంతో వర్షాకాలంలో ఈ ప్రాంతాలను వరదనీరు ముంచెత్తుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇటు వంటి అక్రమ నిర్మాణాలను తొలగించడానికి కృతనిశ్చయంతో వున్నారు. కఠిన చర్యలు చేపట్టడానికి ప్రస్తుతం అమల్లో వున్న పంచాయతీరాజ్‌, మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టాల్లో మార్పులు తీసుకురాక తప్పదు. హైడ్రా కోరలకు మరింత పదును పెట్టాలంటే ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో ముందుగా ఆర్డినెన్స్‌ రూపంలో హైడ్రాకు మరిన్ని అధికారాలను కట్టబెట్టి తర్వాత అసెంబ్లీలో ఆమోదం పొందాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఈ విషయంలో న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. జి.హెచ్‌.ఎం.సి. కమిషనర్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ Ê డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఇ.వి Ê డి.ఎం) ఎ.వి. రంగనాథ్‌ను ప్రస్తుతం హైడ్రాకు కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.
కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు
ఇప్పటికే జి.హెచ్‌.ఎం.సి. పరిధిలో అక్రమణలపై హైడ్రాకు కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు రావడంతో, ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం తలపోస్తున్నది. ఈవిధంగా ఏర్పాటయ్యే పోలీస్‌ స్టేషన్ల సహాయంతో ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ ఎ.వి. రంగనాథ్‌ నేతృత్వంలోని హైడ్రా విభా గం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం హైడ్రా పరిధి 2500 చదరపు కిలోమీటర్లుగా వుంది. ప్రభుత్వం ఈ విభాగానికి రూ.200 కోట్లు బడ్జెట్‌ కేటాయింపులు జరుపగా, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగనాథ్‌ ఉపక్రమిస్తున్నారు. ఎన్‌.ఆర్‌.ఎస్‌.సి. నివేదిక ప్రకారం గత 44 సంవత్సరాలుగా జంటనగరాల పరిధిలో ఎన్నో చెరువులు/సరస్సులు, కుంటలు అక్రమ కట్టడాల కార ణంగా అదృశ్యమైపోయాయి. వీటిల్లో కొన్ని చెరువులు 60శాతం మరికొన్ని 80శాతం వరకు ఆక్రమణలకు గురయ్యాయి. ఆవిధంగా అదృశ్యమైన 56 చెరువులపై హైడ్రా ప్రస్తుతం అధ్యయనం ప్రారంభించింది. గతంలో ఈ చెరువుల మొత్తం విస్తీర్ణం 40.35 చదరపు కిలోమీటర్లు! ప్రస్తుతం ఇవి కేవలం 16.9 చదరపు కిలోమీటర్లకు కుంచిచుకుపోగా మిగిలిన 24.26 చదరపు కిలోమీటర్లు ఆక్రమణలకు గుర య్యాయి. అంటే చెరువుల అసలు విస్తీర్ణంలో 60% ఆక్రమణలకు గురైందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చెరువుల పరిధిలోని ఆక్రమణలను హైడ్రా గుర్తించడమే కాదు ఇకముందు వీటిని నివారించకపోతే భవిష్యత్తులో మిగిలిన భాగాలు కూడా ఆక్రమణల కింద కనుమ రుగైపోవడం ఖాయమన్న సత్యాన్ని కూడా అవగతం చేసుకుంది. ప్రస్తుతం ఆస్తుల పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా హైడ్రా పట్టణ ప్రణాళికా విభాగంతో కలిసి పనిచేస్తూ 20 పెద్ద చెరువుల పరిరక్షణకు సంబంధించిన కార్యకలాపాలను మొదలుపెట్టింది.
మూడు దశల కార్యక్రమం
చెరువుల ఆక్రమణల విషయంలో హైడ్రా మూడు దశలుగా తన కార్యక్రమాలను కొనసాగించనుంది. మొదటిదశలో ఆక్రమణల నివారణ, రెండో దశలో ఆక్రమంగా ఆక్రమించి నిర్మించిన భవనాలకు అనుమతుల రద్దు మరియు అటువంటివారిపై కఠిన చర్యలకు ఉపక్రమించడం, ఇక మూడోదశలో ఆయా చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టడం. ఆవిధంగా వర్షపునీటిని ఆయా చెరువుల్లోకి మామూలుగా వెళ్లేం దుకు మార్గం సుగమం చేస్తుంది. ఇదే సమయంలో ఆయా ప్రాంతాల్లో పర్యావరణ పునరుద్ధరణ కూడా జరుగుతుంది. జి.హెచ్‌.ఎం.సి. పరిధిలో 400 చెరువులున్నాయి. ఈ నీటితావుల్లో ఆక్రమంగా నిర్మాణాలను చేపడుతున్నవారిపై కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ హెచ్చరించారు. చెరువుల్లో పూర్తిస్థాయి నీరు వుండే ప్రాంతాల్లో (ఎఫ్‌టీఎల్‌), బఫర్‌ జోన్లలో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని ఆయన పౌరులను కోరారు. ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని ప్రోత్సహిస్తున్న సంగతి నిజమే అయినప్పటికీ శిథిలమైన చెరువులను ఆక్ర మించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవన్నారు. చట్టబద్ధమైన ప్రదేశాల్లో నిర్మాణాలు చేపడితే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఎండిపో యిన చెరువుల్లో పెద్దఎత్తున వ్యర్థాలను వేస్తున్న వారు, అనుమతి పత్రాలు లేకుండా నిర్మాణాలు చేపట్టినవారి జాబితాలు సిద్ధంగా ఉన్నదన్నారు. ఈవిధమైన ఆక్రమణలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి ప్రస్తుతం హైడ్రా తన పని మొదలుపెట్టింది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version