బీసీల రిజర్వేషన్లు బిక్ష కాదు, హక్కు…
జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు పూరేళ్ల నితీష్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
బీసీలకు కల్పించాల్సిన 42 శాతం రిజర్వేషన్లు బిక్ష కాదని, బీసీల హక్కు అని జాతీయ బీసీ విద్యార్థి సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పూరేళ్ల నితీష్ అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నితీష్ మాట్లాడారు. క్యాబినెట్ సమావేశంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని, బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా కాకుండా పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయించడం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటనను తెలంగాణ రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బీసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడకపోతే రాష్ట్రంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. 42 శాతం బీసీలకు ప్రకటించి, అగ్రకులాలను ఇండిపెండెంట్ అభ్యర్థి లుగా పోటీ చేయించి, అంతిమంగా బీసీలను రాజకీయంగా ఓడించి, తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ నుండి ముఖ్యమంత్రి దాకా రెడ్ల రాజ్యం తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగానే సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బిజెపి కుమ్మక్కై బీసీ రిజర్వేషన్లు అమలు జరగకుండా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
