పవర్ షేరింగ్’ డీల్?
అన్నాడీఎంకే – టీవీకే పొత్తు
తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు గందరగోళంగా ఉండటంతో రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే, తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ TVK నిర్ణయాత్మక శక్తులుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార డీఎంకే కూటమిని అడ్డుకోవడమే లక్ష్యంగా, ఫలితాల తర్వాత అవసరమైన సంఖ్యాబలం కోసం ఈ రెండు పార్టీలు ఇప్పటికే తెర వెనుక చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన తలెత్తకుండా అన్నాడీఎంకే, టీవీకే మధ్య రాయబారాలు మొదలైనట్లు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. ఈ రెండు పార్టీలు చేతులు కలిపితే అధికారం చేపట్టేందుకు అవసరమైన సీట్లు వస్తాయని ఆయా పార్టీల నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఫలితాల అనంతరం సమయం వృథా చేయకుండా వెంటనే కార్యాచరణలోకి దిగాలని ఇరు పార్టీల అగ్రనాయకత్వం భావిస్తోంది.
ఈ పొత్తులో ముఖ్యమంత్రి పదవి అత్యంత కీలక అంశంగా మారింది. విజయ్ తనను తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకోగా, అన్నాడీఎంకే తరపున ఎడప్పాడి పళనిస్వామి రేసులో ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఒక మధ్యేమార్గంపై చర్చలు జరుగుతున్నాయి. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీకే సీఎం పదవి దక్కాలని, రెండో పెద్ద పార్టీకి డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలు కేటాయించాలని ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతానికి ఇవన్నీ ప్రాథమిక ఊహాగానాలే అయినప్పటికీ, మే 4న వెలువడే అసలు ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. ఒకవేళ టీవీకే ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు సాధిస్తే విజయ్ సీఎం పదవి కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. అదే సమయంలో అన్నాడీఎంకే మెరుగైన ఫలితాలు సాధిస్తే పళనిస్వామి తన పట్టు సడలించేలా లేరు. కౌంటింగ్ తర్వాత వచ్చే నంబర్ గేమ్ ఆధారంగానే తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది తేలనుంది.
