త్యాగాలెవరివి.. భోగాలెవరికి!!

`త్యాగాలకు ఎదురుచూపులు.. బోగాలకు అవకాశావాదులు!!

`పార్టీలన్ని రంగులు మార్చే ఊసరవెల్లులే!

`14 ఏళ్లు ఉద్యమానికి అక్కరకొచ్చిన వాళ్ళు పాలనకు పనికిరాలేదు.

`‘‘జై తెలంగాణా‘‘ అని ఒక్కనాడు అనని వాళ్ళు పదవులు పొందారు?

`ఆస్తులమ్ముకొని పార్టీ కోసం పని చేసిన వాళ్ళు బికారిలైండ్రు?

`కనీసం గుర్తింపు రాక మానసికంగా కుంగిపోయిండ్రు?

`పదేళ్లు ఆశతో ఎదురుచూసిన వాళ్లు ఎంతో మంది వున్నారు!

`ఇంకా ‘‘బిఆర్‌ఎస్‌‘‘ పెద్దల పల్లకి మోస్తూనే వున్నారు?

`ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు?

`పార్టీ పెద్దలు ఇంకా మభ్యపెడుతూనే వున్నారు?

`ఉద్యమ కాలంలో జైలు పాలైనవారు పదవులు దక్కక కుమిలి పోతున్నారు?

`మధ్యలో వచ్చిన వారు పదవులు దక్కించుకున్నారు?

`పార్టీలో పెత్తనం వాళ్లే చేస్తున్నారు?

`మంచి రోజుల్లోస్తాయని ఉద్యమ కారులను ఇంకా మోసం చేస్తూనే వున్నారు?

—————–

`‘‘కాంగ్రెస్‌‘‘ పార్టీ అందుకు ఏమీ తీసిపోలేదు?

`‘‘బిఆర్‌ఎస్‌‘‘ కంటే గొప్పగా కార్యకర్తలను గుర్తించింది లేదు?

`పదేళ్లు ‘‘బిఆర్‌ఎస్‌‘‘ మీద కొట్లాడిన వాళ్ళు వున్నారు?

`రాష్ట్ర స్థాయిలో ‘‘బిఆర్‌ఎస్‌‘‘ ను ఎండగట్టిన వారున్నారు?

`‘‘బిఆర్‌ఎస్‌‘‘ కు వ్యతిరేకంగా, నిజాలు రాసి జైలు పాలైన జర్నలిస్టులున్నారు?

`అందరికంటే ఎక్కువగా జైలు జీవితం అనుభవించిన ‘‘అనంచిన్ని‘‘ వెంకటేశ్వర రావు వున్నారు?

`ఒక సారి కాదు నాలుగు సార్లు జైలు పాలయ్యారు?

`ప్రాణాలకు తెగించి నిజాలు రాసారు?

`‘‘కల్వకుంట్ల‘‘ అవినీతిని చీల్చి చెండాడారు?

`‘‘అనంచిన్ని‘‘ మీద భౌతిక దాడులు చేశారు?

`ప్రాణాలు తీయాలనీ అనేక సార్లు ప్రయత్నించారు?

`మార్పు కోసం ‘‘అనంచిన్ని‘‘ కాంగ్రెస్‌ పార్టీకి సపోర్ట్‌ చేశారు?

`అధికారం లోకి వచ్చాక కాంగ్రెస్‌ ప్రభుత్వం మర్చిపోయింది?

`మనతొలి వెలుగు ‘‘రఘు‘‘ కు ఏం దక్కింది?

`తెలంగాణా ‘‘విఠల్‌‘‘ కు ఏ పదవి వచ్చింది?

`‘‘క్రాంతి దళ్‌ పృథ్వీరాజ్‌ యాదవ్‌‘‘ కృషి ఎందుకు మర్చిపోయారు?

`ప్రతిపక్షం లో వున్నప్పుడు అందరూ అక్కరకొచ్చారు?

`అధికారం లోకి వచ్చాక అందర్నీ మర్చిపోయారు?

`పార్టీలంటే అంతే… త్యాగాలు చేసిన వారి గతి ఇంతే!!

`అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే?

`అవసరం తీరాక కరివేపాకులుగా తీసి పడిసుడే?

రాజకీయ పార్టీలను చూసి రంగులు మార్చే ఊసరవెళ్లులు కూడా సిగ్గుపడతాయని ఊరికే అనలేదు. అందుకు ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే. ఆ జాడ లెక్కలే. ఎందుకంటే పదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో ఉద్యమకారులకు పెద్ద పీట దక్కలేదు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో బిఆర్‌ఎస్‌తో కొట్లాడిన వారికి స్దానం దక్కలేదు. రాజకీయంగా పార్టీల నాయకులకు కూడా కొన్ని సార్లు దిక్కులేకుండాపోయింది. కేసిఆర్‌ జై తెలంగాణ అన్న నాడు తనతో ఎవరూ లేరని చెప్పారు. కాని కేసిఆర్‌ నిలబడానికి పెద్ద పెద్ద నాయకులు ఎవరూ రాలేదు. కేసిఆర్‌ పంచన ఎవరూ పెద్ద నాయకులు చేరలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసిఆర్‌ నమ్మడానికి ఏ నాయకుడు ఇష్టపడలేదు. కేసిఆర్‌ను నమ్మింది తెలంగాణ ఆకాంక్ష వాదులు. తెలంగాణ కోసం పోరాటం చేయాలన్న కసి వున్న వాళ్లు కేసిఆర్‌ను ఆదరించారు. అంతే కాని కేసిఆర్‌ వారిని ఆదరించలేదు. కేసిఆర్‌ వారికి రాజకీయం నేర్పలేదు. తెలంగాణ వాదులంటే పోరాట యోదులు. ఉద్యమకారులు. దోపడినీ ఎదిరించే వాళ్లు. అన్యాయాన్ని ప్రశ్నించేవారు. అలాంటి వారు కేసిఆర్‌కు అండగా నిలిచారు. ఆయన పోరాటాన్ని ఆదరించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఎంతగా ఆదరించారో, పోరాటంలో పాలు పంచుకున్నారో కేసిఆర్‌కు అంతే ధైర్యమిచ్చారు. అందుకే కేసిఆర్‌ ముందు నిలబడగాలిగారు. అదే తెలంగాణ ప్రజల్లో సామాన్యులు ఆయన వెనక నిలబడకపోతే ఏ ఒక్క నాయకుడు కేసిఆర్‌ దరి చేరకపోయేవారు. నిజం చెప్పాలంటే కేసిఆర్‌ జనం నుంచి విచ్చిన నాయకుడు కాదు. రాజకీయం తయారు చేసిన నాయకుడు. కాని ఉద్యమ పుణ్యాన తెలంగాణ వాదులు తయారు చేసిన నాయకుడయ్యారు. ఉద్యమకారుడని చెప్పుకోవడానికి ప్రజలే అవకాశం కల్పించారు. పద్నాలుగేళ్లపాటు కేసిఆర్‌కు తోడుగా, అండగా నిలిచారు. జీవితాలను త్యాగం చేశారు. సర్వం కోల్పోయారు. కేసిఆర్‌ను నమ్మి జీవితాలను కొవ్వొత్తులు చేసుకున్నారు. వస్తుందో రాదో తెలియని తెలంగాణ కోసం కష్టపడ్డారు. తెలంగాణ వచ్చింది. కాని కేసిఆర్‌కు మాత్రమే పదవులు వచ్చాయి. కేసిఆర్‌ను ఉదమ్మ శిఖరం చేసిన వారికి ఏమొచ్చింది? కేసిఆర్‌కు పేరొచ్చింది. కేసిఆర్‌కు కీర్తి వచ్చింది. త్యాగధనుడు అనే బిరుదొచ్చింది. ఇంకా ఇంకా చాలా వచ్చాయి. ఆస్దులొచ్చాయి. అధికారాలొచ్చాయి. తెలంగాణ మొదటి పాలకుడుగా అవకాశం వచ్చింది. రెండుసార్లు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అదృష్టం కలిగింది. కాని అసలు సిసలు ఉద్యమకారులకు ఏం మిగిలింది. కేసిఆర్‌ పదవులు తీసుకోకపోతే ఏ ఒక్క ఉద్యమకారుడు తమకు పదవులు రాలేదని అనుకునేవారు కాదు. కేసిఆర్‌తోపాటు కేటిఆర్‌, హరీష్‌, కవిత, ఆఖరుకు సంతోష్‌కు కూడా రాజ్యాంగబద్ద పదువులు అందాయి. పాలనలో కీలకభాగస్తులయ్యారు. పది సంవత్సరాలు పాటు ఆ నలుగురు ఆడిరది ఆట, పాడిరది పాట అయ్యింది. పద్నాలుగేళ్లపాటు ఉద్యమం సాగించిన వారిలో కేవలం పది శాతం మందికి కూడా రాజకీయ పదవులు రాలేదు. రాజ్యంగ పదువులు దక్కలేదు. ఇతరత్రా ఎలాంటి గుర్తింపు, గౌరవాలు దక్కలేదు. అసలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులకే పూర్తి స్దాయి న్యాయం జరగలేదు. ఉద్యమ సమయంలో ప్రతిసారి పద్నాలుగు వందల మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని పదే పదే చెప్పి కేసిఆర్‌ పదేళ్లలో మొత్తం అమరులను గుర్తించలేదు. ఆఖరుకు 2014 ఎన్నికల సమయంలో కూడా చెప్పుకున్నారు. నాలుగు వందల మంది అమరులను గుర్తించి మమ అనిపించారు. తర్వాత ఇతర అమరుల జాబితా అందుబాటులోకి రావడం లేదని చేతులు దులుపుకున్నారు. గుర్తించిన ఆ నాలుగు వందలమందికి కేవలం పది లక్షలిచ్చారు. డబుల్‌ బెడ్‌ రూంలన్నారు. ఉద్యోమన్నారు. ఎంత మందికి డబుల్‌ బెడ్‌ రూంలు వచ్చాయోతెలియదు. తెలంగాణ కోసం అమరులైన కుటుంబాలను ఒక్కసారి పిలిస్తే ఆ కుటుంబాలే ప్రభుత్వం వద్దకు వచ్చేవి. ఇంత చిన్న పని చేయకుండా జాబితా దొరకడం లేదని ఉద్యమ కారులను మోసం చేశారు. వారి త్యాగాల పునాదుల మీద అదికారంలోకి వచ్చి పదేళ్లు పాలించారు. ఇక అటు ఉద్యమం కోసం, ఇటు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులు, మేదావులను గాలికి వదిలేశారు. అదికారంలోకి రాగానే టిఆర్‌ఎస్‌ ఉద్యమ పార్టీ కాదని, ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పి పార్టీ నాయకులనే మోసం చేశారు. ఉద్యమానికి పనికి వచ్చిన నాయకులు, పరిపాలనలో పనికి రాకుండాపోయారు. తొలి ప్రభుత్వం ఏర్పాటులో కూడా తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించి వారిని కూడా క్యాబినేట్‌లోకి చేర్చుకున్నారు. కేసిఆర్‌ ఎలా హైదరబాద్‌లో తిరుగుతావో చూస్తానని హెచ్చరించిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను మంత్రిని చేశారు. జై తెలంగాణ అని ఏనాడు అనని తుమ్మల నాగేశ్వరరావును మంత్రిని చేశారు. ఇక ఇక రాజకీయం జీవితం ఆగిపోయిందనుకున్న తరుణంలో పదవితో ఊపిరి పోశారు. ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న తుమ్మలను కలిసి, ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రిని చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకొని తన రాజకీయానికి తిరుగులేని నాయకత్వ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అయినా తెలంగాణ సమాజం భరించింది. కాని ఎంతో మంది ఉద్యమ కారుల జీవితాలు ఆగమయ్యాయి. వారికి పదవులు అందని ద్రాక్షలుగా మిగిలాయి. అలాంటి వారిని ఇంకా మోసం చేస్తూనే వున్నారు. పదువుల ఆశలు కల్పిస్తూనే వున్నారు. ఉద్యమ కాలం తొలిరోజుల నుంచి ఇప్పటిదాక తెలంగాణ కోసం జీవితం త్యాగం చేసిన మేదావులు, ఉద్యమకారులు కూడా చాలా మంది వున్నారు. ఉద్యమమే ఊపిరిగా బతికిన వాళ్లు, ఇంకాతెలంగాణ కాపాలా దారుల పాత్ర పోషిస్తూనేవున్నారు. అన్యాయాన్ని ఎదిరిస్తూనే వున్నారు. పద్నాలుగేళ్లపాటు తెలంగాణ కోసం కేసిఆర్‌కు సహకరించారు. తెలంగాణ తెర్లు కాకుండా చూడడం కోసం పదేళ్లపాటు కేసిఆర్‌ను ఎదిరించారు. మలిదశ ఉద్యమం పురుడుపోసుకున్న తొలి రోజుల్లోనే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తొలిసారి అరెస్టై పేరునే తెలంగాణ విఠల్‌ అని గుర్తింపు పొందిన ఉద్యమ కారుడు ఏ ప్రభుత్వానికి కనిపించలేదు. బిఆర్‌ఎస్‌ పాలనలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించినప్పుడు విఠల్‌ కాంగ్రెస్‌ వారికి కావాల్సి వచ్చింది. ఆయన సేవలు అవసరమయ్యాయి. అదికారంలోకి వచ్చి రెండేళ్లయినా విఠల్‌ను పలకరించిన వారు లేరు. పిలిచి గౌరవించిన వారు లేరు. అధికారం కోసం దీపాదాస్‌ మున్షి లాంటి వారు కూడా విఠల్‌ ఇంటికి వచ్చారు. తెలంగాణలో మార్పు రావాలి. ఆ మార్పుకు మీ సహాకారం కావాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వస్తే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటౌతుందన్న నమ్మకంతో విఠల్‌ సుమారు 40 నియోజకవర్గాలలో అలుపెరగని ప్రచారం, ప్రయత్నం చేశారు. తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంలో భాగం పంచుకున్నారు. అదికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ నాయకులు విఠల్‌ను మర్చిపోయారు. అలాగే బిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిత్యం తన అక్షరాలతో చీల్చి చెండాడిన పాత్రికేయ దిగ్గజం, విశ్లేషకులు అనం చిన్ని వెంకటేశ్వరరావు చేసిన త్యాగం అంతా ఇంతా కాదు. ఆయన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బిఆర్‌ఎస్‌ మీద అక్షర పోరాటం చేశారు. విశ్లేషకులుగా ప్రధాన మీడియా స్రవంతి నుంచి సోషల్‌ మీడియా వరకు బిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిత్యం తూర్పార పట్టారు. అనేక పరిశోధనాత్మక కథనాల ద్వారా కేసిఆర్‌ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, ఆర్దిక దోపిడీని గురించి రాశారు. తెలంగాణ సమాజం ముందు వుంచారు. అందుకు పగ పట్టిన బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలుసార్లు అరెస్టు చేసింది. ఏకంగా ఒకసారి 80 రోజులకు పైగా జైలు పాలు చేసింది. అలా అనేకసార్లు జైలు జీవితం అనుభవించిన ఏకైక జర్నలిస్టు అనం చిన్ని వెంకటేశ్వరరావు. కాంగ్రెస్‌ పార్టీ కోసం ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని తన అక్షరాలతో నిలబెట్టి కడిగేసిన వ్యక్తి అనం చిన్న వెంకటేశ్వరరావు. ఇప్పటికీ బిఆర్‌ఎస్‌ పార్టీ ఎక్కడికిపోయారు మేదావులారా? అంటూ చూపించే పోస్టర్‌లో మొదటి వ్యక్తి అనం చిన్నివెంకటేశ్వరరావు. అనేకసార్లు ఆయనపై హత్యాయత్నాలు జరిగాయి. ఏకంగా ఎప్పుడో ఎన్‌ కౌంటర్‌ చేస్తారేమో అనే అనుమానం కూడా కలిగింది. ఉదయం వేళ వాకింగ్‌కు వెళ్తుంటే ఎత్తుకుపోయిన సందర్బాలున్నాయి. అలా బిఆర్‌ఎస్‌ మీద పోరాటం చేస్తూ, కాంగ్రెస్‌ అదికారంలోకి రావడానికి ప్రాణాలకు తెగించిన అనం చిన్ని వెంకటేశ్వరరావుకు గుర్తింపేది. తెలంగాణలో కాంగ్రెస్‌ వల్లనే ప్రజా పరిపాలన సాద్యమని నమ్మిన అనం చిన్ని వెంకటేశ్వరరావుకు ఏం మిగిలింది. ఆయన పదవుల కోసం ఏనాడు ఆశపడలేదు. పదవుల కోసం వెంపర్లాడలేదు. అయినా ప్రభత్వం గుర్తింపు కూడా ఇవ్వకపోవడం విచారకరం. అలాగే బిఆర్‌ఎస్‌ మీద యుద్దం చేసిన తొలి వెలుగు రఘు కూడా ప్రాణాలకు తెగించి పనిచేశారు. అరెస్టులు చేసినా, బెదిరింపులకు గురిచేసినా వెరవలేదు. జైలుజీవితానికి కూడా భయపడలేదు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని సవాలు విసిరారు. బిఆర్‌ఎస్‌ను ఓడిరచేదాకా అక్షర పోరాటం చేశారు. మరో తెలంగాణ ఉద్యమ కారుడు పృద్వీరాజ్‌ ఇప్పటికీ తెలంగాణ అస్దిత్వం కోసం ఆరాటపడుతున్న ఉద్యమకారులలో ఒకరు. ఆయన కూడా బిఆర్‌ఎస్‌ మీద అలుపెరగని పోరాటం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడానికి కృషి చేశారు. కాని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పదవులు అందుకుంటున్న వాళ్లు తెలంగాణ ఉద్యమకారులు కాదు. కాంగ్రెస్‌ కోసం పనిచేసిన వాళ్లు కాదు. కేవలం అటు ముచ్చట్లు ఇటు, ఇటు ముచ్చట్లు అటు చెప్పి చెవులు కొరికే బ్యాచ్‌కు పదవులు వస్తున్నాయి. త్యాగాలు ఒకరికి, బోగాలు మరొకరి అంటే ఇదే!!

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version