సంక్రాంతి సెలవుల్లో దొంగతనాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సంక్రాంతి సెలవుల్లో దొంగతనాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా భూపాలపల్లి పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తమ స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు ప్రయాణం చేయనున్న నేపథ్యంలో, ఖాళీగా ఉండే ఇళ్లలో దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకొని భూపాలపల్లి పట్టణ గ్రామీణ ప్రాంతాలు, కాలనీలు, ఒంటరిగా ఉన్న ఇళ్ల పరిసరాల్లో పోలీస్ గస్తీని మరింత పటిష్టం చేసినట్లు తెలిపారు. రాత్రి వేళల్లో ప్రత్యేక మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ, బీట్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి, అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ప్రజలు ప్రయాణానికి వెళ్లే ముందు తమ ఇళ్లకు బలమైన తాళాలు వేసుకోవాలని, విలువైన వస్తువులు, నగదు, బంగారం వంటి వాటిని ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్‌లలో భద్రపరచాలని సూచించారు. అలాగే పొరుగువారికి, గ్రామ పెద్దలకు సమాచారం ఇవ్వడంతో పాటు, అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్‌కు ముందుగానే తెలియజేయడం ద్వారా అదనపు భద్రత పొందవచ్చని తెలిపారు.సంక్రాంతి సెలవుల సమయంలో దొంగతనాలతో పాటు చైన్ స్నాచింగ్, ద్విచక్ర వాహనాల చోరీలు, ఇళ్లలోకి చొరబడి నేరాలకు పాల్పడే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ తెలిపారు. గతంలో నేరాలు నమోదైన ప్రాంతాలను గుర్తించి, అక్కడ ప్రత్యేక నిఘా, మరియు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో సరైన వీధి లైటింగ్ ఉండేలా ప్రజలు చూసుకోవాలని, సీసీటీవీ కెమెరాలు ఉన్న వారు అవి సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా పరిశీలించుకోవాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఇళ్ల చుట్టూ తిరుగుతూ సమాచారం సేకరిస్తున్నట్లు అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

అలాగే పండుగల సమయంలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడంతో పాటు వాహనాలకు తాళాలు సరిగా వేసుకోవాలని భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్ సూచించారు.

సంక్రాంతి పండుగల సమయంలో పోలీస్ శాఖ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఏవైనా అత్యవసర పరిస్థితులు లేదా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాలని తెలిపారు.
పోలీస్ శాఖ సహకారంతోనే భూపాలపల్లి మున్సిపాలిటీ అండ్ రూరల్ వ్యాప్తంగా ప్రజలందరూ నేరరహిత వాతావరణంలో శాంతియుతంగా, సురక్షితంగా సంక్రాంతి పండుగలను జరుపుకోవచ్చని భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version