ఆశకు పోతే అసలుకే మోసం

https://epaper.netidhatri.com/view/405/netidhathri-e-paper-16th-october-2024%09/2

కోట్లు వసూలు చేసి బిచాణా ఎత్తేసిన కంపెనీ

 డిపాజిటర్లు లబోదిబో

 ఎన్ని మోసాలు జరిగినా ప్రజల్లో మార్పు రాకపోవడం దౌర్భాగ్యం

 వెనకాముందూ చూడకుండా డిపాజిట్లు చేస్తే ఫలితాలిలాగే వుంటాయి

 ఎంతగా అవగాహన కలిగించినా చైతన్యం రాకపోతే నిండా మునగక తప్పదు

ప్రజల నుంచి పెద్దమొత్తంలో డిపాజిట్ల రూపంలో వసూలు చేసి బిచాణా ఎత్తేసిన మరో కంపెనీ ఉదంతం హైదరాబాద్‌లో బయటపడిరది. మొత్తం 17500 మంది నుంచి 229కోట్ల మేర డిపా జిట్ల రూపంలో వసూలు చేసి నిండా ముంచినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో డికెజెడ్‌ టెక్నాలజీస్‌ కంపెనీ ఎం.డి. సయ్యద్‌ అష్ఫాక్‌ రహిల్‌ ఆయన భార్య సైదా అయిషా నాజ్‌లను హైదరాబాద్‌ సెట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులు అరెస్ట్‌ చేయడం తాజా పరిణామం. ఈ కంపెనీలో గత ఆగస్టులో రూ.2.74కోట్లు డిపాజిట్‌ చేసిన మెహదీపట్టానికి చెందిన ఒక డాక్టర్‌, డిపాజిట్లు సేకరించిన తర్వాత కంపెనీ మూసేసినట్టు తెలుసుకొని హతాశుడై చేసిన ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.ఈ ఏడాది జనవరిలో కూడా ఒక ఫేక్‌ కంపెనీ ఆన్‌లైన్‌ పెట్టుబడుల పేరుతో, ప్రలోభాలను చూపి మోసం చేయడంలో బాధితులు బషీర్‌బాగ్‌ పోలీసులను ఆశ్రయించిన సంఘటన కూడా చాలామందికి గుర్తుండే వుంటుంది. నిజం చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇటువంటి మోసాలు జరుగు తున్నప్పటికీ, అవగాహన పెంచుకోని ప్రజలు పదే పదే ఇటువంటి మోసాలకు గురికావడం విచిత్రం! ఇటువంటి బాధితుల్లో విద్యావంతులు కూడా వుండటం ఇక్కడ విషాదం. ఒక పక్క పోలీసులు మరోపక్క మీడి యా ఇటువంటి నేరాలపై ఎప్పటికప్పుడు ప్రజలను హెచ్చరిస్తున్నప్పటికీ, ఫలితం వుండటంలేదనడానికి ఇదొక ఉదాహరణ. పోలీసులు కూడా ఇటువంటివారిపై కేసులు నమోదు చేసి శిక్షలు పడేలా చేస్తున్న సంఘటనలు మీడియాలో వస్తున్నా జనం వాటిని పెద్దగా పట్టించుకోవడంలేదనేది ఇటువంటి మోసాలు పదేపదే జరుగుతుండటాన్ని బట్టి తెలుస్తున్న నిజం. ప్రజల్లో ఇటువంటి మోసపోయే లక్షణం సమసిపోనంతవరకు మోసాలు జరుగుతూనే ఉంటాయి. అంటే మోసపోయేవా ళ్లున్నంతకాలం, మోసంచేసేవాడు ఉంటూనే వుంటాడు. అటువంటి వారి కార్యకలాపాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా నిరాటంకంగా కొనసాగుతూనే వుంటుంది. 

మానవుల్లోని సహజ బలహీనత డబ్బు! కష్టపడి సంపాదించే కంటే ఈజీ మనీకోసం వెంపర్లాడ టం ఎక్కువమంది నైజంగా మారింది. ఫలితంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందాలన్న దురాశే ఇటువంటి మోసాల బారిన పడటానికి కారణమవుతోంది. ఎవరైనా ఒక కంపెనీ పేరుతో, ఎక్కడా లేనివిధంగా అత్యధిక రిటర్న్‌లు లేదా వడ్డీరూపంలో చెల్లిస్తామంటూ డిపాజిట్ల ను కోరుతున్నప్పుడు, మార్కెట్లో ఎక్కడా లేని విధంగా ఇంతటి మొత్తం ఎట్లా చెల్లించలగరన్న కనీస ఆలోచన డిపాజిట్‌ లేదా పెట్టుబడి పెట్టేముందు మదుపర్లకు కలగాలి! ఏదైనా ఒక ఆర్థిక లావాదేవీలో సహజ ప్రక్రియకు భిన్నంగా లేదా ప్రత్యేకంగా ఏదైనా కనిపిస్తే సదరు లావాదేవీని తక్షణం రద్దుచేయడం లేదా నిలిపివేయడం ద్వారా తాము కష్టపడి సంపాదించిన డబ్బును కాపాడు కోవచ్చు. కానీ ఇటువంటి నేరాలు పదేపదే జరుగుతున్నాయంటే అందుకు ప్రధాన కారణం ప్రజ ల్లో నెలకొన్న అత్యాస, అవగాహనా రాహిత్యం ప్రధాన కారణం. కుటుంబ అవసరాలు తీర్చుకోవడంలో ఎంతో పొదుపుగా జాగ్రత్తగా వ్యవహరించేవారు కూడా, వడ్డీ లేదా రాబడి ఆశతో ఇటువంటి ఉచ్చులో తేలిగ్గా పడిపోతున్నారు. మోసం చేసే తలంపుతో ఉన్నవాడికి జనం బలహీనత బాగా తెలుసు కాబట్టే తళుకు బెళుకుల వంటి ఆకర్షణలతో వారిని ఇట్టే మోసం చేయగలుగుతున్నారు. పోలీసులు పదేపదే ఇటువంటి మోసాలపై హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా గుడ్డిగా ముందుకెళ్లి చివరకు నెత్తికి చేతులు వచ్చిన తర్వాత, అదే పోలీసులను కాపాడమని ఆశ్రయించ డం ప్రస్తుత జరుగుతున్న తంతు. మీడియా కూడా ఎప్పటికప్పుడు ఇటువంటి మోసాలను హైలైట్‌ చేస్తూ అప్రమత్తం చేస్తున్నా, సామాన్యుల్లో ఇంకా మార్పు రావడంలేదు. దీన్ని ప్రజల్లో నెలకొన్న మూర్ఖత్వమనాలా లేక అమాయకత్వమనాలా లేదా గొఱ్ఱెదాటుతనమనాలా తెలియడంలేదు.

ఒక జట్కాబండివాడు, గుర్రానికి ముందు కొంత పచ్చిగడ్డిని వేలాడదీయడం ద్వారా దానితో బండిలాగే పనిని చేయిస్తాడు. కంటికి కనిపిస్తున్న పచ్చిగడ్డికోసం అది పరుగెడుతూనే వుంటుంది. కానీ అది ఎప్పటికీ తన నోటికి అందదన్న జ్ఞానం గుఱ్ఱానికి వుండదు. ప్రస్తుతం గుడ్డిగా నమ్మి డిపాజిట్లు చేసి మోసపోతున్న వారు పరిస్థితి కూడా సరిగ్గా ఇదేమాదిరిగా వుంది. వడ్డీ ఆశ చూపి మొత్తాలను సేకరించిన మోసగాడు గుఱ్ఱం రౌతువంటివాడు. ఆ మొత్తంతో తన అవసరాలు తీర్చుకుంటాడు, కానీ వడ్డీ ఆశను మాత్రం జనాల్లో సజీవంగా వుంచుతాడు. ఎండమావిలాంటి వడ్డీ ఆశతో జనం జీవితం గడుపుతుంటే, మోసగాడు మాత్రం దర్జాగా కాలం గడిపేసి, ఒక మంచి రోజున, మొత్తం బిచాణా ఎత్తేస్తాడు. అప్పటికి కాని జనానికి తమ ఆశ అడియాసైందని తెలియదు! పోలీసులు తక్షణం రంగంలోకి దిగేందుకు వీలుగా, మీడియాను ఆశ్రయించి లబోదిబో మంటారు. పోలీసులు రంగంలోకి దిగి, నిందితులను అరెస్ట్‌ చేసినా, డిపాజిట్‌ మొత్తాల్లో ఎంతమేరకు రికవరీ జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. చాలా సందర్భాల్లో నిందితులకు శిక్షలు పడినామదుపర్లకు వడ్డీ మాట దేవుడెరుగు, డిపాజిట్‌ చేసిన మొత్తాలు నష్టపోయిన సంఘటనలే అధికం.

డబ్బును కష్టపడి సంపాదించాలన్న ఉద్దేశం వున్నవారు ఇటువంటి మోసాల బారిన పడరు. ఎందుకంటే ఒక రూపాయి సంపాదించడంలో ఉన్న కష్టం వారికి తెలుసు. ప్రతి రూపాయిని ఎలా ఖర్చు చేయాలన్న దానిపై కూడా వారికి విస్పష్టమైన అవగాహన వుంటుంది. న్యాయ సంపాదన పై అవగాహన ఉన్నవారు, అధిక ఆదాయం పేరుతో చెప్పేవారి మాటలను ఎప్పుడూ విశ్వసించరు. వారెప్పుడూ తమ కష్టాన్నే నమ్ముకుంటారు. రుజుమార్గంలోనే వారు తమ డబ్బును భద్రపరచుకోవడంవల్ల వారి జీవితం ఒడిదుడుకులు లేకుండా నిశ్చింతగా సాగిపోతుంది. అతిగా ఆశపడేవారున్నంతకాలం, పెద్దఎత్తున మోసాలకు పాల్పడేవారు వీరిపై పరాన్నజీవుల్లాగా రాజుల్లాగా బతికేవాళ్లూ వుంటారు. దొరకనంతకాలం దొంగ కూడా దొరనే. దొరికిన తర్వాత వారు జైలుకెళితే, డబ్బును పోగొ ట్టుకున్నవారు సమాజంలో వుంటూ కూడా మనోవ్యధతో బతుకులీడుస్తారు.అందువల్లనే ఒక కవి చెప్పినట్టు ‘ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయాలి. లేని నాడు ఒళ్లు వొంచి కష్టపడాలి’ అన్నది అక్షర సత్యం. కానీ ఇటువంటి తప్పుడు ప్రకటనలకు మోసపోయి పొదుపు చేస్తే అసలుకే మోసం వస్తుంది. పోయిన డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ అంత డబ్బు సంపాదించిన కాలం తిరిగి రాదు కదా!

మోసంచేసే ఉద్దేశంతో ఉన్నవాడు, చట్టంలోని లసుగులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఇందు లోకి ప్రవేశించిన తర్వాత, తప్పుకునే మార్గాన్ని కూడా నిర్ణయించుకొని మరీ రంగంలోకి దిగుతా డు. జనాల బలహీనతలపై కూడా స్పష్టమైన అవగాహనతో, ఒక నిర్దిష్ట ప్రణాళికతో తన పథకా న్ని పకడ్బందీగా అమలుచేసి, విజయవంతంగా బోర్డు తిప్పేస్తాడు. అందువల్లనే మోసగాళ్ల సం ఖ్య ఎప్పుడూ తక్కువగానే వుంటుంది. కానీ మోసపోయేవారి సంఖ్య అపరిమితం! ఇంతమంది సొమ్ము ఒక్కడి చేతిలోకి వెళ్లడంతో లక్షలు సమకూరుతాయి. వీధినపడేది సామాన్యులు! చీమలు పెట్టిన పుట్టలోకి పాములు దూరడమంటే ఇదే. జనాలను సక్రమ మార్గంలో నడిపించే నిజాయతీ గల నాయకులు చాలా తక్కువమంది వుంటారు. కానీ మోసం చేసేవారు అడుగడుగునా వై కుంఠపాళిలో పాముల మాదిరిగా కాటువేయడానికి ఎప్పడూ పొంచివుంటారు. మోసమనేది అటువంటివారికి అవకాశంగా మారితే, మోసపోవడం జనాలకు దౌర్భాగ్యంగా చుట్టుకుంటుంది. విధివశాత్తు లేదా ప్రకృతి వైపరీత్యం వల్ల కలిగే కష్టనష్టాలు అందరినీ వెంటాడుతూనే వుంటాయి. వాటిని మనం ‘తలరాత’గా సరిపెట్టుకుంటాం. కానీ కోరికోరి తెచ్చుకున్న ఇటువంటి కష్టాలు మాత్రం ‘మనం రాసుకున్న తలరాత’. 

ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు నాయకుడైతే, ఎక్కడ మదుపు చేయాలో తెలిసినవాడు విజ్ఞుడు. ఎ ట్లా మోసం చేయాలో తెలిసినవాడు ధూర్తుడు. ఇటువంటి ధూర్తులను పదేపదే నమ్మి మోసపో తుండటం వల్లనే ‘గొఱ్ఱెదాటు ప్రజలు’ అనే నానుడు ప్రచారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా ఇద్దరు ప్రఖ్యాతు వ్యక్తులు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకోవడం అవసరం. మొదటిది కాళిదాసు కాగా రెండవ వాడు జార్జ్‌ బెర్నార్డ్‌షా. తెలివిగలవాడు అనుభవం ద్వారా నేర్చుకుంటాడని కాళి దాసు చెప్పగా, తెలివైనవాడు ఇతరుల అనుభవాలనుంచి నేర్చుకుంటాడని జార్జ్‌ బెర్నార్డ్‌షా చెప్పా డు. రెండూ కరెక్టే. సమయానుకూలంగా ఈ రెండు సూత్రాలు జీవితంలో పాఠాలు నేర్పిస్తాయి. దురదృష్టవశాత్తు ప్రజలు ఈ రెండు సూత్రాలను విస్మరించడం వల్లనే, వివిధ రకాల మోసాల బారిన పడటానికి ప్రధాన కారణం. 

నీ లక్ష్యం ధర్మమైనప్పుడు దాని సాధనలో శత్రువును మభ్యపెట్టడంలో తప్పులేదని భగవాన్‌ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. కానీ మోసగాళ్లు దీన్ని తప్పుగా అన్వయించి, ఏకంగా ఇతరులను మోసం చేయడానికే మభ్యపెట్టే పనులకు పాల్పడుతున్నారు. మోసపోవడం తప్పుకాదు…కానీ మళ్లీమళ్లీ మోసపోవడమే తప్పు! మళ్లీ మోసపోతున్నారంటే, గత అనుభవం నుంచి పాఠం నేర్చుకో లేదనే అర్థం. ఇది సాధారణ జనం చేసే తప్పిదం. ఇందులో పండితులు, పామరులు అనే తేడా లేదు. మోసం ఒక గారడి లాంటిదైతే, తెలివి దాన్ని తిప్పికొట్టే సాధనం. ప్రజలు ఈ తెలివి అనే సాధనాన్ని ప్రయోగించడం తెలుసుకునేవరకు ఇటువంటి మోసాలు తప్పవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *