ఓ మనిషీ మేలుకో..వెర్రి అభిమానం మానుకో!

నీ వాళ్లు కాని వారి పట్ల విపరీతాభిమానం ఆపుకో!

`ప్రాణమా! అభిమానమా ముందు తేల్చుకో?

`ప్రచారాలలో ప్రాణాలు బలి కాకుండా కాపాడుకో!

`ర్యాలీలు, సభలకు వెళ్లితే వచ్చే లాభమేముండదని తెలుసుకో!

`తొలి రోజే సినిమా చూడకపోతే కొంపలేమీ మునిగిపోవు.

`దొంగ బాబాల పాద దూళితో తలరాత మారదు.

`నాయకులు, హీరోలు దేవుళ్లు కాదు.

`వాళ్ల మాయలోపడి ప్రాణాల మీదకు తెచ్చుకోకు.

`అతి ప్రచారం ప్రజల ప్రాణాలకు హేతుకం.

`అభిమానం వెర్రితలలు వేస్తే ప్రాణాల మీదకు వస్తుంది.

`ఆధ్యాత్మిక ప్రచారాలలో అపశ్రుతులే!

`పుష్కారాలలో ప్రాణాలు పోవడమే!

 

`ర్యాజకీయ ర్యాలీలలో తొక్కిసలాటలు.

 

`సినీ హీరోల వల్ల పోతున్న ప్రాణాలు.

`ఏదో రకంగా ప్రజల ప్రాణాలు పోగొడుతున్నారు.

`తప్పు మాది కాదని తప్పించుకుంటున్నారు.

`తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చుతున్నారు?

`తాజాగా తమిళనాడు లో 40 మంది చనిపోయారు.

`అతిసర్వత్రే వజ్రయేత్‌ అని తెలిసినా జనం వినరు.

`జనాల ప్రాణాలు పోతున్నా ప్రచారాలు మానుకోరు.

`పని లేని యువత పెరిగిపోతున్నారు.

`బాధ్యతలు విస్మరించి జీవితాలు ఆగం చేసుకుంటున్నారు.

`తల్లిదండ్రులు కూడా అలాగే తయారౌతున్నారు.

`పిల్లల విషయంలో అతి స్వేచ్చనిచ్చి చెడగొడుతున్నారు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:

ప్రజాభిమానం వెర్రితలలు వేస్తోంది. ప్రతి వ్యక్తికి తనకు తాను మించిన అభిమానం లేదు. ఇతరులను అభిమానించడం అంటే దానికి ఓ హద్దు వుంటుంది. హద్దూ బద్దు లేని ఏ అభిమానమైనా సరే అది వ్యర్ధం. ఇది ఇంకా ఇప్పటి యవత తెలుసుకోవడం లేదు. మరింతగా లేనిపోని అభిమానాన్ని నెత్తిన పెట్టుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. పిల్లలు అలాగే వున్నారు. యవత అలాగే తయారౌతోంది. మధ్య వయసలు వ్యక్తులకు కూడా జీవితానుభవాలు రావడం లేదు. దురదృష్టమిటంటే ఇప్పటి ప్రజలకు మంచి కన్నా చెడు ఎక్కువగా నచ్చుతోంది. అబద్దం అందగా కనిపిస్తోంది. అసలు యువత ఎవరికోసం బతుకుతున్నారు? ఎందుకు బతుకుతున్నారు? ఎవరి కోసం బతకాలి? అన్నదానిలో కూడా క్లారిటీ లేకుండాపోతోంది. తల్లిదండ్రులు అలాగే తయారయ్యారు. పిల్లలు అదే బాటలో నడుస్తున్నారు. రాజకీయాలు వున్నది ప్రజల కోసం. కాని ప్రజలున్నది రాజకీయ పార్టీల కోసం, నాయకుల కోసం అన్నట్లుగా తయారౌతోంది. సినిమా అనేది ఒక వినోదం. దానిని అంత వరకు పరిమితం చేసుకుంటే బాగుంటుంది. కాని హీరోలు దేవుళ్లుగా కొలుబడుతున్నారు. అభిమాన హీరోల సిమాలు వినోదంగా కాకుండా ఆధిపత్యం కోసం తీస్తున్నట్లున్నారు. అభిమానులు కూడా హీరోలను నిలబెట్టేందుకు సినిమాలు చూస్తున్నట్లున్నారు. హరోల కోసం ప్రాణాలను కూడా లెక్క చేయడకుండా వెర్రి అభిమానం పెంచుకుంటున్నారు. ఇక దైవ భక్తి ముసుగులో దొంగబాబాలు విపరీతంగా తయారౌతున్నారు. అసలు ఎవరు ఎందుకు బాబాలుగా మారుతున్నారో? జనం వారిని ఎందుకు కొలుస్తున్నారో కూడా అర్దం కావడం లేదు. కొన్ని రోజులు పోతే గల్లీకో బాబా తయారైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అసలు ఆ బాబల వల్ల జరుగుత్ను నష్టాలు తెలుసు. కష్టాలు తెలుసు. అయినా మోస పోతున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తమ పిల్లలను ఆటలాడనివ్వరు. కాని ఆటలాడిన క్రీడాకారులను చూసేందుకు మాత్రం జనం ఎగబడుతున్నారు. ప్రేక్షకులుగా మారి పోతున్నారు. వారిపై అభిమానం పెంచుకుంటున్నారు. వేల రూపాయల టిక్కెట్లు కొని క్రీడలు చూస్తున్నారు. క్రీడల్లో గెలిచిన వారిని కీర్తిస్తున్నారు. ఇంత వరకు బాగానే వుంది. కాని వారిని ఆదర్శంగా తీసుకొని దేశానికి ఎంత మంది పేరు తెస్తున్నారు? ఎంత మంది క్రీడల్లో రాణిస్తున్నారు. 140 కోట్ల జనాలున్న మన దేశంలో కనీసం కోటి మందైనా దేశానికి పేరు తెచ్చే క్రీడాకారులుండాలి. కాని వున్నారా? లేరు. కాని వారిని అభిమానించే వాళ్లు మాత్రం కోట్లలోవుంటున్నారు. ఇదే ప్రమాదకరంగా మారుతోంది. మొత్తంగా రాజకీయ సభలు ప్రాణాల మీదకు వస్తున్నాయి. బాబాల ఆధ్యాత్మిక సభలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. సినిమాలు ప్రాణాలు తీస్తున్నాయి. అయినా జనం తండోపతండాలుగా వెళ్లడం మానడం లేదు. ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఆపుకోవడం లేదు. నాకేమౌతుందలే అనే ధీమా? కావొచ్చు. కాని ఏ క్షణం ఏమౌతుందో అనే భయం కూడా వుండాలి. అయినా ఒక నాయకుడు సభలు పెడితే ఎందుకు వెళ్లాలి? ఎందుకు వారిని చూసేందుకు ఎగబడాలి? ఒకప్పటి రాజకీయాలు వేరు. ఇప్పుడు రాజకీయాలు వేరు. ఒకప్పుడు నాయకులు ప్రజల్లోకి వస్తున్నారంటే ప్రజలకు భరోసా కోసం వచ్చేవారు. రాష్ట్రం, దేశ భవిష్యత్తు కోసం రాజకీయాలు చేసేవారు. ప్రజలను చైతన్యం చేసేవారు. కాని ఇప్పుడు నాయకులు ప్రజా ప్రతినిధులు కావడానికి మాత్రమే ప్రజల్లోకి వస్తున్నారు. పాలకులుగా మారి, ప్రజలను ఏలేందుకు మాత్రమే ప్రచారాలు సాగిస్తున్నారు. అంతే తప్ప ఏ ఒక్కపార్టీకి అంకితభావంలేదు. ప్రజా సేవ చేయాలన్న తలంపు వున్నట్లు కనిపించడం లేదు. ఆధిపత్య రాజకీయాల్లో జనాన్ని చూపించి మభ్య పెట్టేందుకు, ప్రజల ఆలోచనలు మార్చేందుకు తప్ప సభలు, సమావేశాలలో ఒరుగుతున్నదేమీ లేదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సభలు, సమావేశాల మూలంగా జరిగిన అపశ్రుతులు అన్నీ ఇన్నీ కావు. బోలే బాబా అనే ఓ వ్యక్తి పాద దూళి కోసం జనం పాకులాడడమేమిటి? ఆ బోలే బాబా కాలుకింద మట్టితో తల రాత మారడమేమిటి? జనంలో చైత్యన్యం పెరుగుతోందా? తరుగుతోందా? అంటే ఈ ఒక్క సంఘటన చాలు. బోలేబాబా పాదం కింద మట్టేమో? కాని 120 మంది ప్రాణాలో కోల్పోయారు. మట్టిలో కలిసిపోయారు. బోలే బాబా పాదం తాకిన దూళితో జీవితాలు మారుతాయనుకున్నారు. కాని ప్రాణాలే కోల్పోయారు. అయినా జనం మారరు. వారి పిచ్చి భక్తి ఆపుకోరు. అడ్డదారిలో అదృష్టం ఎప్పుడూ రాదు. వచ్చినా అది ఎవరి వల్లనో వచ్చేది కాదు. ఏ బాబా దీవిస్తే వచ్చే పరిస్ధితి వుండదు. వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. లేని అదృష్టాన్ని ఎవరూతెచ్చి పెట్టలేరు. ఇది జనం తెలుసుకోవాలి. ప్రజలకు దేవుడి మీద భక్తి వుండాలి. దేవుణ్ణి కొలుచుకోవాలి. దేవుణ్ణి కాదనుకొని, బాబాల వెంట పడితే వచ్చేది ఏమీ వుండదు. సినిమా హీరోలేమీ దేవుళ్లు కాదు. వాళ్లను చూకపోతే జీవితం వ్యర్ధమేమీ కాదు. వాళ్లు కూడా మనలాంటి మనుషులే. కాని వాళ్లపై పెంచుకున్న అభిమానం ప్రాణాల మీదకు వచ్చినా జనానికి కనువిప్పు కలగడం లేదు. 140 సంవత్సరాల తర్వాత వచ్చిన మహా కుంభమేళాకు వెళ్లిన వారిలో ఎంత మంది చనిపోయారో కూడా లేక్కలేదు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో మహరాష్ట్రకు చెందిన ఓ మంత్రి కూడా చనిపోయారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మధ్య పుష్ప సినిమా చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ సంధ్య ధియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో చనిపోయారు. ఆమె కుమారుడు ఇప్పటికీ ఆరోగ్యం కుదటపడలేదు. అయినా సినిమా మొదటి రోజు చూడకపోతే నష్టమా? సినిమాలో వుండేదంతా నాటకమే? అని తెలుసు. సినిమా అంతా అబద్దమే అని తెలుసు. అందులో హీరో చేసే పనులు, సాహసాలు విజిఎఫ్‌ ఎఫెక్టులే అని తెలుసు. అయినా జనం ఎందుకు తయారౌతున్నారో అర్దం కావడం లేదు. 2016లో గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఆ సమయంలో ఏపిలో జరిగిన తొక్కిసలాట గురించి జనం అప్పుడే మర్చిపోలేదు. ఆ సమయంలో రాజకీయ నాయకులు, పాలకులు చేరి తొలి స్నానాలు చేయడమేమిటో? వేలాదిగా వున్న జనం ముందుకు రావడమెందుకు? ప్రజల ప్రాణాలు పోయే పరిస్టితులు సృష్టించడమెందుకు? ఈ మధ్య కూడా అలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. అయినా జనానికి ఏ మాత్రం పట్టడం లేదు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ మధ్య సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో గోడ కూలి భక్తులు చనిపోయారు. ఐపిఎల్‌ కప్‌ గెల్చుకున్న ఆర్‌బీసి విజయోత్సవాలను నిర్వహించి బెంగులూరులో 30 మంది అభిమానులు చనిపోయారు. ఆ మధ్య ఏపిలో లోకేష్‌ పాదయాత్ర సమయంలో జరిగిన తొక్కిసలాట, చంద్రబాబు సభలల్లో జరిగిన మరణాలు చూశాం. తాజాగా తమిళనాడులో హీరో దళపతి విజయ్‌, కరూర్‌ సభలో ఏకంగా 40 మంది అభిమానులు తొక్కిసలాట జరిగి చనిపోయారు. ఆ హీరో ఏమీ దేవుడు కాదు. రాజకీయ పార్టీ పెడుతున్నాడు. ఆయన పార్టీ నిర్ణయాలు నచ్చితే ఓటు వేయండి. లేకుంటే వదిలేయండి. కాని ఆ నాయకుడిని ప్రత్యక్షంగా చూస్తే వచ్చేదేముంటుంది? అలాంటి సభలకువెళ్లకుండా వుండలేరా? అభిమానానికి కూడా ఓ హద్దు వుండాలి. అది దాటితే ప్రమాదమే జరుగుతుంది. విజయ్‌సభలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన జనం గురించి నాలుగు రోజులైతే అందరూ మర్చిపోతారు. రాజకీయ పార్టీలు ఒకరినొకరు విమర్శలుచేసుకుంటారు. కేసులు నమోదు చేస్తారు. తర్వాత అంతా మర్చిపోతారు. యధావిధిగా విజయ్‌ పర్యటనలు సాగుతూనే వుంటాయి. ప్రచారాల హోరు సాగుతూనే వుంటుంది. జనం మళ్లీ, మళ్లీ తండోపతండాలుగా వెళ్తూనే వుంటారు. ఇక్కడ ఎవరిదితప్పు అనే ప్రశ్నలెన్ని వున్నా, సమాదానం మాత్రం దొరకదు. ఎందుకంటే బోలేబాబాపై కేసులుండవు. పుష్కరాలలో తొక్కిసలాటకు కారణమైన వారి మీద చర్యలుండవు. క్రికెట్‌ విజయోత్సవాన్ని నిర్వహించిన వారిపై కేసులు పెట్టింది లేదు. ఎవరినీ శిక్షించింది లేదు. జనంలో మార్పు వస్తుందన్న నమ్మకం అసలే లేదు. అయ్యో పాపం అని మీడియా వార్తలు రాయడం తప్ప మరేమీ జరగడం లేదు. ఆ వార్తలను కూడా చదివి అయ్యో! అనుకున్నవాళ్లే సభలకు, సమావేశాలకు, బాబాల వద్దకు వెళ్లేందుకు ముందుంటారు. ఇదీ మన దౌర్భాగ్యం. ఇంతకన్నా తిట్టుకోవడం అనవసరం! మనం మారం!! సభలకు వెళ్లకుండా వుండలేం!!అది మన బలహీనత. ప్రాణాలకన్నా అభిమానమే ఎక్కువ!!!

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version