ఆడపిల్లల కన్నీళ్లతో ‘‘ఖాకి’’వ్యాపారం.!

https://epaper.netidhatri.com/view/218/netidhathri-e-paper-26th-march-2024%09/3

ముఖ్యమంత్రి ‘‘రేవంత్‌ రెడ్డి’’ ఆదేశాలు కూడా ‘‘బేఖాతర్‌’’.

`ఆ స్టేషనులో అడుగడుగునా ఆడపిల్లకు అన్యాయం.

`ఆ ‘‘సిఐ’’ చూపించే ‘‘అమానుషం’’..

`తల్లిదండ్రులకు శాపం.

`మహిళా పోలీసు స్టేషనులో మగ సిఐ. వికృతరూపం.

`బాదిత మహిళలకు ఆ సిఐ అంటేనే భయం.

`మృగాలకు ఆ సిఐ సహకారం.

`తాను చెప్పినట్లు వింటేనే న్యాయం.

`కేసు నమోదు చేయమంటే కనికరం లేని కర్కశం.

`బాధితులకే సిఐ బెదిరింపులు… వేధింపులు

`తప్పు చేసిన వారికి స్టేషనులో గౌరవాలు.

`ఆడపిల్లల తల్లిదండ్రులకు మిగులుతున్న అవమానాలు.

`కనికరం లేని మగ సిఐతో స్టేషనులో ఆడపిల్లలకు వేధింపులు.

`శాసనసభ ఎన్నికలలో ఆ సిఐని ఐజికి అటాచ్‌ చేశారు.

`తర్వాత మరో స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయాలి.

`మళ్ళీ అదే స్టేషను ఎలా ఇచ్చారు?

`ఎవరి విల్లింగ్‌ మీద సిఐ వచ్చారు?

`ప్రతీ వారికి తొలి ప్రభుత్వ గడప పోలీసు స్టేషన్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఆ గడప తొక్కితే న్యాయం జరుగుతుందని నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టడం పోలీసు కర్తవ్యం. సమాజాన్ని కాపాడడం వారి బాధ్యత. మన చుట్టూ జరిగే అన్యాయాలను, అరాచకాలను అరికట్టి, ప్రజలకు భరోసా కల్పించేదే పోలీసు వ్యవస్థ. కంచే చేను మేసే అనే చందంగా ధైర్యం చెప్పాల్సిన పోలీసులే దౌర్జన్యం చేస్తే ఎలా వుంటుంది. అభయం ఇవ్వాల్సిన పోలీసులే భయపెడితే ఎవరికి చెప్పుకునేది. అందులోనూ మహిళల కు జరుగుతున్న అన్యాయాల నుంచి, బాధలనుంచి, వేధింపులనుంచి రక్షించాల్సిన పోలీసే భక్షించే పరిస్థితి సృష్టిస్తే సమాజానికి రక్షణ ఎవరు? వ్యవస్థకు కాపలా ఎవరు? ప్రజల మన, ధన, ప్రాణాలకు రక్షణే. మన చుట్టూ వున్న సమాజాలలో అన్ని సమాజాలు వేరు. పోలీసు సమాజం వేరు. పోలీసు అంటే ఒక ధైర్యం. పోలీసు అంటే ఒక భరోసా. మరి అలాంటి పోలీసు వ్యవస్థలో కొద్ది మంది చీడ పురుగులుంటారు. వారి వల్ల ఆ వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది. ఇప్పటికీ సగటు వ్యక్తే కాదు, ఎంత పెద్ద మనుషులైనా సరే పోలీసు స్టేషన్‌ గడప తొక్కాలంటే ఆలోచిస్తారు. అలాంటిది సామాన్యులలో కొన్ని శతాబ్దాలుగా నాటుకు పోయిన భయం పోలీసు స్టేషను వైపు అడుగులు వేయాలంటే ఇప్పటికీ భయపడతారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు వున్నా నేరుగా రావొచ్చని చెప్పడం కాదు..బాధితుల పక్షాన పూర్తి స్థాయిలో నిలబడినప్పుడే పోలీసు వ్యవస్థకు గౌరవం. అది ఎప్పుడు వస్తుందా? అని ఈ దేశంలో కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఎదురుచూపులు ఎండమావులే అని ఎంతో మంది మధనపడుతున్నారు.

మనదేశంలో మహిళా రక్షణ కోసం అనేక చట్టాలున్నాయి. ఆ చట్టాలను పోలీసులే అతిక్రమిస్తుంటే ప్రజలు తమ గోడును ఎవరికి చెప్పుకుంటారు. ఉన్నత చదువు చదువుకొని , పోలీసు కావాలని కలలుగని, ఎంతో కష్టపడి, రాత్రింబవళ్ళు చదివి పరీక్షలు రాసి, ఇతర పరీక్షలు దాటి వచ్చిన వారిలో సమాజం మమకారం లేకపోతే ఎలా? శిక్షణా కాలంలో చట్టాల గురించి తెలుసుకొని ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసు ఉన్నతాధికారులే నేరాలు చేస్తుంటే, వెలుగులోకి రాకుండా, బయటకు రాకుండా కాపాడుకుంటుంటే సమిధలు మామూలు మనుషులే…అమాయకులే..

ఇంతకీ ఏం జరిగింది:
అది తెలంగాణలో వున్న మహిళా పోలీసు స్టేషన్లలో ఒకటి. ఆ విషయాన్ని చెప్పలేక కాదు.. ఆ స్టేషన్‌ గురించి చెబితే ఆ బాధితురాలు ఎవరనేది తెలిసిపోతుంది. అలా ఒక ఆడపిల్ల వ్యక్తి గత వివరాలు బైటకు రాకూడదనే సదుద్దేశంతో పోలీసు స్టేషన్‌ ఎక్కడ అనేది రాయలేకపోతున్నాం.. ఒక ఆడపిల్ల నేను అన్యాయమైపోయాను అని పోలీసులకు చెప్పుకుంటే కాపాడాల్సింది పోయి, కనికరం లేకుండా మాట్లాడితే వారి మనసు ఎంత గాయపడుతుందో తెలియదా? పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు కాదా? ఓ తండ్రి ఎంతో కట్నం ఇచ్చి, కొన్ని లక్షలు ఖర్చు చేసి, తన కూతురు పెళ్ళి అంగరంగ వైభవంగా చేశారు. ఆ తండ్రి సమాజంలో గౌరవ ప్రదమైన వ్యక్తి. ఆ అమ్మాయి ఉన్నత విద్యావంతురాలు. జరిగిన పెళ్ళి మూన్నాళ్ల ముచ్చట కూడా కాలేదు. పెళ్ళి జరిగిన మరుసటి రోజు నుంచే చిత్రహింసలకు గురైంది. అవమానాలు ఎదుర్కొన్నది. చీత్కారాలకు గురైంది. అయినా ఆ అమ్మాయి సుమారు రెండు నెలల ఎంతో భరించింది. తనకు కలిగిన ఇబ్బందులు కనీసం కన్న తల్లికి కూడా చెప్పుకోలేదు. కాని ఇక తప్పదు అనుకున్నప్పుడు చెప్పుకున్నది. దాంతో తన కూతురు పడిన బాధను విని ఆ తల్లి గుండె పగిలిపోయినంత పనైంది. తర్వాత తండ్రికి తెలిసి మనోవేధనకు గురయ్యాడు. తన కూతురుకు జరిగిన అన్యాయంపై పోలీసులకు పిర్యాదు చేద్దామనుంటే పట్టించుకునే నాధుడే లేడాయే! పైగా అక్కడ కూడా అవమానాలేనాయే! తనకు అన్యాయం జరిగిందని ఓ ఆడపిల్ల ఆవేదనకు గురైతుంటే ధైర్యం చెప్పాల్సింది పోలీసులు. న్యాయం చేయాల్సిన పోలీసు అధికారి సెటిల్‌ మెంట్‌ పేరుతో టార్చర్‌ పెడితే ఎలా వుంటుంది? వారు పడే వ్యధ పగవారికి కూడా రాకూడదు. తప్పు చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా, వారి పక్షానే సదరు స్టేషను సిఐ. వ్యవహరించడం ఎంత వరకు సమంజసం. ఇదేనా పోలీసు అధికారులు నేర్చుకున్న మానవ ధర్మం. అంతే కాదు పిర్యాదు చేయడానికి వచ్చిన బాధిత మహిళ నుంచి పిర్యాదు స్వీకరించకపోతే మహిళా స్టేషన్లు ఎవరి కోసం పనిచేస్తున్నట్లు. మహిళా పోలీసు స్టేషన్‌ లో మహిళలకు గౌరవం ఇవ్వకుండా, తప్పు చేసిన వారికి రాచ మర్యాదలు చేయడం ఏమిటి? ఇలాంటి సిఐలు వుంటే మహిళలకు న్యాయం జరుగుతుందా? ఆ స్టేషన్‌ సిఐ. గత శాసనసభ ఎన్నికల సమయంలో ఐజికి అటాచ్‌ చేయబడ్డారు. ఆ తర్వాత మరో స్టేషను కు బదిలీ కావాలి. కానీ కాలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఆ సిఐకి అదే పోలీసు స్టేషన్‌ అప్పగించారు. అదెలా సాద్యమైంది. ఆయనకు విల్లింగ్‌ లెటర్‌ ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? ఆ సిఐపై అనేక ఆరోపణలు వున్నాయి. అయినా పై అధికారులు ఎలా పోస్టింగ్‌ ఇచ్చారు. బాధిత మహిళలకు అన్యాయం చేస్తున్న సిఐని అక్కడే ఎందుకు కొనసాస్తున్నారు. ఇది ఎంతో మంది బాధితులు అడుగుతున్న ప్రశ్న.

మహిళా పోలీసు స్టేషన్లలో మగ సిఐ లు:
మహిళా పోలీసు స్టేషన్లు పెట్టిందెందుకు? మహిళా సిఐ, ఎస్సైలు లేకుండా వుండడమెందుకు?
పైగా కుటుంబ సంబంధమైన విషయాల మీద ఐపిఎస్‌ అధికారుల పర్యవేక్షణ లేకుండా కేసులలో సిఐలు నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? వీటన్నిటికీ సమాధానాలు ఎవరు చెబుతారు? అసలు మహిళా పోలీసు అధికారులు లేకుండా ఎలా నిర్వహిస్తున్నారు? నిత్యం ఎంత మంది బాధితులు పోలీసు స్టేషనులలో తమ బాధలు చెప్పుకోలేక వెనుతిరిగి పోతున్నారు? పోలీసు స్టేషనులో న్యాయం జరగదని తెలిసి ఎంత మంది స్టేషను గడప తొక్కకుండా వుంటున్నారో తెలుసా? తన భర్త నిత్యం కొడుతున్నాడు…అని ఓ మహిళ పోలీసు స్టేషనులో పిర్యాదు చేయడానికి వెళ్తే న్యాయం చేయాల్సిన పోలీసులు అదే మహిళను లోబర్చుకుంటున్న కేసులు వెలుగు చూస్తున్నాయంటే బాధ్యులు ఎవరు? గత ప్రభుత్వ హయాంలో కొన్ని వేల మంది పోలీసులను రిక్రూట్‌ చేశారు. వారిలో కొన్ని వందల మంది మహిళా పోలీసు అధికారులు కూడా వున్నారు. వారిని మహిళా పోలీసు స్టేషను అధికారులుగా ఎందుకు నియమించడం లేదు? మహిళా ఎస్సైలు, సిఐలు ఎంతో మందిని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ దగ్గర విధులు నిర్వర్తిస్తున్నారు. మగ సిఐలు మాత్రం మహిళా పోలీసు స్టేషన్లలలో డ్యూటీలు చేస్తున్నారు. ఇంతకంటే సిగ్గు చేటు ఏమైనా వుంటుందా? ప్రతి మహిళా పోలీసు స్టేషనులో తప్పకుండా మహిళా అధికారులే వుండాలి. అందరూ మహిళా అధికారులే వుంటే పురుషులకు కూడా అన్యాయం జరిగే అవకాశం కూడా వుండొచ్చు. అప్పుడు ఎస్‌ఐ స్థాయి పురుష అధికారికి కూడా పోస్టింగ్‌ ఇవ్వండి. ఒక ఆడపిల్ల తమకు జరిగిన అన్యాయాన్ని సంబంధిత స్టేషనులో మగ ఎస్‌ఐ, సిఐలకు లోతైన వివరాలు చెప్పే అవకాశం వుండదు. ఒకవేళ చెప్పాలని ప్రయత్నం చేసినా ఆ సమయంలో వారు చూసే చూపులు ఎలా వుంటాయో! అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో తగినంత మహిళా అధికారులు లేని పక్షంలో మహిళా పోలీసు స్టేషన్లలో సీనియర్‌ అధికారులకు విధులు అప్పగించాలి. వారిలో ఒక తండ్రి వుంటాడు. పిల్లల సమస్యలు తెలిసినవారుంటారు. బాధిత ఆడపిల్లలను తన పిల్లలుగా పరిగణిస్తారు. తండ్రి వయసు వున్న వారితో కొంత చెప్పుకోవడానికి వెనుకంజ వేయరు. వాళ్లు కూడా బాధిత మహిళలతో గౌరవంగా మాట్లాడే అవకాశం వుంటుంది. అసలు మహిళా పోలీసు స్టేషన్లలో యువ ఎస్సై, సిఐలను నియమిస్తే యువతులకు న్యాయం జరుగుతుందా? ఈ మాత్రం అవగాహన లేకుండానే పోలీసు వ్యవస్థ సాగుతుందా?

సిఎం. రేవంత్‌ రెడ్డి గారు:
ఒక్కసారి మహిళా పోలీసు స్టేషన్ల నిర్వహణపై దృష్టి పెట్టండి. గతంలో పోలీసు వ్యవస్థలో అనేక సంస్కరణల తెచ్చామని గొప్పలు చెప్పుకున్నారు. మహిళా పోలీసు స్టేషన్లలో మగ సిఐలను నియమించారు. అలాంటి వ్యవస్థ ను చూసిన తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజా పరిపాలన వచ్చింది. మీరు ఓసారి సమస్యలపై రివ్యూ చేయండి. ఇది చిన్న సమస్య కాదు. చాలా పెద్ద సమస్య. అన్నింటికంటే ప్రధానమైన సమస్య. మహిళా పోలీసు స్టేషన్లు పెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదు. మగ సిఐలకు పోస్టింగ్‌ లతో ఎలాంటి ప్రయోజనం జరగదు. ప్రతి మహిళా పోలీసు స్టేషనులో మహిళా అధికారులే వుండాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. మహిళా పోలీసు స్టేషన్లలో పోస్టింగ్‌ ల కోసం ఎస్సై, సిఐలు లక్షలు వెచ్చిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. అసలు మా ప్రభుత్వంలో విల్లింగ్‌ లెటర్లు వుండవన్నారు. మహిళా పోలీసు స్టేషన్లకు మగ సిఐలు ఎందుకు వుంటున్నారు? మహిళా పోలీసు అధికారులు ట్రాఫిక్‌ విభాగాలలో విధులెందుకు చేస్తున్నారు. మహిళా పోలీసు స్టేషన్లలో బాధితులు ఎలా నరకం అనుభవిస్తున్నారో తెలుసుకోండి. ఎందుకంటే మహిళల కోసం ఉచిత బస్సు సదుపాయాలు అమలు చేస్తున్నారు. ఇటీవలే మహిళా దినోత్సవం రోజున ప్రతి మహిళను కోటీశ్వరులను చేస్తామన్నారు. అదే విధంగా బాధిత మహిళలకు న్యాయం జరిగేలా చూడండి. పోలీసు వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టండి. మీ పాలనలో మహిళలకు న్యాయం జరిగిందని చరిత్ర చెప్పుకునేలా తీర్చిదిద్దండి. బాధితులు మహిళ పోలీసు స్టేషనుకు ధైర్యంగా వచ్చేలా చేయండి. తమ సమస్యలను కన్న తల్లిదండ్రుల దగ్గరే అమ్మాయిలు చెప్పుకోలేరు. అలాంటిది మగ పోలీసుల ముందు వారి బాధలు ఎలా చెప్పుకుంటారో ఆలోచించండి. ప్లీజ్‌.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version