ఈ ముగ్గురిని సిఎంలను చేయగలరా!

https://epaper.netidhatri.com/view/387/netidhathri-e-paper-25th-september-2024%09

`కాంగ్రెస్‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌.

`బిఆర్‌ఎస్‌ పార్లమెంటు సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.

`బిజేపి కేంద్ర మంత్రి బండి సంజయ్‌.

`ఈసారి బిసి సిఎం అనగలరా! తీర్మానాలు చేస్తారా!!

`పార్టీలు నిర్ణయం ప్రకటిస్తారా!

`బిసి వాదం అనగానే సరిపోదు!

`నినాదం ఎత్తుకొమ్మని తోలిస్తే లాభం లేదు.

`మా పార్టీ గెలిస్తే వీళ్లే సిఎంలని చెప్పండి!

`ప్రజల్లో వెనకబడిపోతున్నామని బిసిలను ముందుపెట్టకండి.

`తర్వాత కూరలో కరివేపాకులు చేయకండి!

`అండగా నిలబడిన బిసి నేతలను వెనక్కి తోయకండి!

`ఓసిల రాజకీయ అవసరాల కోసం బిసిలను ముందు పెట్టకండి.

`ఓట్ల కోసం బిసి రాజకీయాలు ఓసిలకు అలవాటే!

ఈసారి అలాంటి చిర్లర రాజకీయాలకు చెల్లు చీటే!

`బిసి ముఖ్యమంత్రి మా విధానం అని ప్రకటించండి.

`పార్టీ వేధికగా తీర్మానం చేయండి.

`మాట తప్పమని తేల్చి చెప్పండి.

`అప్పుడే బిసి నేతలను సమాజంలోకి పంపండి.

`బిసిల భుజం మీద బరువు పెట్టి, సీటేసుకొని కూర్చుంటారని తెలుసు.

`బిసిలను అడుగుడుగునా వంచించడం పార్టీలకు అలుసు.

`బిసిలకు రాజ్యాధికారం మీద అధ్యయనాలు ఎందుకు చేయరు!

`పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఏం రాజకీయాలు అధ్యయనం చేస్తారు?

`తెలంగాణలో బిసిల అభ్యున్నతి అంటే బిస్కట్లు వేయడమా?

`అధికారంలో వున్నప్పుడు దామాషా లేదు.

`ఈసారి బిసి సిఎం అనకపోతే మీ తమాషాలు చెల్లవు.

`మూడు పార్టీలు ఏక వాఖ్య తీర్మానం చేయాలి.

`లేకుంటే బిసి నేతలంతా కలిసి రాజకీయ వేధిక ఏర్పాటు చేయాలి.

`యాచించడం కాదు, శాసించడం కావాలి.

`బిసి ముఖ్యమంత్రి నినాదం తెలంగాణలో మారుమ్రోగించండి.

`ప్రతి బిసి మన బిసినే గెలిపిస్తా అని శపథం చేయండి.

`అంతరాత్మ ప్రభోదంతో ఓటు వేయండి.

`బిసి రాజ్యం కోసం ఒక్కసారి మన ఓట్లు మన కోసం అని కంకణం కట్టుకోండి.

`బిసిల రాజ్యాధికారం ఎందుకు సాధ్యం కాదో చూడండి!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ రాజకీయాలలో బిసి మబ్బులు కమ్ముకున్నాయి. బిసిల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు కాచుకొని కూర్చున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా బిసి నినాదం ఊపందుకున్నది. అన్ని పార్టీలు ఇప్పుడు బిసి జపం చేయని తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. నిజానికి జాతీయ స్థాయిలో బిసి గణన అనేది రాజకీయ అంశంగా మారి చాలా కాలమైంది. పార్లమెంటు ఎన్నికలలో బిజేపికి అదే ఆశనిపాతమైంది. అయినా ఆ వేడి తెలంగాణ దాక అప్పటి వరకు రాలేదు. దేశ వ్యాప్తంగా కుల గణన డిమాండ్‌ ఈపందుకున్న నేపథ్యంలో తెలంగాణలో బిసిల ఐక్యతా రాగం జోరందుకున్నది. అటు కాంగ్రెస్‌ స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ వ్యూహాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తోంది. అదే సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బిసి లెక్కలు తేలాల్సిందే అంటూ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న గళం విప్పారు. ఇది ఆయన స్వయంగా ఎంచుకున్న అంశమా? లేక పార్టీ వెనకుండి నడిపిస్తున్న విషయమా! అన్నదానిపై స్పష్టత రావాల్సివుంది. ఏది ఏమైనా అన్ని పార్టీలు తీన్మార్‌ మల్లన్న ఉచ్చులో పడిపోయాయన్నది వాస్తవం. ఇప్పుడు ముందుకు తప్ప వెనక్కి వెళ్లే పరిస్థితి లేకుండా చేయడంలో మల్లన్న మొదటి విజయం అందుకున్నారు. అదే సందర్భంలో అన్ని రాజకీయ పార్టీల కదిలేలా చేశారు. బిసిల అంశంలో అన్ని పార్టీల బిసి నేతలను ఒకే వేధిక మీదకు తెస్తున్నారు. సరిగ్గా తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీలు జేఏసి గూటికి చేరాయి. కాలం గడుస్తున్న కొద్దీ జారిపోయాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఎదురౌతుందా! లేక బిసిల దామాషా ప్రకారం అందాల్సిన సీట్లు అన్ని పార్టీలు ప్రకటించే దాక పోరు జరుగుతుందా! వేచి చూడాలి. అయితే అన్ని పార్టీలు బిసి నినాదం ఎజెండాగా వచ్చే ఎన్నికలలో బరిలోకి దిగాలని ప్రయత్నం చేస్తాయా? లేదా అన్నది కూడా తేలిపోతుంది. బిజేపి గత ఎన్నికల ముందే బిసి. ముఖ్యమంత్రి స్లోగన్‌ వాడుకునే ప్రయత్నం చేసింది. కానీ ప్రజలు పూర్తిగా విశ్వసించలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ముందుగా ప్రకటిస్తే బిజేపి సీట్ల గెలుపు మరో రకంగా వుండేది. జాతీయ పార్టీలు ముందుగా సిఎం. అభ్యర్థిని ప్రకటించే ఆనవాయితీ లేదని తప్పించుకున్నారు. గెలవాల్సిన చోట ఓటమి మూటగట్టుకున్నారు. చే జేతులా ఎన్నికల ముందు చేతులు ఎత్తేసి చెయ్యి పార్టీకి మార్గం సుగమం చేశారు. తర్వాత తప్పు చేశామని అన్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ లు బిసిల అంశాన్ని ముట్టుకోలేదు. అసలు బిసిలకు రావాల్సిన సీట్లు కూడా కేటాయించ లేదు. ఇప్పుడు తెలంగాణలో బిసి విదానం అమలు చేసే పార్టీకే నూకలుంటాయని బిసిలు బలంగా హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం వుంది. తాజాగా బిఆర్‌ఎస్‌ బిసి అంశం ఎక్కడ కాంగ్రెస్‌, బిజేపిలు ఎత్తుకొని మళ్ళీ తెలంగాణ రాజకీయాలలో ఏకాకిని చేస్తాయో అని ఉలిక్కిపడిరది. బిసి నేతలంతా కలిసి రాజకీయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆ పార్టీ నాయకులు సమావేశమై ఎజెండా రూపకల్పన చేశారు. కానీ వాళ్ల ఎజెండా ఎన్నికల నాటికి కేసిఆర్‌ అమలు చేస్తాడా? అన్నది మాత్రం అనుమానమే. అధికారంలో వున్న పదేళ్ళలో బిఆర్‌ఎస్‌ బిసిలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏమి లేదు. మంత్రి వర్గంలో తగిన స్థానం కల్పించింది లేదు. సమాజం నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా కేసిఆర్‌ పట్టించుకున్నది లేదు. పదేళ్ల కాలంలో ఎంతో మంది ఓసి నాయకుల మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా స్పందించలేదు. కానీ బిసి అయిన ఈటెల రాజేందర్‌ ను పార్టీ నుంచి తరిమేశాడు. ఉప ముఖ్యమంత్రి రాజయ్యను పదవి నుంచి దించేశాడు. బిసి.బిడ్డ కొండా సురేఖకు టికెట్‌ ఇవ్వలేదు. ఇలా బిసిలకు అనేక రకాలుగా కేసిఆర్‌ అన్యాయం చేశాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతి వేధిక మీద దళితుడే ముఖ్యమంత్రి అని వందల సార్లు చెప్పాడు. అధికారంలోకి రాగానే మాట మార్చాడు. మంత్రి వర్గంలో తగిన ప్రాధాన్యత కూడా కల్పించలేదు. అలాంటి కేసిఆర్‌ ఇప్పుడు బిసి నినాదం ఎత్తుకుంటే ప్రజలు నమ్మకపోవచ్చు. స్వయంగా కేసిఆరే బహిరంగంగా ప్రకటించే అవకాశం లేదు. ఒకవేళ ప్రకటించినా ప్రజలు నమ్ముతారనే నమ్మకం లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకతతో తాము ఎలాగైనా అధికారంలో వస్తామనే కలలు కేసిఆర్‌ కంటున్నారు. అందుకే తెలంగాణ ఏం జరుగుతున్నా ఆయన నోరు మెదపడం లేదు. కేసిఆర్‌ ను ఓడిరచి తప్పు చేశామన్న భావనలో ప్రజలు పశ్చాత్తపపడాలని కోరుకుంటున్నాడు. మళ్ళీ కేసిఆరే రావాలని ప్రజలు నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాడు. కాకపోతే ప్రజల్లో నాయకులు వుండాలన్న ఆలోచనతో బిసి నాయకుల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని కొన్ని గేమ్‌ మొదలుపెట్టారు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా తానే ముఖ్యమంత్రిగా వుండాలనుకుంటారు. ప్రాంతీయ పార్టీలలో ఇతరులను ముఖ్యమంత్రులను చేయడం జరగదు. బిఆర్‌ఎస్‌ లో అది ఎప్పటికీ సాధ్యం కాదు. అయినా బిసి విధానం ప్రకటించాలనుకుంటే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ను సిఎం అభ్యర్థిగా ప్రకటించాలి. బిసిల వాదం వినిపించాలనుకున్నప్పుడు కచ్చితంగా వచ్చే ఎన్నికలకు ముందే బిసి ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించాలి. కాంగ్రెస్‌ పార్టీలో ఉద్యమకారుడైన మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ను మించిన బిసి నాయకుడు లేడు. కాంగ్రెస్‌ కు చిత్త శుద్ధి వుంటే మంత్రి పేరు ప్రకటించాలి. అలాగే బిజేపి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటిస్తే చాలు. ఎందుకంటే తెలంగాణలో బిజేపి బలపడడానికి ప్రధాన కారణం ఎవరు? అని ఏ ఒక్కరినీ ప్రశ్నించినా బండి సంజయ్‌ అని టక్కున సమాధానం చెబుతారు. ఇలా ముగ్గురు నాయకులు మూడు పార్టీలలో వున్నారు. ఈ ముగ్గురిని సిఎం అభ్యర్థులుగా ఆయా పార్టీలు చేయగలవా? ఈసారి బిసి సిఎం అనగలరా! తీర్మానాలు చేస్తారా!! అందుకు అవసరమైన విధివిధానాలు ప్రకటిస్తామని చెప్పగలరా? నిక్కచ్చిగా ఇదే మా నిర్ణయం అని పార్టీలు ప్రకటిస్తాయా! రాజకీయ అవసరాల కోసం బిసి నాయకులను ముందు పెట్టి బిసి వాదం అనగానే సరిపోదు! మన పార్టీ ఎక్కడ వెనుకబడి పోతుందో అన్న ఆందోళనతో నాయకులను ముందుకు తోయొద్దు. ఒకవేళ పార్టీల ఆదేశాలు లేకుండా రాజకీయ పార్టీలలో వుంటే బిసి నాయకులు తమ విధానం ఇదీ అని ప్రకటించగలరా? ఒక అడుగు ముందుకేసి బిసిలకు ఎక్కువ సీట్లు ఇస్తామని ఇప్పుడు మాట్లాడే బిసి నేతలకు ఎన్నికల నాడు ఆ పార్టీలు టిక్కెట్లు ఇస్తాయా? తెలంగాణలో బిసి విధానంతో పార్టీలు నినాదం ఎత్తుకొమ్మని తోలిస్తే లాభం లేదు. మా పార్టీ గెలిస్తే వీళ్లే సిఎంలని చెప్పండి! రాజకీయంగా ప్రజల్లో వెనకబడిపోతున్నామని గ్రహించి బిసిలను ముందుపెట్టకండి. ఈ విషయాన్ని ఆ పార్టీలలో వున్న నాయకులు బాగా ఆలోచించి ముందుకు రావాలి. తర్వాత బిసిలను కూరలో కరివేపాకులు చేయాలనే అన్ని పార్టీలు చూస్తాయి. దేశంలో మూడు సార్లు, నాలుగు సార్లు, వరుసగా ముఖ్యమంత్రులు అయిన వాళ్లు ఎంతో మంది నాయకులున్నారు. కానీ కేసిఆర్‌ ను రెండో సారికే ఎందుకు దించేశారో ఇప్పటికీ మధనం జరుపుకోవడం లేదు. ప్రజలేం అమాయకులు కాదు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల కోసం అర్రులు చాచలేదు. కేసిఆర్‌ ను దించేయాలనుకున్నారు. ఆ స్పష్టత కనిపిస్తున్నా కేసిఆర్‌ అతి విశ్వాసానికి పోయారు. దెబ్బ తిన్నారు. పార్లమెంటు ఎన్నికలలో అందుకే మరింత ఘోర పరాభవం మూటగట్టుకున్నారు. ప్రజల్లో లేని నాయకుడు ఎప్పుడూ ప్రజా సేవకు పనికి రాడు. సరిగ్గా ఏపిలో కూడా అదే తీర్పు ఇచ్చారు. అయినా కేసిఆర్‌ ప్రజల కోసం బైటకు రాలేదు. ఒకవేళ ప్రజలు మళ్ళీ అధికారం ఇచ్చినా ఆయన జనం ముఖం చూడరు. పైగా అన్ని వర్గాలకు మేలు చేశానన్న భ్రమలో వున్నాడు. ఇతర వర్గాలను రాజకీయంగా ఎదగకుండా చేశాడు. వాళ్లు ముందుకొస్తే తన సీటుకు ఎసరొస్తుందనుకున్నాడు. అందుకే ప్రజలు కేసిఆర్‌ ను పక్కన పెట్టారు. ఇంకా ప్రజలు కేసిఆర్‌ ను నమ్ముతారనుకోవడం వృధా ప్రయాస. తనకు ఉద్యమ సమయంలో ఎంతో అండగా వున్న ఎంతో మంది బిసి నేతలను తర్వాత వారి ఉనికి ప్రశ్నార్థకం చేశాడు. ఓట్ల కోసం బిసి రాజకీయాలు ఓసిలకు అలవాటుగా మారింది. ఈసారి ఈసారి అలాంటి చిర్లర రాజకీయాలకు చెల్లు చీటే! పాడాల్సిన సమయం వచ్చింది. ఏ పార్టీ అయితే బిసి ముఖ్యమంత్రిని ప్రకటిస్తుందో ఆ పార్టీకే మనుగడ కనిపిస్తోంది. అందుకే బిసి ముఖ్యమంత్రి మా విధానం అని ప్రకటించండి. పార్టీల వేధికగా అన్ని పార్టీల అధినేతలు తీర్మానం చేయండి. మాట తప్పమని తేల్చి చెప్పండి. అప్పుడే బిసి నేతలను సమాజంలోకి పంపండి. బిసిల భుజం మీద బరువు పెట్టి, సీటేసుకొని కూర్చుంటారని తెలంగాణ సమాజానికి తెలియంది కాదు. బిసిలను అడుగుడుగునా వంచించడం పార్టీలు వంచించడం చూడంది కాదు. బిసిలకు రాజ్యాధికారం మీద అధ్యయనాలు ఎందుకు చేయరు! ఆ దిశగా అడుగులు వేయరెందుకు? పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఏం రాజకీయాలు అధ్యయనం చేస్తారు? ఈ మాట చెప్పడానికి కనీసం ఇంగితం వుండాలి. బిసిల జనాభాను బట్టి సీట్లు కేటాయిస్తామని చెప్పడానికి అధ్యయనాలు అవసరమా? కాలయాపన, ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప మరేమీ జరగదు. బిసిలు అంత అమాకులు కాదు. ఈసారి బిసి సిఎం అనకపోతే మీ తమాషాలు చెల్లవు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు పార్టీలు ఏక వాఖ్య తీర్మానం చేయాలి. లేకుంటే బిసి నేతలంతా కలిసి రాజకీయ వేధిక ఏర్పాటు చేయాలి. పార్టీలకు హెచ్చరికలు జారీ చేయాలి. యాచించడం కాదు, శాసించడం బిసిలు అలవర్చుకోవాలి. బిసి ముఖ్యమంత్రి నినాదం తెలంగాణలో మోత మోగించాలి. బిసి సభలు, సదస్సులు, అడుగడుగునా నిరంతరం ఏర్పాటు చేయాలి. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో బిసి ఉద్యమాలు రావాలి. ప్రతి బిసి మన బిసినే గెలిపిస్తా అని శపథం చేయాలి. అంతరాత్మ ప్రభోదంతో ఓటు వేయాలి. బిసి రాజ్యం కోసం ఒక్కసారి మన ఓట్లు మన కోసం అని కంకణం కట్టుకోవాలి. బిసిల రాజ్యాధికారం ఎందుకు సాధ్యం కాదో తేల్చుకోవాలి. సై అంటే సై అంటే తప్ప బిసిలు అధికారంలోకి రారు. బిసిలకు రాజ్యాధికారం దక్కదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!