ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి
ప్రధాని మోడీకి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి
రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలి
పంట వ్యర్థాలను కాల్చకుండా బయో గ్యాస్ ప్లాంట్‌లకు సరఫరా చేసి రైతులు అదనపు ఆదాయం పొందాలి
ఆధునిక సాగు పద్ధతులను అవలంబించడం ద్వారానే వ్యవసాయం పండుగలా మారుతుంది
గంభీరావుపేటలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో శంకుస్థాపన
సిరిసిల్ల(నేటి ధాత్రి):
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విజ్ఞప్తి చేశారు.
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట గ్రామంలోని పంతులుగారి తోటలో బయోస్ట్రాటమ్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటేడ్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి మంగళవారం డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ తో కలిసి భూమి పూజ చేశారు.
అలాగే సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గం లోని 11 ప్రాంతాలలో 30 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 33/11 కేవీ సబ్ స్టేషన్ లకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని ఒక ప్రధాన సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు.
తెలంగాణలో రైతులు పండించే ప్రతి పంటను కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర (ఎం ఎస్ పి) ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం మొత్తం తీసుకోవాలని కోరారు. రైతులకు ఆనేక రకాల ప్రోత్సహకాలు అందించి రైతులకు అండగా నిలబడిందన్నారు.
వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ వరి గడ్డిని ముడిసరుకుగా ఉపయోగించి బయో గ్యాస్ ఉత్పత్తి చేసే బృహత్తర ఆలోచనను రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం కార్యరూపంలోకి తెస్తోందన్నారు. సాధారణంగా పంట కోతల అనంతరం రైతులు పొలాల్లోనే గడ్డిని కాల్చివేయడం వల్ల వాతావరణం కలుషితమై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) పడిపోతున్న తరుణంలో, ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. దీనివల్ల పర్యావరణానికి రక్షణ కలగడమే కాకుండా, రైతులకు వ్యర్థాల ద్వారా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో, అభివృద్ధి చెందిన దేశాల బాటలో మన రైతాంగం కూడా అడుగులు వేయాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందన్నారు. సమాజానికి ఆహారాన్ని అందించే రైతు, ఆరోగ్యకరమైన గాలిని కూడా అందించాలనే ఉద్దేశంతో పంట వ్యర్థాలను కాల్చకుండా బయో గ్యాస్ ప్లాంట్‌లకు సరఫరా చేయాలని కోరారు.
మరోవైపు, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు పంట మార్పిడి విధానాన్ని రైతులు పాటించాలని కోరారు. కేవలం వరి మీదనే ఆధారపడకుండా ఉద్యానవన పంటలు, చిరుధాన్యాలు, ఆయిల్ పామ్ వంటి లాభదాయకమైన పంటల వైపు రైతులు దృష్టి సారించినప్పుడే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని తెలిపారు. వీటి సాగు వల్ల రైతులకు ఆదాయం పెరగడమే కాకుండా సమాజానికి పోషక విలువలతో కూడిన ఆహారం అందించిన వారవుతారని చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం, పండించిన ప్రతి గింజకూ కనీస మద్దతు ధర (ఎంఎస్ పి) కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉందని. మద్దతు ధర ప్రకటించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పుట చేసిందన్నారు. పాత పద్ధతులకు స్వస్తి పలికి, ఆధునిక సాగు పద్ధతులను అవలంబించడం ద్వారానే వ్యవసాయం పండుగలా మారుతుందని, ఈ మార్పులో రైతులందరూ భాగస్వాములు కావాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఎస్పీ మహేష్ బి గితే, అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఎస్పీ నాగేంద్రాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచ్ మల్లుగారి పద్మ తదితరులు పాల్గొన్నారు.
