మేడారం జాతర – బార్ కౌన్సిల్ ఎన్నికలు ఒకే రోజు!
న్యాయవాదుల్లో అయోమయం… వాయిదా వేయాలంటూ విజ్ఞప్తి
హైదరాబాద్, నేటిధాత్రి:
ఐదేండ్లకు ఒకసారి జరిగే తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలు ఈ నెల జనవరి 30న జరగనున్నాయి. మొత్తం 209 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మి తెలిపారు. 25 మంది సభ్యులను ఎన్నుకోడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 56,000 మంది న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహిళలకు 30 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఐదుగురు మహిళా సభ్యులను ఎన్నుకోనున్నారు.
మేడారం జాతర వివరాలు.
రెండేళ్లకు ఒకసారి జాతీయ స్థాయిలో నిర్వహించే ఆదివాసీ జాతర అయిన మేడారం మహాజాతర రోజే తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు (30జనవరి) జరగనుండటం న్యాయవాదుల్లో తీవ్ర అయోమయానికి దారి తీస్తోంది.
మేడారం జాతరలో 30 జనవరి శుక్రవారం రోజు గద్దెలపై అమ్మవార్లు దర్శనం, మొక్కు సమర్పణ ప్రధాన ఘట్టాలు జరుగుతాయి. లక్షలాది భక్తులు హాజరయ్యే ఈ ఆదివాసీ ఉత్సవం తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచింది.
మేడారం జాతరలో భాగంగా ఈ నెల 30వ తేదీన గద్దెలపై ఇద్దరు అమ్మవార్లు దర్శనమివ్వనుండగా, అదే రోజు భక్తులు మొక్కులు సమర్పించుకునే ప్రధాన ఘట్టం కూడా జరగనుంది. అయితే అదే తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించనుండటంతో, జాతరకు వెళ్లాలనుకునే న్యాయవాదులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.
జాతరకు వెళ్లలేకపోతున్న న్యాయవాదులు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు కుటుంబ సమేతంగా మేడారం జాతరకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు, జాతర ఒకే రోజు పడటంతో భక్తి – వృత్తి మధ్య ఎంపిక చేయాల్సిన పరిస్థితి వచ్చిందని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలు వాయిదా వేయాలన్న డిమాండ్?
మేడారం జాతర ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, బార్ కౌన్సిల్ ఎన్నికలను జాతర ముగిసిన అనంతరం నిర్వహించాలని పలువురు న్యాయవాదులు కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో న్యాయవాదులు జాతరకు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ఎన్నికలు వాయిదా వేయడం సమంజసమని వారు అభిప్రాయపడుతున్నారు.
200 మందికి పైగా పోటీ?
ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సుమారు 200 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు సమాచారం. కీలకమైన ఎన్నికల సందర్భంగా ఓ వైపు పవిత్ర ఆదివాసి జాతర, మరో వైపు ఎన్నికలు ఉండటంతో న్యాయవాదులు తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు.
మేడారం మహాజాతరకు ఆటంకం కలగకుండా, న్యాయవాదుల మనోభావాలను గౌరవిస్తూ ఎన్నికల తేదీని పునఃపరిశీలించాలని బార్ కౌన్సిల్ అధికారులను వారు కోరుతున్నారు.
