స్థానిక సంస్థలు ఆదాయ వనరులు పెంచుకోవాలి

ఆదాయ వనరుల పెంపుపై స్థానిక సంస్థలు దృష్టి సారించాలి.

రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య,

తూర్పు తెలంగాణా జిల్లాల స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సు

సూర్యాపేట, నేటి ధాత్రి:

నుంచి స్థానికంగా అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. అనవసర వ్యయాన్ని తగ్గించుకుని, ఆదాయ వనరుల ద్వారా రాబడిని పెంచుకున్నప్పుడే స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. సూర్యాపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శుక్రవారం తూర్పు తెలంగాణా ప్రాంతీయ స్థానిక సంస్థల సదస్సు నిర్వహించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని దేవి, సభ్యురాలు సుజానా యాదవ్, సభ్యుడు ఎస్.సుధీర్ రెడ్డిలతో కలిసి చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సమీక్ష నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ తమతమ జిల్లాలలో స్థానిక సంస్థల పనితీరు గురించి చైర్మన్ కు వివరించారు. నగర పాలక సంస్థలు, మున్సిపల్ పట్టణాలు,గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, తడి, పొడి చెత్త సేకరణ, పచ్చదనం పెంపు, పన్ను వసూళ్లు, స్వయం ఉపాధి పథకాల అమలు, ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం కొనసాగుతున్న కార్యక్రమాలు, గ్రాంట్స్ రూపంలో సమకూరుతున్న ఆదాయం, ఇతర మార్గాల ద్వారా స్థానిక సంస్థలకు అందుతున్న రాబడి తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల ప్రజలను కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వాములు చేస్తూ, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని హితవు పలికారు. ఆదాయ వనరులు అభివృద్ధి చేసుకుని పల్లె పట్టణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం శాస్త్రీయ దృక్పథంతో పని చేయాలని మార్గనిర్దేశం చేశారు. చైతన్యవంతమైన సమాజ నిర్మాణం జరిగి, అన్ని వర్గాల వారు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నదే ఆర్థిక సంఘం ధ్యేయమని చైర్మన్ స్పష్టం చేశారు. ఆర్థిక అసమానతలు, సామాజిక వ్యత్యాసాలు సమసిపోయి, మానవ సంపద, వారి శక్తియుక్తులు సమాజానికి ఉపయోగపడేలా కృషి జరగాలన్నారు. ఈ దిశగా ప్రజలకు ప్రభుత్వానికి కమిషన్ వారధిగా నిలుస్తూ సామాజిక అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఫైనాన్స్ కమిషన్ సూచనలు చేస్తుందని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో ప్రతి నివాస గృహానికి రక్షిత మంచినీరు సరఫరా జరిగేలా పారిశుధ్య నిర్వహణ పక్కాగా కొనసాగేలా స్థానిక సంస్థలు నిశిత పర్యవేక్షణ చేయాలన్నారు. ఇటీవలే కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీల సర్పంచ్ లు, మేయర్లు, చైర్ పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజలకు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, స్థానిక సంస్థల బలోపెతంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. నిధుల కోసం పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఆధారపడకుండా స్థానికంగా ఆదాయం సమకూర్చే అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. పన్ను వసూళ్లు, ప్రకటనలపై వచ్చే రాబడి, వృత్తి పన్ను, వ్యాపార వాణిజ్య సముదాయాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి నిర్ణీత రుసుము వసూలు చేస్తూ స్ధానిక సంస్థలు ఆర్థిక పరిపుష్టి సాధించేలా కృషి చేయాలని అన్నారు. స్థానిక సంస్థలలో ఆదాయం వనరులు పెంపొందించుకునేందుకు గల అవకాశాలపై ప్రజాప్రతినిధులు, అధికారుల నుండి సలహాలు స్వీకరించారు. వీటిని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని చైర్మన్ సిరిసిల్ల రాజయ్య వెల్లడించారు. సదస్సులో గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ తెలిపారు. జిల్లాలోని గ్రామాలను మున్సిపాలిటీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించినట్లని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యం రావడమే అసలైన లక్ష్యమని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రతి గ్రామం, మున్సిపాలిటీని ఒక మోడల్‌గా తీర్చిదిద్దాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయడం ద్వారా గ్రామాలు బలోపేతం అవుతాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా స్థానికంగా ఆదాయం పెరిగేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులకు నిధులు అవసరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పన్నులు కట్టేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేసి గ్రామాలను ప్రగతి పథంలో నడిపించాలని కోరారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా యంత్రాంగం పనిచేస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్,నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నగర మేయర్లు, ఛైర్పర్సన్ లు, ఎక్స్ ఎం.పి.టి.సి.లు, ఎక్స్ జడ్.పి.టి.సి లు సర్పంచులు, మునిసిపల్ కమీషనర్ లు, డిపిఓ లు, ఎంపిడిఓ లు, ఎన్జిఓస్, సూర్యాపేట అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, నల్గొండ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,సూర్యాపేట జెడ్పీ సీ.ఈ.ఓ డి. శిరీష, నల్గొండ జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీపీఓ యాదగిరి, డిఎంహెచ్వో వెంకటరమణ డీఎల్పీఓలు, ఎంపీఓలు, ఎంఈఓ లు గ్రామపంచాయతి కార్యదర్శులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version